ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలో డిసైడ్ చేసే శక్తుల్లో దళిత వర్గం కూడా ఒకటి. కానీ అలాంటి వర్గం మీదే తరతరాలుగా వివక్ష ఉంటూనే ఉంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు కుర్చీల్లో కూర్చున్నా దళితుల మీద జరిగే అరాచకాలకు అంతం లభించలేదు. కొత్త ప్రభుత్వాలు దళితులకు ఎన్ని హామీలు ఇస్తున్నా ఏదో ఒక మూల దళితుల మీద దాడుల జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వం సంగతే తీసుకుంటే గత కొన్ని రోజులుగా దళితుల మీద దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులు కూడా తీవ్ర స్థాయిలో ఉండటం గమనార్హం.
కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో 16 ఏళ్ల ఎస్సీ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. బాలికకు మత్తు మందు ఇచ్చి నాలుగు రోజుల పాటు అఘాయిత్యం చేశారు. బాలిక తల్లి తన కుమార్తె కనిపించడంలేదని పోలీస్ స్టేషన్లో పిర్యాధు చేసినా వెంటనే స్పందన రాలేదు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ చట్టం చేసి దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం, పోలీసుల నుండి సత్వర స్పందన లేకపోవడం చూస్తే పాలకులు, అధికారుల చిత్తశుద్ధి మీద అనుమానం రాక ఇకేం వస్తుంది. కేవలం బాలిక ఎస్సీ సామాజిక వర్గానికి చెంది ఉండటం, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోవదం మూలానే ఈ అలసత్వమని దళిత సంఘాలు, విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని ఇసుక అక్రమ రవాణా వాహనాలకు అడ్డుతగిలాడనే కారణంగా పోలీసులే స్టేషన్లో పెట్టి చితగ్గొట్టి శిరోముండనం చేసిన ఉదంతం దళితుల మీదున్న చిన్న చూపును కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే పోలీసులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారనే ఆరోపణలున్నాయి. స్వయంగా ఈ విషయంలో సీఎం కలుగజేసుకోవడంతో పోలీసుల్ని సస్పెండ్ చేశారు తప్ప వెనకున్న నేతల పేర్లు మాత్రం బయటకురాలేదు. ఈ దాడితో రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
అలాగే ప్రకాశం జిల్లాలో ముఖానికి మాస్క్ కట్టుకోలేదనే కారణంతో కిరణ్ కుమార్ అనే దళిత యువకుడిని చీరాల ఎస్సై చితకబాదాడు. దీంతో కిరణ్ కుమార్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత కన్నుమూశాడు. ఇవన్నీ దళిత సామాజిక వర్గానికి పాలకుల మీద, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. కాలం మారుతున్నా ఇంకా తాము ప్రాధమిక హక్కుల కోసం పోరాడాల్సిన వాతావరణంలోనే ఉన్నామని దళిత జనం వాపోతున్నారు. ఇక్కడ పదే పదే దళితులు దళితులు అంటూ సామాజిల వర్గం పేరును పదే పదే ప్రస్తావించడానికి కారణం దాడులు జరుగుతున్నది దళితుల మీదే కాబట్టి. అవమానాల పాలవుతున్నది, బలవుతున్నది దళితులే కాబట్టి.
ఇదేదో రాజకీయ సమస్యనో, ఒక పొలిటికల్ పార్టీకి చెందిన విషయమో అయితే కులం పేరుతో రాద్దాంతం చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఇదొక సామాజిక జాడ్యం. ఒక సామాజిక వర్గం నలిగిపోతున్న సమస్య. దీన్ని నిర్లక్ష్యం చేస్తే వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. నేతలు దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం, వందల కోట్లు ఖర్చుపెడుతున్నామని చెప్పుకోవచ్చు, అవే ఎన్నికల్లో కాపాడతాయని అనుకోవచ్చు. కానీ అలా అనుకుంటే పొరపాటే. గౌరవంగా బ్రతికే హక్కును కాపాడకుండా, అందరితో సమాన విలువను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా జనం గుర్తుపెట్టుకోరు. పొందిన లబ్దిని చూసి జరిగిన అవమానాల్ని మర్చిపోరు. చడీ చప్పుడు లేకుండా తిరుగుబాటును ఓటు రూపంలో చూపిస్తారు. అప్పుడు గద్దె దిగక తప్పదు. గత ఎన్నికల్లో వైసీపీ అంత భారీ మెజారిటీ పొందగలిగింది అంటే దళిత వర్గం పూర్తిగా వారి వైపు ఉండబట్టే. అలాంటి వర్గాన్ని చిన్నచూపు చూస్తే పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా దళితుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారి మీద జరుగుతున్న అకృత్యాలను నివారించే చర్యలు చేపట్టి, భాధితులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తే మంచిది.