వైసీపీని టెన్షన్ పెడుతున్న ప్రజారాజ్యం ఫస్ట్ ఎమ్మెల్యేలు!

ఒకపక్క వైకాపా అధినేతేమో రాబోయే ఎన్నికల్లో “వైనాట్ 175” అంటుంటే… మరోపక్క అధినేత ఆలోచనలు అర్ధం చేసుకోని కొందరు సీనియర్లు చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నారు. పనికిమాలిన అలకలమాటున పార్టీకి కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా పదవులు ఇచ్చినా… కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు.. పార్టీని, అధినేతను ఇబ్బంది పెడుతున్నారు. ఫలితంగా కేడర్ ను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ వ్యవహారం ప్రస్తుతం విశాఖలో వైసీపీని ఇబ్బంది పెడుతుందని అంటున్నారు! ఇందులో భాగంగా… పంచకర్ల రమేష్ బాబు పేరెత్తితే అంతెత్తున లేస్తున్నారని, ఆయనకు పదవి ఇచ్చినప్పటినుంచీ పార్టీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. విశాఖ వైసీపీలో అత్యంత కీలక నేతైన అవంతి… కేడర్ ను కలుపుకు పోవడం సంగతటుంచి, తన సమకాలీకులైన నేతలతో కూడా కలిసి నడవలేకపోతున్నారని తెలుస్తుంది. అయితే… ఈ విషయంలో అవంతి అలకకు కారణం… రమేష్ బాబుని విశాఖ జిల్లా ప్రెసిడెంట్ ని చేయడమేనట!

నిజానికి విశాఖ జిల్లా నుంచి ఈ ఇద్దరూ ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి నియోజకవర్గం నుంచి, అవంతి శ్రీనివాస్.. భీమిలీ నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. తర్వాతి కాలంలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అవ్వడంతో… ఈ ఇద్దరూ కాంగ్రెస్ నేతలైపోయారు. అనంతరం 2014 ఎన్నికల నాటికి టీడీపీలో చేరిపోయారు. ఫలితంగా.. 2014లో అనకాపల్లి ఎంపీగా అవంతి గెలిస్తే.. యలమంచిలి ఎమెల్యే గా రమేష్ బాబు ఎన్నికయ్యారు!

అనంతరం 2019లో అవంతి శ్రీనివాస్ ముందుగానే టీడీపీని వదిలి వైసీపీలో చేరిపోయారు. కానీ… పంచకర్ల మాత్రం చివరి నిమిషంలో ఆగిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడం, అవంతి శ్రీనివాస్ ని మంత్రిపదవి వరించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో.. మూడేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్… మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి రాకుండా అడ్డుకోగలిగారు కానీ.. పంచకర్ల రాకను ఆపలేకపోయారు.

అనంతరం మూడేళ్లకు అవంతి మంత్రి పదవి పోయినా కూడా జిల్లా ప్రెసిడెంట్ హోదాలో కంటిన్యూ అయిపోతున్నారు! అయితే… ఈ మధ్య అవంతిని తప్పించి.. రమేష్ బాబుకి జిల్లా ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చింది అధిష్టాణం! దీంతో అవంతి తట్టుకోలేకపోతున్నారని, ఫలితంగా… నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు విశాఖ వైసీపీ కేడర్! ఇది సరైన పద్దతి కాదని… అవంతికి ఎంత విలువివ్వాలో జగన్ ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారని… ఇదే సమయంలో మిగిలిన నేతలకు కూడా ప్రాధాన్యత కలిగిస్తారని… వాటిని సాదరంగా ఆహ్వానించాలే తప్ప… ఇలా అలగడం అర్ధంలేని విషయమని చెబుతున్నారు మిగిలిన నేతలు!

దీంతో… అన్నీ పదవులూ తనకే కావాలి, అన్ని హోదాలూ తానే అనుభవించాలని భావిస్తారో.. లేక, మిగిలినవారంతా అనర్హులని ఆలోచిస్తారో.. అదీగాక, పార్టీ పరిస్థితిని ఏమాతం పట్టించుకోకుండా స్వలాభం కోసమే పరితపిస్తారో తెలియదు కానీ… అవంతి వైఖరి ఇలా ఉండటంపై సీనియర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో… ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో… విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని జగన్ బలంగా ఫిక్సయిన తరుణంలో… ఆ ప్రాంతానికి చెందిన అవంతి లాంటి సీనియర్ ఇలా ప్రవర్తించడం వైసీపీకి బ్యాడ్ న్యూసే అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో పెద్దలు వీలైనంత తొందర్లో ఈ విషయాన్ని పరిష్కరించుకుని ముందుకు కదలాలని సూచిస్తున్నారు!