కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై వైసీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా అనుసరిస్తున్న వైఖరిపై నంద్యాల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం అమరావతిలో విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనపై ప్రజలంతా బాధలో ఉంటే, వైసీపీ, సాక్షి మీడియా మాత్రం ‘శవాల మీద రాజకీయాలు’ చేస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ, సాక్షి మీడియా వ్యవహరిస్తున్న తీరు ‘శవాల మీద వాలే రాబందుల’ మాదిరిగా ఉందని ఎంపీ శబరి విమర్శించారు. ‘సత్యమే జయతే’ అనే పేరు పెట్టుకుని సాక్షి మీడియా అసత్య కథనాలను పుట్టిస్తోందని, కల్తీ మద్యం తాగిన బైకర్ వల్లే బస్సు ప్రమాదం జరిగిందంటూ అవాస్తవ కథనాలు ప్రచురించిందని ఆమె ధ్వజమెత్తారు. మహిళ అయిన వైఎస్ భారతి నడుపుతున్న సాక్షి మీడియాలో ఇలాంటి అవాస్తవాలు రావడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ శబరి స్పష్టం చేశారు. గతంలో ఇలాంటి ప్రచారాల వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని గుర్తు చేసిన ఆమె, ఇంకా ఇలాగే అసత్య ప్రచారాలు కొనసాగిస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
బస్సు ప్రమాద ఘటనపై విచారణలో లైసెన్స్‌డ్ వైన్ షాప్ నుంచే బైకర్ మద్యం కొనుగోలు చేసినట్లు తేలిందని ఎంపీ శబరి వివరించారు. ఈ బాధాకర సంఘటన నుంచి ప్రజలు తేరుకోక ముందే ‘శవ రాజకీయాలు’ చేయడం ఎందుకని వైసీపీని, ఆ పార్టీ అనుబంధ మీడియాను ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి ఘటనల నుంచి కూడా రాజకీయం చేసే స్థాయికి జగన్‌తోపాటు ఆయన కుటుంబం సైతం దిగజారిపోయిందని మండిపడ్డారు. విలువలు లేని రాజకీయం చేయడం సరికాదంటూ వైసీపీ నేతలకు ఎంపీ బైరెడ్డి శబరి హితవు పలికారు.

