ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట క్యాబినేట్ లో మండలి నుంచి ప్రాతినిధ్యం కల్పించడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఆ అనవాయితీ కొనసాగుతుందా? లేదా? అన్న అంశం ఇప్పుడు పొలిటికల్ కారిడార్ సహా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపీదేవి వెంకటరమణ తమ పదవులకు బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 6న రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి పదవుల్లో సీఎం జగన్ ఎవరికి పెద్ద పీఠ వేస్తారు? అన్నది ఆసక్తిగా మారింది. ఇరువురు శాసన మండలి సభ్యులు కావడంతో ఆ పదవుల్ని ఆనవాయితీగా మళ్లీ మండలి సభ్యులకే సీఎం జగన్ కట్టబెడతారా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సాధారణంగా మండలి నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారే మండలి పక్ష నాయకుడిగా వ్యవహరిస్తారు.
ఇప్పటివరకూ పిల్లి సుభాష్ చంద్రబోస్ లీడీర్ ఆఫ్ ది హౌస్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు వెళ్లిపోయిన నేపథ్యంలో మండలి పక్ష నేత ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆనవాయితీ ప్రకారం మండలి నుంచి క్యాబినేట్ ప్రాతినిధ్యం కల్పించాలనుకుంటే ప్రస్తుతం వైకాపాకు పది మంది సభ్యులలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావుకు అవకాశాలున్నాయని బలమైన కథనాలు వస్తున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రిగా, రాష్ర్ట మంత్రిగా, ఎంపీగా, శాసనమండలి సభ్యుడిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఉమ్మారెడ్డి టీడీపీని విబేధించి వైకాపాలో చేరిన తర్వాత పార్టీ నిర్మాణంవైపు దృష్టి సారించారు.
వైకాపా ఆవిర్భావం తర్వాత తొలిసారి ప్లీనరి నిర్వహించి పార్టీకి బేస్ ఏర్పాటు చేసారు. నాగార్జున యూనివర్శీటి ఎదుట నిర్వహించిన ప్లీనరి వేదిక నుంచే పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రకు పిలుపునిచ్చారు. దాంతో పార్టీ రూపు రేఖలే మారిపోయాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లతో వైకాపా అధికారాన్ని కైవసం చేసుకుంది. జగన్ తొలి మంత్రివర్గంలోనే ఉమ్మారెడ్డి కి చోటుదక్కుతుందని అంతా భావించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈసారి బెర్త్ ఖాయమనే వినిపిస్తోంది. అటు మోపీదేవి వెంకటరమణ రాజీనామ చేసిన శాఖ కూడా ఎవరికి కేటాయిస్తారు? అన్న దానిపై ఆసక్తిక చర్చ సాగుతోంది. ఈవారంలో సీఎం జగన్ ఆ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి తెలిసింది.