రాజకీయాల్లో మిత్రులెవరో, శత్రువులెవరు గుర్తించడం చాలా కష్టం. అందుకే పదవిలో ఉన్న లీడర్లు ఎప్పుడైనా నాలుగు వైపులా పరికించి చూసుకుంటూ పనులు చేసుకోవాలని అంటుంటారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సొంత పార్టీ వారే ఎర్త్ పెట్టేస్తుంటారు. సరిగ్గా ఇదే జరుగుతోందట వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు. గుంటూరు జిల్లా పొన్నూరు నుండి గత ఎన్నికల్లో గెలుపొందారు రోశయ్య. గెలవడం అంటే అలా ఇలా కాదు.. దశాబ్దాల తరబడి ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఓడించి గెలిచారు. అపూర్వమైన ఈ విజయంతో పార్టీలో ఆయన పరపతి బాగా పెరిగింది.
అంతా సవ్యంగానే సాగుతోంది అనుకునే టైంలో రోశయ్య మీద అక్రమ మైనింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అలిగేషన్స్ అంటే సహజంగా ప్రతిపక్ష పార్టీ నేతలే చేస్తారని అందరూ అనుకుంటారు. అలా రోశయ్య మీద ఆరోపణలు లేవనెత్తింది ధూళిపాళ్ల నరేంద్ర అనుకున్నారు. రోశయ్య కూడ అలాగే అనుకుని ఆయన్ను విమర్శించారు. కానీ ఆ విమర్శలకు ధూళిపాళ్ల రియాక్ట్ కాలేదు. నిజానికి పార్టీలు వేరైనా నరేంద్రకు, రోశయ్యకు మంచి సాన్నిహిత్యం ఉంది. పార్టీల పరంగా తప్ప ఇద్దరి మధ్యన వ్యక్తిగత విబేధాలు ఎప్పుడూ లేవు. అందుకే రోశయ్య తన మీద వచ్చిన ఆరోపణలు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారట.
ఆ ప్రయత్నంలో ఆ ఆరోపణలను పుట్టించింది మరొక వైసీపీ లీడరేనని తేలినట్టు చెప్పుకుంటున్నారు. సదరు లీడర్ చాలా కాలం నుండి పొన్నూరు వైసీపీలో కీలకంగా ఉంటున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో ఆయనది చెప్పుకోదగిన పాత్రే. కానీ గత ఎన్నికల్లో టికెట్ తనకు కాకుండా రోశయ్యకు దక్కడంతో అలకబూని ఆయన మీద ఈ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని చెప్పుకుంటున్నాయి పొన్నూరు రాజకీయ వర్గాలు. ఎంత కోపమున్నా ఇలా సొంత పార్టీ నేత మీద కుట్ర చేయడం దారుణమని అంటున్నారు ఈ సంగతి తెలిసినవాళ్ళు.