టీవీ చానెళ్లు, వార్తాపత్రికలు పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ తమ తమ ప్రయోజనాలు నెరవేర్చే రాజకీయపార్టీలకు అనుగుణంగా వార్తాప్రసారాలు చేస్తుండటంతో సోషల్ మీడియా పోస్టింగులకు విపరీతమైన ప్రాధాన్యత దక్కింది. ఎప్పటికప్పుడు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడంలో సోషల్ మీడియా ముందుంటున్నది. అయితే సోషల్ మీడియాలో కూడా పార్టీలు, కులపరంగా చీలికలు ఏర్పడ్డాయి. పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం, తమకు గిట్టనివారిని హేళన చేస్తూ పోస్టింగులు పెడుతూండటం గత అయిదారు సంవత్సరాలుగా కనిపిస్తున్న సత్యం.
మన రాష్ట్రంలో వైఎస్సార్సీపీ , టిడిపి సోషల్ మీడియాలు చాల యాక్టీవ్ గా ఉంటున్నాయి. ఒకరి లొసుగులు మరొకరు బయటపెట్టుకుండటంతో కొన్నైనా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. రాజశేఖరరెడ్డిని అభిమానించే లక్షలాదిమంది ఆయన మరణం తరువాత జగన్ అభిమానులుగా మారారు. జగన్ కోసం వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రాత్రనక పగలనక శ్రమపడ్డారు. టిడిపి ప్రభుత్వం కేసులు పెట్టినప్పటికీ ఓర్చుకుని తమ అభిమాన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని తపించారు. వారి కృషి ఫలించి వైఎస్సార్సీపీ పెద్దవిజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తమ శ్రమకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని, తమకు ప్రభుత్వంలో, పార్టీలో గుర్తింపు లభిస్తుందని సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, ఎన్నెన్నో కలలు కన్నారు. టిడిపి ప్రభుత్వం జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి తమ పార్టీ వారికి అండగా నిలబడినట్లు తమ పార్టీకూడా నిలబడుతుందని కార్యకర్తలు ఆశించారు. అలాగే కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులు, దేవాలయ కమిటీలలో తమకు తగిన పదవులు లభిస్తాయని, కాంట్రాక్టులు లభిస్తాయని నాయకులు ఎంతో ఆశ పడ్డారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఈరోజు వరకు వారిని పార్టీలో, ప్రభుత్వంలో పట్టించుకునేవాడే కరువయ్యారు. దాంతో గ్రామస్థాయి నాయకత్వం తీవ్ర నిరాశలో కూరుకుని పోయిందని వాపోతున్నారు. టిడిపి అధికారంలో ఉన్నపుడే మాకు కొన్ని పనులు అయ్యాయి. “మా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మమ్మల్ని పలకరించే దిక్కులేదు” అని పట్టణస్థాయి నాయకులు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియా ఒక చెత్తకుప్ప అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి విమర్శించడం సోషల్ మీడియా కార్యకర్తల గుండెల్లో గునపాలు దించినట్లయింది. రేపో మాపో తమకేమైనా పదవులు దక్కుతాయేమో అని ఆశిస్తున్నవారు ఆ ప్రకటనతో కుంగిపోయారు. చాలామంది జగన్ అభిమానులు సోషల్ మీడియాకు దూరం అయ్యారు. ప్రభుత్వ పనితీరు పట్ల సోషల్ మీడియాలో జగన్ అభిమానులే విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఆశలున్నవారు కొనసాగుతున్నారు. ఏమైనప్పటికీ కింది స్థాయి కార్యకర్తల్లో నిరాశ కమ్ముకుందనేది నిజం.
ఈ పరిస్థితుల్లో జగన్ పాదయాత్రకు మూడేళ్లు నిండిన సందర్భంగా రేపు ఆరో తారీకు నుంచి పదహారో తారీకు వరకు వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయా కావా అనే సందేహం వ్యక్తం అవుతోంది. పార్టీ కార్యకర్తలను పట్టించుకోని ప్రభుత్వం వారి సహకారాన్ని అందుకోవడం కష్టం.
స్వామి వాస్తవానంద్