6 లేన్స్ రోడ్‌లో వైజాగ్ రాజధానికి మాస్టర్ ప్లాన్?
ఏపీలో మూడు రాజధానుల ప్లాన్ ఏమైనట్టు? ఇంతకీ విశాఖను పరిపాలనా రాజధానిని చేసేదెపుడు? అమరావతి నుంచి తరలింపు ఎప్పుడు? ఇవన్నీ ఇంకా శేష ప్రశ్నలేనా? అంటే ఇక అలాంటి సందేహాలేమీ అక్కర్లేదు. వీటన్నిటికీ సమాధానం చెప్పేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నాహకాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలలో రెండోసారి బిల్లును ప్రవేశ పెట్టారు. ఇక ఎవరి అనుమతులు అవసరం లేదు. శాసనం ప్రకారం విశాఖ రాజధాని ఖాయమైనట్టే. నేటి సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ సమావేశం పూర్తయింది. గవర్నర్ ముంగిట విశాఖ రాజధానిని ఖాయం చేసేసుకున్నారు. ఇక తరలి వెళ్లడమే ఆలస్యం అని తెలుస్తోంది. అయితే అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత నెలరోజుల సమయం ఇవ్వాలి. దానికోసమే వెయిటింగ్ అని ఇన్ సైడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా బూచీతో రాజధాని తరలింపు ఆగదని కూడా ఓ లీక్ అందుతోంది.
రాజధాని ఎప్పటికి తరలి వస్తుంది? అన్నదానిపై ఇంకా వైజాగ్ ఉత్తరాంధ్ర వెయిట్ చేస్తున్నాయి. ఇంతకుముందే చడీ చప్పుడు లేకుండా ఫర్నీచర్ తరలించారని వార్తలొచ్చాయి. కనీసం నెలరోజుల్లో లేదా దసరా నాటికి పని పూర్తవుతుందని విశాఖ అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే అవసరాలకు తగ్గట్టే 500 కోట్ల మేర నిధుల్ని ఇప్పటికే ఈ పనిపై కేటాయించారట. రాజధానికి అదనపు మౌళిక వసతుల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేస్తారట. ఇక అనకాపల్లి నుంచి ఆనందపురం – విజయనగరం వైపు వెళ్లే ఆరు లైన్ల రోడ్ కి ఇరువైపులా రాజధాని విస్తరించేందుకు వీలుందని స్థానికంగా చర్చ సాగుతోంది. కాపులుప్పాడ- భీమిలి- తగరపు వలస విశాఖ రాజధాని కేంద్రం అవుతుంది.. అప్పుడు మెయిన్ సిటీ సబ్ అవుతుంది. త్వరలో విశాఖ నాలుగు దిశల్ని కలుపుకుని ఒక జిల్లాగా పునర్విభజనలో ప్రకటించనున్నారు. గాజువాకను కలుపుకుని పాయకరావు పేట-నర్సీపట్నం వరకూ `అనకాపల్లి జిల్లా`ను ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు ఇప్పటికే సమాచారం లీకైంది. అయితే ఏపీలో జిల్లాల పునర్విభజనకు మరి కొంత సమయం అవసరం.
విశాఖ రాజధాని ఖాయం అయ్యాక అక్కడ అనూహ్యంగా కొన్ని సమస్యలు పుట్టుకొస్తాయని అంచనా. ఉద్యోగుల తరలింపు మాత్రమే కాదు.. అక్కడ చదరపు అడుగుకు ఘననీయంగా జన సంఖ్య పెరుగుతుందని ముందే అంచనా వేశారు. ప్రభుత్వ లెక్క ప్రకారం.. 25 శాతం జనాభా పెరిగే వీలుందని అంచనా. సీనియర్ వైకాపా మంత్రి విజయసాయి రెడ్డి ఇంతకుముందే ఈ విషయాన్ని ప్రకటించారు. పెరిగే జనాభాకు తగ్గట్టు ఆవాసాల పెంపు ఎలా అన్నదానిపైనా చర్చ సాగింది. దాంతో పాటే నగరానికి మంచినీటి లభ్యత.. కోసం ప్రాజెక్టులు నదీజలాల తరలింపు కోసం బడ్జెట్ల కేటాయించారు. నదీజలాల తరలింపు కోసం పైప్ లైన్ల తవ్వకాలు సాగుతున్నాయి. ఇక ఇప్పటికే విశాఖ నగరంలో ఏ భవంతుల్లో రాజధాని వ్యవహారాలు నిర్వహించాలి? అన్నదానిపైనా క్లారిటీ ఉందని తెలుస్తోంది.