కార్తిపై హిందూ సంఘాలూ గ‌రం గ‌రం!

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమా అంటే మేక‌ర్స్‌, హీరోలు భ‌య‌ప‌డే ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయి. ఏ క‌థ ఎంచుకుంటే ఏ వ‌ర్గం త‌మ మ‌నో భావాలు దెబ్బ‌తీశారంటూ ర‌చ్చ చేస్తారేమోన‌ని భ‌యప‌డే వాతావ‌ర‌ణం రోజు రొజుకీ ముదురుతోంది. ఇటీవ‌ల వ‌రుణ్‌తేజ్ న‌టించి వాల్మీకి చిత్ర టైటిల్‌ని మార్చాల్సిందే అంటూ కొంత మంది నానా హంగామా చేసి చివ‌రికి ఆ టైటిల్ ని చివ‌రి నిమిషంలో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా మార్చాల్సి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా అలాంటి వివాద‌మే కార్తి చిత్రం చుట్టూ అలుముకుంటోంది. రెమో ఫేమ్ భాగ్యరాజ క‌న్న‌న్ ద‌ర్శ‌కత్వంలో కార్తి ఓ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే.

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు సుల్తాన్‌ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. టిప్పు సుల్తాన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ని భావించిన హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి, శివ‌సేన ఈ సినిమా షూటింగ్‌ని నిలిపివేయాల‌ని ఆందోళ‌న చేప‌ట్టాయి. బుధ‌వారం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న లొకేష‌న్‌కి గుంపులుగా వ‌చ్చి షూటింగ్‌ని జ‌ర‌గ‌నీయ‌కుండా అడ్డుకున్నారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన నిర్మాత‌లు ఆర్‌.ఎస్‌.ప్ర‌భు మీడియా ముందుకు వ‌చ్చి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. ఈ సినిమా ఏదో టిప్పు సుల్తాన్ స్టోరీ ఆధారంగా నిర్మించ‌డం లేద‌ని, స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కే సుల్తాన్‌ టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నామే కానీ ఇంకా ఫైన‌ల్ చేయ‌లేద‌ని వెల్ల‌డించారు.