వైకాపా వర్సెస్ బిజెపి పోరు ఎవరికి లాభిస్తుంది?

YCP and BJP

రాష్ట్రంలో వైకాపా జనసేన కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిద్ధమౌతున్నాయి. టిడిపి బలహీనపడే తాము ప్రధాన ప్రతిపక్షం స్థానం పొందాలని ఉబలాట పడుతున్నాయి. టిడిపి కన్నా ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సిద్ధమౌతున్నాయి వచ్చే ఎన్నికల లోపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బాగా బలహీన పడితే తప్ప ఈ లోపు ఎవరు పోరాడి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగడితే అది తెలుగు దేశం పార్టీకే లాభిస్తుంది. ఎన్నికల నాటికి చాంపియన్ ఎవరో వారే ముందు వుంటారు.

ప్రస్తుతం మరోవైపు రాష్ట్రంలో వైకాపా ప్రధాన ప్రతి పక్షాల మధ్య వాగ్యుద్దాలు సాగుతున్నాయి. అధికార దండంతో టిడిపి నేతలను వైకాపా ముప్పతిప్పలు పెడుతోంది. కర్మ కాలి కరోనా వైరస్ వ్యాప్తి వుంది కాబట్టి టిడిపి క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించి పోరాటాలు చేయలేక పోతోంది. ఇది ఒక రకంగా వైకాపాకు కలిసొచ్చింది. టిడిపికి మైనస్ పాయింటే. అయితే ఇందులో మరో ప్రమాదకరమైన ట్విస్ట్ వుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఏమేరకు వుందో అధికార పార్టీకి అంతుపట్టడం లేదు. అందుకే ఉద్యోగులకు పూర్తిగా జీతాలు ఇవ్వలేకున్నా సంక్షేమ పథకాల కింద నగదు పంపిణీ నిరాఘాటంగా సాగిస్తున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతి పక్షం కూడా ప్రభుత్వ వ్యతిరేకతపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం లేదు. వైకాపా టిడిపి పార్టీల వాగ్యుద్దాల మధ్య బిజెపి జనసేన పోరాటాలు తీవ్రతరం చేయనున్నాయి. ఇది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం. ఈ కరోనా వైరస్ నిర్మూలనలో ప్రభుత్వ చర్యలు చాలవనే భావన ఎక్కువగా పొడసూపుతోంది. అంతిమంగా ఇది ప్రభుత్వానికి ఎంత వరకు అపకారం చేస్తుందో వేచి చూడాలి. ఇందులో సెంట్ మెంట్ ఉత్పన్నం కావడం ప్రమాదమే.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం మూట గట్టుకొన్న తర్వాత ఇక తమకు లైన్ క్లియర్ అయినట్లు కమలనాథులు భావించారు. టిడిపి ఎమ్మెల్యేలు గంప గుత్తుగా బిజెపి తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ప్రచారం సాగించారు. శాసన సభలో తామే ప్రతి పక్షం కాబోతున్నట్లు కొందరు బిజెపి నేతలు కలలు కున్నారు.  గతంలో కూడా 2014 ఎన్నికల తర్వాత ఇలాగే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేల మట్టమైనందున ఏర్పడిన రాజకీయ శూన్యతను తమ పార్టీ భర్తీ చేస్తుందని ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అప్పట్లో పదేపదే ప్రకటనలు చేశారు. కాని కన్నా లక్ష్మీనారాయణ తప్ప ఒక్క కాంగ్రెస్ నేత బిజెపి వేపు చూడ లేదు. 2019 ఎన్నికల తర్వాత కూడా కమలనాథులు టిడిపి గురించి అదే విధంగా కలలు గన్నారు. కాని వైకాపా వేపు అన్నా కొంత మంది టిడిపి నేతలు వెళ్లారు. గాని బిజెపి వేపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. కాకుంటే పారిశ్రామిక వేత్తలుగా కాంట్రాక్టర్లుగా వుండిన రాజ్యసభ సభ్యులు తమ దోపిడీ సామ్రాజ్యం కాపాడుకునేందుకు బిజెపి చెంత చేరారు. ప్రజా పునాది గల వారెవ్వరూ వెళ్లలేదు. సంవత్సరం గడచిన తర్వాత గాని కమల నాథులకు తత్వం బోధ పడలేదు.ఎంత వరకు నిజమో తెలియదు. గాని వచ్చే ఎన్నికల నాటికి టిడిపితో బిజెపికి పొత్తు వుంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పార్టీ పునాది నిర్మాణం లేకున్నా అసంఘటిత మైన అభిమానులతో ఎంతో కొంత మేరకు విజయం సాధించగలనని భావించిన పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో తీవ్ర నిరాశ మిగిలింది. అదే దుస్థితి బిజెపికి ఎదురైంది. ఈ పూర్వ రంగంలో ఓటమి చవి చూచిన జన సేన బిజెపి రెండూ జట్టుకట్ట వలసిన అగత్యం తప్పలేదు. రెండు పార్టీలకు వేరు గత్యంతరం లేక పోయింది. స్వతంత్రగా ఇద్దరిలో ఏ ఒక్కరూ ఎదగ లేరు. ఏలాగూ టిడిపితో జట్టుకట్టే పరిస్థితి ఈ రెండు పార్టీలకు లేనందున నీకు నేను నాకు నీవు అని కింద మీద పడి కొన్నాళ్లు నాన బెట్టి తుదకు జట్టు కట్టాయి. అంత వరకు బాగానే ఉంది.

వైకాపా పాలన తొలి రోజులను తప్పించితే క్రమేణా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి శ్రేణుల యెడల కూడా తన తడాఖా రుచి చూపించారు. ప్రధానంగా అమరావతి రాజధాని రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎపిసోద్ తారా స్థాయికి తీసుకెళ్లింది. ఈ పరిస్థితుల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైకాపాకు వ్యతిరేకంగా సంధించే అస్త్రాలనే బిజెపి నేతలు ఎక్కుపెట్టక తప్పడం లేదు. దాని ఫలితమే కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయాడని వైకాపా నేతలు ఆరోపణలు చేయడం. ఈ లోపు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ల్లో వుండి పోవడంతో మెయిన్ స్ట్రీమ్ లోనికి రాలేదు.

అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడు విధానాలు కావచ్చు కారణాలు ఏవైనా రాష్ట్ర బిజెపి పార్టీతోనే కాకుండా కేంద్ర బిజెపి నాయకత్వంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య కూడా సత్సంబంధాలు కొర వడ్డాయి. తుదకు కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలతో తారా స్థాయికి చేరాయి.

ఇంతవరకు తటపటాయించుతుండిన రాష్ట్ర బిజెపి నేతలు జన సేనతో కలసి రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు పోరాడేందుకు సిద్ధం కావడం తాజా పరిణామం. గమనార్హమైన అంశమేమంటే ఇంత కాలం తెలుగు దేశం పార్టీ ఏ ఆరోపణలైతే వైకాపాకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నదో వాటినే బిజెపి జనసేన పార్టీలు వల్లే వేయ వలసి వస్తోంది. అంటే ఒక వేపు టిడిపి మరోవైపు బిజెపి జనసేన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టడి చేసే పరిస్థితి ఏర్పడింది. సమస్యలు అంశాలు ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికీ వ్యతిరేకంగా జరిగే పోరాటాలు మాత్రం వేర్వేరుగా వుండ బోతున్నాయి. కాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలిసొచ్చిన అంశమేమంటే కరోనా కల్లోలంతో ఏ పార్టీ కూడా కార్యకర్తల స్థాయిలో ధర్నాలు దీక్షలు సాగించ వలసినదే గాని తుదకు రాస్తారోకో లాంటి పోరాటాలు చేయ లేరు.ఒక వేళ ఈలోపే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత వున్నా అది బహిరంగంగా వ్యక్తమయ్యే అవకాశం లేదు.

ఇదిలా వుండగా మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయినా సంప్రదాయంగా వుండే ఓటు బ్యాంకుతో పాటు కార్యకర్తల బలం పార్టీ నిర్మాణం వుంది. కాని అదే సమయంలో బిజెపికి నేతలు వున్నారు. గాని పటిష్టమైన పార్టీ నిర్మాణం కార్యకర్తలు లేరు. అంతే కాదు. జనసేనకు అసంఘటిత సినిమా ఫాన్స్ వున్నారు నేతలు లేరు.వీరిని ఉపయోగించుకొనే గట్టెక్కాలని బిజెపి జనసేనతో జట్టు కట్టింది. . మరో విశేషమేమంటే ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి భావ జాలం ఏ మాత్రం పని చేయదు. హిందుత్వానికి తావు లేదు. తెలంగాణ పరిస్థితి వేరు. ఆంధ్ర ప్రదేశ్ లోని సామాజిక సాంస్కృతిక స్వభావం బిజెపి భావ జాలానికి పూర్తి భిన్నమైనది. ఫలితంగానే ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపికి ఓటు బ్యాంకు వుండదనే 2014 లో కాంగ్రెస్ నేతలు 2019 తర్వాత టిడిపి నేతలు బిజెపి చెంత చేర లేదు.

రాజ్యసభలో వైకాపా అండ కావాలి కాబట్టి అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసుకొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు కాబట్టి ఇరువురు ప్రస్తుతం మార్జాల దాంపత్యం సాగిస్తున్నారు. మరో వేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలనే భావనతో బిజెపి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ఎగదోస్తున్నట్లుంది. ఈ నేపథ్యంలో బిజెపి జనసేన కలసి వైకాపాకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న సాగించనున్న పోరాటం అంతిమంగా బలమైన కేడర్ కలిగి వైకాపాను నిలువరించ గల టిడిపికి లాభిస్తుంది. ఒక వేళ అయితే గియితే వైకాపాకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఏర్పడితే అప్పటికి టిడిపి బలహీన పడితే వైకాపాను ఎవరైతే ఓడించగలరో వారికే లాభిస్తుంది. 2019 ఎన్నికల్లో ఈ అంశం స్పష్టమైంది. జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎంత మొత్తుకున్నా తనుకూడా గెలుపొంద లేక పోయారు. తుదకు వామపక్షాలు కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డికి లాభించింది. రేపు మున్ముందు కూడా ఇదే సూత్రం అమలు జరుగుతుంది