గల్లా జయదేవ్ కు శుభవార్తేనా ఇది…

 

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

 

చావో రేవో అనే తీరులో 2019 ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్న వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి అంచనాలు తారుమారవుతున్నట్లున్నాయి. ఆయన సభల్లో జనం, ఉపన్యాసాల్లో కనబడుతున్నంత ధీమా ఫీల్డ్ లో కనిపించడం లేదని ఆయన చేస్తున్న మార్పులను చేర్పులను బట్టి చెప్పవచ్చు.ఒక ఏడాది కిందట ఆయన నియోజకవర్గాల్లో బాగా పనిచేశారని, ఇంకా బాగా పనిచేసి గెలవండని ఇన్ చార్జ్ లను నియమించారు. వాళ్లంతా పనిచేసుకుంటూ పోతున్నారు. ఇపుడున్న ట్లు ఆయన  సమీకరణాలు, అంచనాలు, లెక్కలు తప్పుతున్నాయి. వాళ్ల లాభం లేదు, వేరే వాళ్లను పెట్టాల్సిందేనని నియోజకవర్గాల ఇన్ చార్జీలను మారుస్తున్నారు. ఇపుడు కొత్త ఇన్ చార్జ్ లను నియమిస్తున్నారు.

ఆంద్రలో ఎన్నికలు ఇంకా అరునెలలున్నాయి. ఈ  ఆరునెలల్లో ఇపుడు నియమించిన వారిని మళ్లీ మార్చరని గ్యారంటీ ఏముంది. (రాజకీయ పార్టీల సర్వేలు బోగస్ అని తెలిపోతున్నాయి. సర్వే చేస్తున్న సంస్థల సిబ్బంది ఏకంగా అభ్యర్థులను కలసి డబ్బులు వసూలు చేసుకుని పోతున్నారు. నాకు తెలిసిన పెద్ద కులపెద్దని  ఒక ప్రముఖరాజకీయపార్టీ లోక్ సభ అభ్యర్థిగా దాదాపు ఖరా రు చేసింది. పేపర్లలో సోషల్ మీడియాలో ఆయన పేరు వచ్చింది. తర్వాత పార్టీ ఆయన ప్రాబల్యం మీద ఒక సర్వే ప్రారంభించింది. సర్వే వలంటీర్లు ఆయనను కలసి, సర్వే చేస్తున్నామని,  మీకు మంచి పేరుందని, పాజిటివ్ రిపోర్టు ఇస్తామని డబ్బులు వసులు చేసుకుపోవడం నేను కళ్లారా చూశాను. ఇది వేరే కథ.)

అంటే తానే నియమించిన అభ్యర్థుల  గెలుపుఓటములను ధియోరిటికల్ కూడా అంచనా వేసే స్థితిలో వైసిపిలేదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు గుంటూరు  లోక్ సభ నియోజకవర్గంలో ఏం జరిగిందో చూడండి. గుంటూరు  కమ్మ వారి స్ట్రాంగ్ హోల్డ్. అక్కడ 2014లో టిడిపి అభ్యర్థిగా ఒక డీసెంట్ పొలిటిషన్ గల్లా జయదేవ్ (కమ్మ) గెలిచాడు.  వైసిపి తరఫున పోటీ చేసిన బాలశైరి (కాపు క్రిష్టియన్), కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మైనారిటీ అభ్యర్థి అబ్దుల్ వహీద్ షేక్ పోటీ చేశాడు. ఈ పోటీలో జయ్ దేవ్ కు దాదాపు 70 వేల వోట్ల మెజారిటీ వచ్చింది.

ఈ సారి జగన్ సభలకు వస్తున్న జనం, ఆయన చేస్తున్న హమీలు, ఆయన పంచుతానంటున్న నవరత్నాలతో అక్కడ ఎవరిని పోటీ పెట్టిన గెలవాలి. ఆ  ధీమా పార్టీలో ఉండాలి. ఎందుకంటే, జగన్ ప్రచారం తన బొమ్మ ఉంటే చాలు గెలుస్తారనేలా సాగుతూ ఉంది. అయితే, గ్రౌండ్ లెవెల్ లో వైసిపిలో ఈ ధీమా లేదు. దానికి సాక్ష్యం గుంటూరు లోక్ సభ నియోజకవర్గం  ఇన్ చార్జ్ లావు శ్రీకృష్ణ దేవరాయలు (కమ్మ)ని మార్చడమే సాక్ష్యం. నిజానికి కృష్ణ దేవరాలు అక్కడ సరైన అభ్యర్థి. కమ్మ ఓట్లను చీల్చి ఆమేరకు టిడిపిని వీక్ చేసేవాడు. అయితే, జగన్ భయం వేరు.  గుంటూరు కమ్మ వాళ్లు  మనకు ఎలాగూ ఓటేయరని ఆయన తెలిసిపోయినట్లుంది. కాపులేమో ఆయన రిజర్వేషన్ల యు టర్న్ మీద  కోపంగా ఉన్నారు. కమ్మవారు ఓటెయక, కాపులు దూరంగా జరిగి. వైసిపి గతేం కాను. అందుకే కమ్మ ఓట్లు పోయినా పర్వాలేదు. కాపులనయినా మచ్చిక చేసుకుందామని అనుకుంటున్నాడు. అంతే, వెంటనే మంచి చదువు, పేరు, యువకుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలును నర్సాపురం లోక్ సభ స్థానానికి పంపించింది. ఆయన స్థానంలో ఇపుడు వైసిపికి సైద్ధాంతిక పెద్దిదిక్కుగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యను నియమించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజకీయ జీవితం, పదవులు, ప్రయోజనాలన్నీ టిడిపిలోనే సాగాయి. చివరికాలంలో ఆయన వైసిపిలో చేరి జగన్ రాజకీయ గురువని ఫీలవుతుంటారు. ఆయన అల్లుడికి  కాపు కోటా కింద లోక్ సభ సీటు ఇప్పించుకున్నారు.(పోన్లో ఇక్కడయినా కాపు రిజర్వేషన్ అమలుచేశారు.) రోశయ్య రాకతో కాపులు పోలో మని జగన్ వైపు పరిగెత్తు కొస్తారని వైసిపి వ్యూహ కర్తల అత్యాశ. కాపులు అంత ఈజీగా చల్లబడతారని అనుకోలేం. ఇది జగన్ ఆడుతున్న కాపు రాజకీయమని చాలా స్పష్టంగా కనిస్తావుంది.

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో కాపులు కూడా బాగానే ఉన్నారు. జగన్ ఏమనుకుంటున్నారంటే,  కమ్మలంతా టిడిడి వైపు వెళితే, కాపులంతా కట్టకట్టుకువచ్చి వైసిపికి వోటేస్తే,నవరత్నాల హామీ వల్ల ఇతర కిందికలాల వోట్లు పడితే విజయం ఖాయం. కాపులొస్తారో లేదో గాని, కమ్మవారిలో అత్యధికులు జయ్ దేవ్ కు వోటేస్తారు. కాపులు ఇలా వైసిపికి వోటేస్తారని చెప్పలేం.చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉండటం వల్ల ఉమ్మారెడ్డిని కూడా జనం మర్చిపోయారు. రోశయ్య అంత పాపులర్ కాదని అందరికి తెలుసు. కాపు కులం బ్రాండ్ ఒక్కటే వైసిపిని ఆదుకోవాలి.

జయ్ దేవ్ పొలిటికల్ ఇమేజ్ బాగా పెరిగిందీమధ్య. మంచి పార్లమెంటేరియన్ గా గుర్తింపు వచ్చింది. ప్రత్యేక హోదా మీద సభలో అవిశ్వాసం వచ్చినపుడు, పార్టీ రాజకీయాలెలా ఉన్న, ఆయన మోదీ మీద చేసిన దాడిని పార్లమెంటే కాదు, దేశమంతా కళ్లింత చేసుకుని చూసింది. భవిష్యత్తున్నపార్లమెంటేరియన్ అని ప్రజలు ప్రశంసించారు. పార్టీ ఏదయినా, సిద్ధాంతాలేవయని ఎంపి అనే వాడు సభలో తన పేరును పర్ ఫామెన్స్ తో  గోడమీద శాశ్వతంగా చెక్కాలి. జయదేవ్ ఆ పని పూర్తి చేశారు. ఇపుడు వైసిపిలో క్యాండిడేట్ల పట్ల మారుతున్న ఆలోచన ను బట్టి చూస్తే జయ్ దేవ్ ఇక నిశ్చింతగా ఏదయిన మంచి పుస్తకం చదువుతూ గడపవచ్చేమో అనిపిస్తుంది.