నేనే రాజు అయితే – వైయస్ జగన్ బ్రహ్మోత్సవాల్లో డిక్లరేషన్ ఇవ్వాలా?

YS Jagan In Tirumala

గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న అంశాలు అంతర్వేది లో రథం ప్రమాదంలో తగలబడటం మరియు ఈరోజు తిరుమలకు వెళుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాలా? వద్దా ?? అనే అంశాలు

YS Jagan In Tirumala

గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం ఏమంత ముఖ్యమైన పాత్ర పోషించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య రాజకీయ వైరం ఉండేది కానీ మత పరంగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం విడిపోలేదు. గత ఎన్నికల్లో చాలా కులాలు మరీ ముఖ్యంగా బీసీలు, ఎస్సీ ఎస్టీలు, క్రైస్తవులు మరియు ముస్లింలు దాదాపుగా 70 శాతం పైనే వైసీపీకి ఓటు వేశారు. మిగతా అగ్రకులాల్లో టిడిపికి వైసీపీకి ఇంచుమించుగా సమానంగా ఓట్లు వచ్చినప్పటికీ బిసి మైనారిటీ ఎస్సి ఎస్టీ ఓటు బ్యాంకు వైసిపికి ఎప్పుడూ లేని విధంగా పడడంతో వైసీపీ  అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రతిపక్షానికి కనిపిస్తున్న ఏకైక మార్గం ఈ సమాజాన్ని కులాల పరంగా కాకుండా మతాల పరంగా విడగొట్టడం.

టీడీపీకి గతంలో ఈ విధమైన మత రాజకీయం చేయడం అనేది అంత అలవాటు లేదు. అయితే మత రాజకీయాలు బిజెపికి మొదటి నుండి వెన్నతో పెట్టిన విద్య. ఉత్తర భారత దేశంలో చాలా వరకు మొదట్లో వారు అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ఈ మత రాజకీయాలు వల్లనే అది చాలావరకు సాధ్యపడింది. దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బిజెపి పాగా వేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడడం లేదు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చాలా బలహీనంగా ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితి చూస్తే బిజెపికి వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధిగమించి అధికారంలోకి రాకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థానం సంపాదించవచ్చు అని ఒక ఆశ కనబడుతుంది. అయితే ఈ మత రాజకీయాలు టిడిపికు మేలు చేయకుపోయిన టిడిపి ఈ విషయాల్లో బిజెపికి వంత పాడుతుంది. ప్రస్తుతం టీడీపీకి ఉన్న ప్రధాన లక్ష్యం అధికారంలో ఉన్న వైసీపీని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బలహీనపరచడం. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కంటే కూడా ప్రజలు తెలుగుదేశంని ఒక ప్రత్యామ్నాయంగా చూస్తారని తెలుగుదేశం నమ్మకం.

ఈ నేపథ్యంలో టీటీడీ అధ్యక్షులు వై వి సుబ్బారెడ్డి చేసిన ఒక వ్యాఖ్య కారణంవల్ల ఈ రాష్ట్రం లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు అనే భావన ప్రజల్లోకి వెళ్ళింది. ఈ అంశాన్ని వెంటనే అందిపుచ్చుకున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రేపు జగన్ బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిందే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

చంద్రబాబు అంటే తీవ్రంగా స్పందించే మంత్రి కొడాలి నాని ఇదే విషయంపై మాట్లాడుతూ “అసలు ఏ గుడిలో గాని మసీదులో గాని చర్చిలో గాని లేని ఒక నిబంధన కేవలం తిరుమలలోనే ఎందుకు ఉంది? నిబంధనలు సక్రమంగా అమలు చేయలేనప్పుడు దాన్ని ఉంచడం ఎందుకు? దీని మీద మతపెద్దలు చర్చ చేయాలి” అని ఘాటుగా స్పందించారు. అలాగే ముఖ్యమంత్రి తనకుతానుగా వెళ్లడం లేదు కాబట్టి తిరుమల ధర్మకర్త మండలి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించింది కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో అక్కడకు వెళుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా అన్నారు . ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపాయి. అనేకమంది ఎవరికి తోచినరీతిలో వారు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం మొదలు పెట్టారు.

జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్య వైద్య అవసరాలకు గాని రైతు సంక్షేమానికి గాని అభివృద్ధికి కానీ ఏవిధంగా కూడా దోహదపడకపోగా ఇవన్నీ కేవలం సమాజంలో ఒక అలజడి సృష్టించడానికి మాత్రమే ఉపయోగపడే అంశాలు. భక్తి అనేది వ్యక్తిగతమైనప్పుడు అది ప్రతిరోజు  ఎవరి కోసమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఈ పరిణామాలన్నీ కూడా ఒక వర్గపు మీడియా సహకారంతో ఎలాగైనా అధికారంలోకి ఎలాగైనా రావాలనే స్వార్థంతో పని చేసే నాయకులు వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో తీవ్ర అలజడి రేగే అవకాశం ఉంది. వీటినన్నిటినీ కట్టడి చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు వుంది.

డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి

YS Jagan at Rishikesh

ఈ సందర్భంలో నేనే రాజు అయితే అనే ఆ వ్యాసం ద్వారా ఈ సమస్యకు మేము అనుకుంటున్న ఉత్తమ పరిష్కారం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పట్టువస్త్రాలు శ్రీవారికి సమర్పించేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అక్కడ పెట్టడం వల్ల వైయస్ జగన్ కు జరిగే నష్టమేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అని క్రైస్తవ మతం ఆచరిస్తారని రాష్ట్రం మొత్తానికి ఆ మాటకొస్తే ఈ దేశంలో రాజకీయాలు ఫాలో అవుతున్న అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. అది ఆయన మేనిఫెస్టోను చూసే కానీ మతాన్ని చూసి కాదు కదా?  కాబట్టి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సంతకం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట పెరుగుతుందే కానీ తగ్గదు. తనకి అన్ని మతాలు ఒకటేనని, వెంకటేశ్వరస్వామి అంటే తనకు నమ్మకం ఉందనే విషయాన్నీ మరొకసారి ప్రజల్లోకి స్పష్టంగా వెళుతుంది. రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవాలి అనుకున్నవారికి ఎంటువంటి అవకాశం లేకుండాపోతుంది.

అలాగే రాబోయే కాలంలో తిరుమల ధర్మకర్తల మండలి పదవీ కాలం పూర్తయిన తరువాత రాజకీయాలకు అతీతంగా హిందూ మతం కోసం తమ జీవితాన్ని దారపోస్తున్న ఆధ్యాత్మిక గురువులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు లాంటి వారికి ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి కట్టబెట్టాలి.

అదేవిధంగా రాబోయే కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తాను అనేక హిందువుల ఆలయాన్ని సందర్శించినట్టే అవసరాన్ని బట్టి అక్కడ జరిగే కార్యక్రమాలు బట్టి తన వెసులుబాటు చేసుకొని అక్కడికి వెళ్లి పూజలు చేయడం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం చేయాలి.

మత రాజకీయాలు కోసం కాదు!

ఇవన్నీ మత రాజకీయాలు చేస్తున్న పార్టీలకు భయపడో లేకుంటే తనకు ఓట్ల రూపంలో లబ్ది చేకూరడం కోసమో కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలుకు భవిష్యత్తులో కూడా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం. తాను ఏదైతే అభివృద్ధి సంక్షేమం అనే రెండు ప్రధాన అంశాలు తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారో దాని నుండి దృష్టి మరల్చకుండా ఉండడం కోసం. ఈ చిన్న చిన్న విషయాల వైపు ప్రభుత్వం, పార్టీ తన శక్తియుక్తులన్నీ వృధా చేసుకోకుండా, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర శాంతి భద్రతలే ధ్యేయంగా ముందుకు సాగడం కోసం. ముఖ్యమంత్రిగా తాను పాటిస్తున్న విలువలను , తన ప్రతిష్టను మరో రెండడుగులు పెంచుకోవడం కోసం.

యల్. ఎన్. కె

lnk@telugurajyam.com