బీజేపీ వైపు చూస్తున్న వైసీపీ మాజీ మంత్రి.?

తెలుగు దేశం పార్టీలోకి వెళ్ళలేరు.. జనసేన పార్టీలోకి వెళ్ళేందుకూ అవకాశం లేదు. వైసీపీలో టిక్కెట్టు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. వాట్ నెక్స్‌ట్.? మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ దుస్థితి ఇది.!

నిజమేనా ఇదంతా.? వైసీపీలో ఆయనకు ఎందుకు మళ్ళీ టిక్కెట్ దొరకదు..? ఆయన స్థానంలో వైసీపీ అధినాయకత్వం ఇంకెవర్ని అయినా ఖరారు చేయబోతోందా.? అంటే, గత కొంతకాలంగా అవంతి శ్రీనివాస్ తీరుతెన్నులపై వైసీపీ అధినాయకత్వం ఒకింత అసహనంతో వుందన్న గుసగుసలు అయితే విశాఖ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.

టీడీపీ నుంచి వైసీపీలోకి దూకారు అవంతి శ్రీనివాస్.. అది 2019 ఎన్నికల సమయంలో జరిగిన మాట. అనూహ్యమైన నిర్ణయమే తీసుకున్నారు అప్పట్లో ఆయన. దానికి ఆయనకు జరిగిన మేలే ఎక్కువ. మంత్రి అయ్యారు కూడా.! కానీ, ఆ పదవిని కొనసాగించుకోలేకపోయారు విస్తరణలో.

అప్పటినుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు అవంతి. క్రమంగా అవంతి హవా వైసీపీలో తగ్గుతూ వచ్చింది. ‘2024 ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా పార్టీ మారతారు..’ అని వైసీపీ శ్రేణుల్లో ప్రచారం గుప్పుమంటోంది.

టీడీపీతో టచ్‌లోకి వెళ్ళారట.. జనసేనతోనూ మంతనాలు జరిపారట.. వీటికి సంబంధించి వైసీపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయట ఆయనకు వ్యతిరేకంగా.

వైసీపీ నుంచి టిక్కెట్ ఎటూ దొరకదు గనుక, ఆయన ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ బీజేపీ.! టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు పెట్టుకుంటే, తనకు లాభిస్తుందనీ ఆయన ఆశిస్తున్నారట. ఈసారి లోక్ సభకే పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారట.