విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ సమరభేరి మ్రోగించింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులు, అగ్రనేత వి విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఇరవై అయిదు కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం అయింది. విశాఖ పట్టణ పరిధిలోని నాలుగు నియోజకవర్గాలను కవర్ చేస్తూ విజయసాయిరెడ్డి ఈ పాదయాత్రను చేపట్టారు. విశాఖజిల్లాలోని వేలాదిమంది వైసిపి కార్యకర్తలు పార్టీ సైన్యాధ్యక్షుడు విజయసాయిరెడ్డి వెంట క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ” విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” “జై జగన్” నినాదాలు చేస్తూ కదం తొక్కారు.
32 మంది బలిదానాల ఫలితంగా వేలాదిమంది రైతుల త్యాగఫలంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ను కేంద్రప్రభుత్వం ప్రయివేట్ వారి చేతుల్లో పెట్టబూనడం అంటే అమరుల త్యాగాన్ని కించపరచడమే. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో వ్యాపారాలు నడిపే పారిశ్రామికవేత్తలకు వేలకోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, బ్యాంకులకు కన్నం వేసే ఘరానాదొంగలకు ఊరటలు ఇస్తూ, ఆర్ధిక ఉగ్రవాదులకు తమ పార్టీ రక్షణ కల్పిస్తూ ప్రజావ్యతిరేక చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం లక్షమందికి ఉపాధిని కల్పిస్తున్న విశాఖ స్టీల్ ను అమ్మేయాలనుకోవడం అక్షరాలా ప్రజాద్రోహం.
విశాఖ స్టీల్ మోదీ ప్రభుత్వం వచ్చాకనే నష్టాలబాట పట్టిందనేది నిష్టుర సత్యం. దాన్ని నష్టాలనుంచి లాభాలబాటకు మళ్లించడానికి నిపుణులు అనేక సూచనలు చేస్తున్నప్పటికీ కేంద్రం చెవిన పెట్టడం లేదు. విశాఖ స్టీల్ కు సొంతంగా కొన్ని మైన్స్ కేటాయిస్తే ఖర్చులు తగ్గుతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. కేవలం అయిదువేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన స్టీల్ ఫ్యాక్టరీ గత నలభై ఏళ్లలో నలభైవేల కోట్ల రూపాయలను తిరిగి కేంద్రప్రభుత్వానికి చెల్లించిందట. దేశంలో సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఏకైక స్టీల్ ఫ్యాక్టరీ ఇది ఒక్కటే. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద ఉక్కు కర్మాగారం కూడా ఇదే. అలాంటి విశిష్టమైన చరిత్ర కలిగిన కర్మాగారాన్ని ఏదో విధంగా బయటపడేయడానికి బదులు ప్రయివేట్ పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై ప్రజలకు ద్రోహం చెయ్యడం బరితెగింపు మాత్రమే.
ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, మరికొందరు పార్టీ నాయకులు విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తున్నామని ఎవరు చెప్పారు? నోటిఫికేషన్ వచ్చిందా? అంటూ అమాయకంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరూ ఏమీ చెప్పకుండానే పుకార్ల మీదనే ప్రభుత్వం ప్రతిస్పందిస్తుందా? ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కేవలం తమాషాగా కేంద్రానికి లేఖ వ్రాశారా? కార్మిక సంఘాలు ఉత్తుత్తిగానే ఆందోళనలు చేస్తున్నాయా? వారి భాగస్వామి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అక్కడ పెద్దలతో చర్చించి “అంతా కేంద్ర ఇష్టం” అని ఎలా ప్రకటించారు? రాష్ట్ర బీజేపీ వారికి ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి మోదీగారిని కలిసి “విశాఖ ఉక్కును ప్రయివేటీకరించబోము” అని ఒక ప్రకటన ఇప్పించమనండి చూద్దాం. ఎవరిని వెర్రివాళ్లను చెయ్యాలని బీజేపీ నాయకుల ప్రయత్నం? ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు చెప్పరాని ద్రోహం చేసింది. ఆ పార్టీని ఆంధ్రులు ఎన్నటికీ క్షమించరు. విశాఖ ఉక్కు కూడా వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కూడా కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుంది.
ఈరోజు విజయసాయిరెడ్డి చేస్తున్న పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే వైసిపిని ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో మరోసారి తెలిసిపోతుంది. పార్టీ నాయకులు, అభిమానులు సైతం విజయసాయిరెడ్డి సాహసాన్ని ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. విజయసాయిరెడ్డి గారి పోరాటం ఫలించాలని కోరుకుందాము.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు