MP Appala Naidu: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జోస్యం చెప్పారు. వార్డు మెంబర్ నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు అన్ని చోట్లా కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం 16 నెలల కాలంలోనే చేసి చూపించారని అప్పలనాయుడు కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులకు ప్రజలు ఎన్నికల ద్వారా బుద్ధి చెబుతారని ఆయన విమర్శించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడుకి రెండు కళ్లు లాంటివని ఎంపీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, పార్టీకి అక్కడ మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై పార్టీ అధిష్ఠానం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అప్పలనాయుడు స్పష్టం చేశారు.

