మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌పై నమోదైన దావా తనకు మరణశిక్షను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని పరిచయపరుస్తూ, కొన్ని దేశాల్లో సామాజిక మాధ్యమాలపై కఠిన నిబంధనలు అమలవుతున్నాయని అన్నారు.
ఫేస్‌బుక్‌లో ఎవరో యూజర్ పోస్ట్ చేసిన కంటెంట్‌కు తానే బాధ్యుడిని అవ్వాలని పాకిస్థాన్‌లో కేసు నమోదైందని, ఆ దేశ చట్టాల ప్రకారం తనకు మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు. ఆయా దేశాల్లో తమ సంస్థలు నిబంధనలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వాలు ఈ విషయంలో విదేశాల్లో ఉన్న టెక్ కంపెనీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ ప్రభుత్వం 2024 ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల వల్ల ఫేస్‌బుక్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను బ్యాన్ చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ప్రచారం కోసం ఈ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగిస్తున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాక్‌లో మెటా సంస్థ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
సోషల్ మీడియా నియంత్రణపై పాక్ తీసుకుంటున్న చర్యలు, అంతర్జాతీయ కంపెనీల భద్రతపై జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. టెక్ కంపెనీలకు, ప్రభుత్వం తీసుకునే నిబంధనలకు మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అనే విషయంపై ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.