ఏపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్న సందర్భంగా టాలీవుడ్ గురించిన ఆసక్తికర చర్చ ఉత్తరాంధ్రను వేడెక్కిస్తోంది. రాజధాని వ్యవహారంతో పాటే.. విశాఖలో మరో టాలీవుడ్ నెలకొల్పాలన్న సంకల్పం జగన్ వద్ద ఉందన్న చర్చా ఇప్పటికే హీట్ పెంచుతోంది. తొలుత రాజధాని సెటప్ పూర్తవ్వగానే కొత్త టాలీవుడ్ విషయమై జగన్ దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీ ఎఫ్‌డీసీ అధ్యక్షుడు పదవిని నటుడు విజయ్ చందర్ కి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకూ ఏపీ సినిమాటోగ్రఫీ శాఖను మాత్రం ఎవరికీ కేటాయించలేదు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కి సినిమాటోట్రఫీ శాఖను కేటాయించే వీలుందని జగన్ తనతో అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మా డైరీ 2020 ఆవిష్కరణలో వెల్లడించారు. ఇక సినీపెద్దలు తనని సంప్రదిస్తే కొత్త టాలీవుడ్ సెటప్ గురించి చర్చిస్తానని జగన్ అన్నట్టుగా చిరు క్లూ ఇవ్వడం వేడెక్కిస్తోంది. ఇక విశాఖ భీమిలి పరిసరాల్లో మెగాస్టార్ చిరంజీవికి వందల ఎకరాల భూమి ఉందన్న ప్రచారం ఉండనే ఉంది. ఆ క్రమంలోనే మరో టాలీవుడ్ నెలకొల్పేందుకు మెగాస్టార్ ఆసక్తిగా ఉన్నారని .. ఈ విషయాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డితో ముచ్చటించారని ప్రచారమవుతోంది. ఇక వైజాగ్ లో ఇప్పటికే రామానాయుడు స్టూడియోస్ ఉంది. 90శాతం టాలీవుడ్ షూటింగులు వైజాగ్-అరకు బెల్ట్ లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజధాని అవ్వగానే విశాఖ టూరిజంకి కొత్త ఊపు తెచ్చేందుకు వైయస్ జగన్ టాలీవుడ్ ఏర్పాటును షురూ చేయనున్నారని తెలుస్తోంది. —