కాంగ్రెస్ గుమ్మంలో వైఎస్ షర్మిల పడిగాపులు.!

కాంగ్రెస్ పార్టీని కాదనుకుని కదా, వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చింది.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎదిగారు.. కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బలపడేందుకు కారణమయ్యారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది.? వైఎస్సార్ మరణం తర్వాత, ఆయన్ని ‘దోషి’ని చేసింది.

అలాంటి కాంగ్రెస్ పార్టీ గుమ్మం ఎలా వైఎస్ షర్మిల తొక్కినట్టు.? ఈ విషయమై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి, కాంగ్రెస్ పార్టీపై నానా రకాల విమర్శలూ చేశారు వైఎస్ షర్మిల. అంతేనా.? తన తండ్రి మరణం వెనుక కుట్ర వుందని కూడా ఆరోపణలు చేశారామె.

‘సోనియాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ’తో సమావేశమైనట్లు, వైఎస్ షర్మిల ఢిల్లీలో ప్రకటించారు. అదేంటీ, రాజీవ్ గాంధీ చాన్నాళ్ళ క్రితమే చనిపోయారు కదా.? అంటే, ఏదో కంగారులో రాహుల్ గాంధీ అనబోయి.. రాజీవ్ గాంధీ అనేశారంతే.!

సోనియా గాంధీని కలిసొచ్చిన వైఎస్ షర్మిల, ‘కేసీయార్‌కి కౌంట్ డౌన్ మొదలైంది’ అంటూ వ్యాఖ్యానించారు. అదేం లెక్క.? కాంగ్రెస్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ కలిసి పని చేయనున్నాయా.? కాదే.! కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాన పార్టీ విలీనమవబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై వైఎస్ షర్మిల ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

ఓ వైపు, కేసీయార్ రాజకీయ వ్యూహాలు వేరేలా వున్నాయ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తెరవెనుక స్నేహ సంబంధాలు నడుపుతున్నారు. జగన్ – కేసీయార్ మధ్య ఓ రకమైన అనుబంధం వుంది. మరి, షర్మిల ఏంటి ఇలా వ్యవహరిస్తున్నారు.?

ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఇంతకీ, వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారా.? ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడతారా.? అయినా, సోనియా గాంధీ ఇంటి దగ్గర పడిగాపులు కాయాల్సిన అవసరమేమొచ్చింది వైఎస్ షర్మిలకి.?