‘అంత‌రిక్షం’ పై యండమూరి కేసు వెయ్యడు కదా?

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘అంత‌రిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని … ఘాజీతో జాతీయ అవార్డ్ అందుకున్న సంక‌ల్ప్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్,పాటలు అన్నీ కూడా సినిమా పై క్రేజ్ పెంచాయి. బిజినెస్ కూడా బాగా జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓ తెలుగు ఆధారంగా తెరకెక్కిందనే ప్రచారం మీడియాలో మొదలైంది.

యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ అప్పట్లో రాసిన సైన్స్ ఫిక్షన్ న‌వ‌ల ‘చీక‌ట్లో సూర్యుడు’ ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేసాడంటున్నారు. ఆ నవలలో ఉన్న పాయింట్ కు, ఈ సినిమాలో లవ్ స్టోరీకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో టాక్ మొదలైంది.

యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రచించిన ‘చీక‌ట్లో సూర్యుడు’లో కూడా స్పేస్ గురించిన కథే. ఆ నవలలో కూడా ఈ సినిమాలో ఉన్నట్లే హీరో హీరోయిన్ ఇద్దరూ అస్ట్రోనాట్‌లే. వీరిద్దరూ ప్రేమించుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అనుకోకుండా వాళ్లిద్ద‌రే కొంత‌కాలం అంత‌రిక్షంలో ఉండాల్సి వ‌స్తుంది. అప్పుడు వీరిద్దరి మధ్య ఎదురైన సంఘటనలు, మళ్లీ తిరిగి ఎలా కలుసుకున్నారనేది ‘చీక‌ట్లో సూర్యుడు’ క‌థ‌. ఇప్పుడు ఇంచుమించు అదే పాయింట్ మన ముందుకు రానున్నాడు సంకల్ప్ అని అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

అయితే ఈ మాత్రం కాపీ టాక్ వస్తే వేరే భాషలో ఈ పాటికి కోర్టుకు ఎక్కేసి ..అటు ఇటో తేల్చుకునేందుకు ఉత్సాహం చూపించేద్దురు. కానీ యండమూరి వీరేంధ్రనాధ్ వంటి వాళ్లు అలా తొందరపడే వ్యక్తిత్వం ఉన్నవాళ్లు కాదు. సినిమా చూడకుండా …అందులో కంటెంట్ ఏంటో కరెక్ట్ గా తెలియకుండా ముందుకు అడుగువెయ్యరు. అందులోనూ చిరంజీవి ఫ్యామిలీతో యండమూరి మంచి అనుబంధం కూడా ఉంది. గతంలో యండమూరి నవలలతో చిరంజీవి సినిమాలు సైతం చేసి సూపర్ హిట్స్ కొట్టారు.

చిత్రం విషయానికి స్తే..

జీరో గ్రావిటీలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెట‌ప్‌లో ఈ అంత‌రిక్షం సినిమాను చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్న‌త సాంకేతిక విభాగం ప‌ని చేశారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అంత‌రిక్షం చిత్రానికి అద్భుత‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి.

హీరో వ‌రుణ్ తేజ్ తో పాటు ప‌లువురు న‌టీన‌టులు కూడా ఈ చిత్రంలోని యాక్ష‌న్ సీక్వెన్సుల కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నారు. ‘అంత‌రిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ కోసం.. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధపడినట్లుగా సమాచారం. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌శాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం విడుద‌ల కానుంది.