చీరాల నుండి ఆమంచి అవుట్.. షాకింగ్ రీజ‌న్ ఇదే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రకాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్. ప్ర‌స్తుతం అధికార వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్న ఆమంచిని, చీరాల‌ను ఖాళీ చేయాల‌ని వ‌త్తిడి చేస్తున్నార‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ప‌క్క‌నే ఉన్న ప‌ర్చూరు నియోజ‌వ‌ర్గానికి వెళ్ళాల‌ని వ‌త్తిడి చేస్తున్నార‌ట‌. మ‌రి దీనికి ఆమంచి ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే, చీరాల‌లో ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్ధులుగా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్, క‌ర‌ణం బ‌ల‌రాంలు ఇప్పుడు ఒకే గూటికి చేరాయి. దీంతో చీరాల‌లో ఆదిప‌త్య‌పోరుకు తెర‌లేచింది. గ‌త ఎన్నిక‌ల్లో చీరాల ఫైట్‌లో ఆమంచి పై విజ‌యం సాధించిన క‌ర‌ణం బ‌ల‌రాం, ఆ త‌ర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పేసి, వైసీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అప్ప‌టి వ‌ర‌కు చీరాల‌లో తిరుగులేకుండా ఉన్న ఆమంచికి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే బ‌ల‌రాంకి మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంది.

ఈ నేప‌ధ్యంలో వైసీపీ పెద్ద‌లు చీరాల స‌మ‌స్య పై ఫోక‌స్ పెట్టారని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ పెద్ద‌లు ప్ర‌స్తావించిన అంశాలు ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. చీరాల వైసీపీ ఇంచార్జ్‌గా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్న సంగ‌తి తెలిసిందే. 2009లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి, 2014లో స్వ‌తంత్ర ఎమ్మెల్యేగా గెలిచి, అప్ప‌టి అధికార పార్టీ అయిన టీడీపీలోకి వెళ్ళారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీడీపీ అభ్య‌ర్ధి బ‌ల‌రాం చేతిలో ఓడారు.

ఇక ఈ ఎన్నిక‌ల్లో ఆమంచి ఓడినా, చీరాల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ కావ‌డంతో, అక్క‌డ ఆయ‌న చెప్పిందే జ‌రిగేది. అయితే కొద్ది నెల‌లుగా చీరాల‌లో రాజ‌కీయాల్లో మార్పులు వ‌స్తున్నాయి. టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బ‌ల‌రాం, వైసీపీ చేర‌డంతో చీరాల‌లో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయానికి తెర‌లేచింది. ఆమంచి, క‌ర‌ణం మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే బ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు ఎప్పినుంచో ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఇద్ద‌రు ఓకే గూటిలో చేరినా, ఉప్పు నిప్పులా, ఈ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ వ్య‌వహారం పార్టీకి కీడు చేస్తుంద‌ని భావించిన వైసీపీ పెద్ద‌లు రంగంలోకి దిగారు. ‌

ఈ క్ర‌మంలో వైసీపీ పెద్ద‌లు ఆమంచికి కీల‌క సూచ‌న చేసిన‌ట్లు వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. చీరాల వ‌దిలి, ప‌క్క‌నే ఉన్న ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ళాల‌ని, ఆమంచి పై ఒత్తిడి చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గంలో రావి రామ‌నాథం బాబు ఇంచార్జ్‌గా ఉన్నారు. అక్క‌డి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావును వైసీపీలోకి తీసుకురావ‌లని ప్ర‌య‌త్నించినా, కుద‌ర‌లేదు. దీంతో చీరాల‌లో బ‌ల‌మైన నేత‌గా ఉన్న ఆమంచిని ప‌ర్చూరు వెళ్ళ‌మ‌ని వైసీపీ పెద్ద‌లు బుజ్జ‌గిస్తున్నార‌ట‌.

ఇక ప‌ర్చూరులో స‌రైన ‌నేత లేక వైసీపీ బ‌ల‌ప‌డ‌డం లేద‌ని, ఈ క్ర‌మంలో ఆమంచి అక్క‌డి పార్టీ బాధ్య‌త‌లు చేప‌డితే, అధికార వ్య‌వ‌హాల‌తో పాటు, పార్టీ అంశాలు చ‌క్క‌బెట్ట‌వ‌చ్చ‌ని, వైసీపీ పెద్ద‌లు ఆమంచికి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నేనే రాజు నేనే మంత్రిగా ఆమంచి చీరాలు ఏలారు. దీంతో త‌న క‌నుస‌న్న‌ల్లో ఉన్న చీరాల‌ను వ‌దిలి, ప‌ర్చూరుకు వెళ్ళ‌డానికి, ఆమంచి ఆశ‌క్తి చూపించ‌డంలేద‌ని తెలుస్తోంది.

ప‌ర్చూరులో బ‌ల‌రాం సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో బ‌ల‌రాంను ప‌ర్చూరు పంపాల‌ని, వైసీపీ అధిష్టానానికి ఆమంచి చెప్పార‌ట‌. అయితే ఆమంచి ప్ర‌య‌త్నాలు ఫ‌లించే అవ‌కాశం లేద‌ని వైసీపీ వ‌ర్గాల టాక్. ఆమంచి ప‌ర్చూరు వెళ్ళ‌క త‌ప్ప‌ద‌ని, వైసీపీలో జోరుగా చ‌ర్చ జ‌ర‌గుతోంది. దీంతో ఆమంచి కృష్ణ మోహ‌న్ పొలిక‌ల్ ఫ్యూచ‌ర్ పై రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ‌మొద‌లైంది. మ‌రి పుష్క‌ర కాలంగా చీరాల‌లో వ‌న్ మ్యాన్ షోతో చ‌క్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి, పార్టీ ఇచ్చిన ఆఫ‌ర్ పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఇప్ప‌డు చీరాల రాజ‌కీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.