ఇలాంటి బంపర్ ఆపర్ బహుశా జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌కి ఇంకెవ్వరూ ఇవ్వలేరేమో. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతానంటున్నారు.. తన మీద పోటీ చేసి కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సవాల్ విసిరేశారు అన్నా రాంబాబు. ఇంతకంటే గొప్ప బంపర్ ఆఫర్ జనసేన అధినేతకు ఇంకేముంటుంది.? ‘బస్తీ మే సవాల్.. మేం రెడీ..’ అని పవన్ కళ్యాణ్ నుంచి వెంటనే ఓ ప్రకటన రావాల్సి వుంది. వస్తే, రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ జనసైనికుడు ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. జనసైనికుడు వెంగయ్య, ఎమ్మెల్యే అన్నా రాంబాబుని గ్రామంలో సమస్యల పట్ల నిలదీస్తే, ఎమ్మెల్యే నుంచి బూతుల దాడి ఎదురయ్యింది. ఎమ్మెల్యే తీరుతో మనస్తాపం చెంది, జనసైనికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి 8.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు జనసేనాని.
ఈ సందర్భంగానే అన్నా రాంబాబుకి సవాల్ విసురుతూ, ‘అసెంబ్లీకి వెళ్ళనివ్వను..’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దీనిపై అన్నా రాంబాబు పై విధంగా ప్రతి సవాల్ విసిరారు. ‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్..’ అనే వాస్తవాన్ని జనసైనికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించేశారు. టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. పార్టీ ఫిరాయిస్తే వేటు పడాల్సిందే.. అని నినదించిన వైఎస్ జగన్, మాట తప్పారు. లేదంటే, ఈపాటికే రాష్ట్రంలో పలు ఉప ఎన్నికలు వచ్చి వుండేవి. ఎలాగైతేనేం, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉప ఎన్నికకు ‘సై’ అంటున్నారు.. జనసేన కూడా ‘సై సై’ అంటే, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశాలుంటాయి. జనసేన సంగతేంటో కూడా తేలిపోతుంది. మరి, జనసేన అందుకు సిద్ధమా.?