ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మంత్రి గారి పని తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయన మంత్రిత్వ శాఖలో వరుసగా వివాదాలు రేగుతుండటం,పైగా వాటని ఆయన సమర్థవంతంగా అడ్డుకోలేకపోతుండటం ఆయనకే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో సదరు మంత్రి గారి పదవికి గండం వాటిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ నేతలే అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారట. ఇంతకీ ఆ అమాత్యులు మరోవరో కాదు…గుడులు, ఆలయాలు వాటి ఆదాయాలను చూసే మంత్రి…
సెంటిమెంట్ కొనసాగుతుందా?
పాపం ఈయన ఏ ముహుర్తాన ఆ శాఖ మంత్రిగా పదవిని స్వీకరించారో గానీ ఈయన శాఖ టార్గెట్ అయినట్లుగా రాష్ట్రంలో మరే మంత్రిత్వ శాఖకి ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన జరగక ముందు ఎన్నో దశాబ్దాల నుంచే ఈ శాఖ మంత్రిగా పనిచేసిన వారిని దురృష్టం వెంటాడుతుందనే సెంటిమెంట్ ప్రాచుర్యంలో ఉంది. రాష్ట్రం విడిపోయాక తొలి ప్రభుత్వం హయాంలోనూ ఈ శాఖ మంత్రిగా పనిచేసిన బిజెపి ఎమ్మెల్యే కూడా మధ్యలోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మంత్రిని ఈ సెంటిమెంట్ వెంటాడుతుందా?…అనేట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వరుస వివాదాలు…
వైసిపి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత టిటిడిలో అన్య మత ప్రచారం అంటూ మొదలైన వివాదాలు, సింహాచలం ట్రస్ట్ వ్యవహారాలు, అంతర్వేది రథం దగ్థం, తాజాగా దుర్గ గుడిలో వెండి సింహాల మాయం ఇలా…ఒకదాని వెంట మరొకటి వచ్చిపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులతో జరిగిన ఒక సమీక్షా సమావేశంలో సిఎం జగన్ అవినీతి గురించి హెచ్చరిస్తూ కరప్షన్ బాగా ఉండే రెవున్యూ శాఖ సరసన దేవాదాయ శాఖ కూడా చేరిపోయిందని వ్యాఖ్యానించారట. దీంతో వైసిపి లో అప్పుడే ఈ శాఖ విషయం చర్చనీయాంశంగా మారింది. పైగా దేవాలయ భూముల స్కాం జరిగిందంటూ ఈ మంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మీడియాలోలో గతంలో వార్తలు, తాజాగా విజయవాడలో మంత్రి అనుచరుల అవినీతి అంటూ కథనాలు ఆయనకు మైనస్ గా మారాయి.
ఇటీవలి కాలంలో మరింత ఇబ్బంది…
అంతర్వేది రథం దగ్ధం ఘటన వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన- బిజెపి, హిందూత్వ వాదులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు, ఘాటైన విమర్శలతో దుయ్యబట్టారు. అయితే పదే పదే వివాదాలు ఎదురువుతున్నా వాటిని సమర్థవంతంగా అరికట్టడంలో, ఎదుర్కోవడంలో అ మంత్రి విఫలమయ్యారనే వాదనలు ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. అంతర్వేది రథం దగ్ధం సహా దేవాలయాలకు సంబంధించిన వివిధ వివాదాలకు బాధ్యులుగా చేస్తూ 50 మంది వరకు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఇంతమంది అధికారులు సస్పెండ్ అయ్యేంతవరకు పరిస్థితులు వెళ్లాయంటే మరి ఆ శాఖ మంత్రి అప్పటి వరకూ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న ఉత్పన్నమవకుండా ఉంటుందా?…
విమర్శలు తిప్పికొట్టే విషయంలోనూ…
అసలు దేవాలయాల్లో వరుస వివాదాలు సంభవిస్తున్నప్పుడు మొదట్లోనే మంత్రి ఈ వ్యవహారాలపై కఠిన చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఈ మధ్యనే చోటుచేసుకున్న దుర్గ గుడి లో సింహాల మాయం ఘటన లో మంత్రి వెల్లంపల్లి సమాధానాలు ఆయనకే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. అవి ఎక్కడో స్టోర్ రూములో ఉండే ఉంటాయి, మూడు సింహాలు కాదు రెండు సింహాలే కనిపించడం లేదు, లాకర్ పెట్టి ఉంటారు, మా హయాంలో కాదు టిడిపి హయాంలోనే ఇది జరిగి ఉంటుంది…బాధ్యత లేనట్లుగా ఒక్కోసారి ఒక్కో సమాధానంతో పొంతనలేని విధంగా ఆయన చెప్పిన జవాబులు వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి కారణం అయ్యాయి.
పదవీ గండం తప్పదా?
దీంతో రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో మిగతా మంత్రుల సంగతేమో గానీ ఈ మంత్రికి మాత్రం పదవీ గండం తప్పదేమోననే వ్యాఖ్యలు వైసిపి శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. పైగా ఆ పదవికి బ్యాడ్ లక్ తప్పదనే సెంటిమెంటూ, ప్రస్తుత పరిస్థితులూ రెండూ ఆ పరిణామం తప్పదనే సూచిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ శాఖ నుంచి తనకు ఎదురవుతున్న విమర్శల విషయంలో జగన్ సీరియస్ గా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇక ముందైనా మంత్రి ఆ మంత్రి తన పనితీరుతో వాటికి ఫుల్ స్టాప్ పెడతారేమో వేచి చూడాలి.