వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని … ఘాజీతో జాతీయ అవార్డ్ అందుకున్న సంకల్ప్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్,పాటలు అన్నీ కూడా సినిమా పై క్రేజ్ పెంచాయి. బిజినెస్ కూడా బాగా జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే బిజినెస్ పరంగా ఊహించని ట్విస్ట్ లాస్ట్ మినిట్ లో పడిందని టాక్.
ఈ చిత్రం ఆంధ్రా రైట్స్ తీసుకున్న అర్జున్ అనే డిస్ట్రిబ్యూటర్ వెనక్కి వెళ్లాడని ట్రేడ్ వర్గాల టాక్. ఏడు కోట్లకు డీల్ సెట్ చేసుకున్న అర్జున్ ఎందుకు వెనకడుగు వేసాడనేది మాత్రం బయిటకు రాలేదు. దాంతో నిర్మాతలు మరో డిస్ట్రిబ్యూటర్ తో డీల్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఓ డిస్ట్రిబ్యూటర్ ఇలా వెనకడుగు వేస్తే అది హోల్ సేల్ గా మొత్తం బిజినెస్ మీద పడుతుంది. లేనిపోని అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుంది. దాంతో ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యినట్లు చెప్తున్నారు. రిలీజ్ డేట్ డిసెంబర్ 21 దగ్గర పడటంతో టీమ్ ఆ హడావిడిలో ఉంది.
చిత్రం విషయానికి స్తే.. జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్‌లో ఈ అంతరిక్షం సినిమాను చిత్రీకరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక విభాగం పని చేశారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో అంతరిక్షం చిత్రానికి అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవనున్నాయి.
హీరో వరుణ్ తేజ్ తో పాటు పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ కోసం.. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధపడినట్లుగా సమాచారం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.