చంద్రబాబు కొంప ముంచుతున్న ‘ఫేక్‌’ రగడ.!

 CAG report on Chandrababu Naidu's debts

నలభయ్యేళ్ళ రాజకీయం అనుభవం చంద్రబాబుకి ఏం నేర్పిందోగానీ, ఆయన ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ సంయమనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆయన రాజకీయంగా తనను తాను దెబ్బతీసుకుంటే, తెలుగుదేశం పార్టీకి కూడా చేటు కలిగిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయ పార్టీలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా.. అంతిమంగా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే, ఎవరైనా అధికారంలోకి వస్తారు. అలా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పట్ల ఒకింత గౌరవ భావం ప్రతి ఒక్కరికీ వుండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వేరు, ఫేక్‌ ప్రభుత్వమంటూ విమర్శించడం వేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ‘ఫేక్‌’ అని కొట్టి పారేయడం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ‘ఫేక్‌ పార్టీ’ అనడం ఓకే, ‘ఫేక్‌ ప్రభుత్వం, ఫేక్‌ సీఎం’ అనడమేంటి.? నూటికి నూరుపాళ్ళూ తప్పే ఇది. తప్పొప్పుల సంగతి తర్వాత.. అసలు, అటువైపు నుంచి దూసుకొచ్చే విమర్శల్ని చంద్రబాబు ఎలా తట్టుకోగలరు.? ఛాన్సే లేదు. ఈ తలనొప్పి చంద్రబాబుని ఓ రేంజ్‌లో వేధించేస్తోందిప్పుడు.

ysrcp leaders fires on chandrababu naidu
ysrcp leaders fires on chandrababu naidu

ఏకి పారేస్తోన్న వైసీపీ..

మంత్రి కొడాలి నానికి చంద్రబాబు అంటే అదో ఇది. పూర్తిగా సంయమనం కోల్పోతారు చంద్రబాబుని విమర్శించే క్రమంలో కొడాలి నాని. అయితే, అసెంబ్లీలో మాత్రం కొడాలి నాని, కాస్తంత సంయమనంతోనే, పద్ధతిగానే చంద్రబాబుని ఏకిపారేశారు ‘ఫేక్‌’ వ్యవహారంపై. కాంగ్రెస్‌లో ఓడిపోయాక, టీడీపీలోకొచ్చాయ్‌.. అది ఫేక్‌ కాదా.? చంద్రగిరిలో ఓడిపోయి, కుప్పం పారిపోయావ్‌.. అది ఫేక్‌ కాదా.? స్వర్గీయ ఎన్టీఆర్‌ని కిందికి తోసి, టీడీపీ పగ్గాలు చేపట్టావ్‌.. అది ఫేక్‌ కాదా.? నీ జీవితంలో, ఒంటరిగా టీడీపీని ఎప్పుడైనా అదికారంలోకి తెచ్చావా.? అంటూ కొడాలి నాని, చంద్రబాబుని అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేశారు. వీటిల్లో దేనికీ చంద్రబాబు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే, అన్నీ నిజాలే కాబట్టి.

రాయి విసిరేముందే జాగ్రత్తపడాలి బాబూ.!

చిన్న రాయి కదా, విసిరేద్దామనుకుంటే కుదరదిక్కడ. ఎందుకంటే, టీడీపీ వైపు పట్టుమని పాతిక మంది కూడా లేరు.. అదే వైసీపీ దగ్గర ఏకంగా 151 మంది వున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఏదన్నా విమర్శ చేయాలనుకుంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. చంద్రబాబు స్థాయిలోనే వైసీపీ సమాధానం చెప్పాలనుకుంటే పరిస్థితి ఇంకోలా వుంటుంది. అలాగని, వైసీపీ తక్కువ చేస్తోందని కాదుగానీ.. చంద్రబాబు హయాంలో అచ్చెన్నాయుడు, బొండా ఉమ రెచ్చిపోయిన తీరు మర్చిపోతే ఎలా.? పైగా, ఇప్పుడు చంద్రబాబుని గట్టిగా సమర్థించే నాయకులే టీడీపీలో లేరాయె. ఒకప్పటి చంద్రబాబుకీ, ఇప్పటి చంద్రబాబుకీ చాలా తేడా. ఆయన ఈయనేనా.? అన్న అనుమానాలు చాలామందికి వస్తాయ్‌. కానీ, చంద్రబాబుకే వాస్తవం అర్థం కావడంలేదు. కాదు కాదు, ఆయన వాస్తవాల్ని జీర్ణించుకోలేకపోతున్నారంతే.

టీడీపీ ఖేల్‌ ఖతం..

పోలవరం ప్రాజెక్ట్‌, అమరావతి, ప్రత్యేక హోదా.. వీటిల్లో చంద్రబాబు చిత్తశుద్ది అనేది జస్ట్‌ ఫేక్‌ అని తేలిపోయింది. 2019 ఎన్నికల్లో ఓటర్లే తేల్చేశారు. మరి, చంద్రబాబుని విమర్శించడంలో సక్సెస్‌ అవుతున్న వైసీపీ, రాష్ట్రానికి సంబంధించిన ఆ మూడు కీలక అంశాల్లో తాను కూడా ఫేక్‌ అని చెప్పుకోదలచుకుంటోందా.? అమరావతి విషయంలో చిత్తశుద్ధి లేదు, ప్రత్యేక హోదాని గాలికొదిలేశారు.. పోలవరం ప్రాజెక్టుని అయోమయంలో పడేశారు. ఇవన్నీ చూస్తే.. ‘ఫేక్‌’ విషయంలో చంద్రబాబుతో వైఎస్‌ జగన్‌ పోటీ పడుతున్నారని అనుకోవాలేమో.!