(మల్యాల పళ్లంరాజు)
ప్రజానాయకుడు అంటే.. ప్రజలతో మమైకం అయిన నాయకుడే. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను సూచిస్తూ, వారికి స్ఫూర్తి నిస్తూ, భవిష్యత్ పై భరోసా కల్పించేవాడే నిజమైన నాయకుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అపూర్వ పాదయాత్రతో ప్రజా నాయకుడుగా ప్రజల మనస్సుల్లో స్థానం సాధించారా.. ఆయన ఆశించిన మేరకు ప్రజాదరణ పొందారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 14 నెలలపాటు (339 రోజులు) 13 జిల్లాలలో 3,648 కిలోమీటర్ల మేరకుసాగిన పాదయాత్ర ఓ చరిత్రే. ఈ పాదయాత్ర విజయవంతం అయిందా అన్న ప్రశ్నకు జగన్ వెంబడి నడిచిన వేలాది మంది. బహిరంగ సభలకు హాజరైన లక్షలాది మంది ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. ఇడుపుల పాయనుంచి ఇచ్ఛాపురం వరకూ, చిత్తూరు నుంచి ఒరిస్సా సరిహద్దుల వరకూ ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని నియోజకవర్గాలనూ స్పృశిస్తూ సాగిన ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అత్యంత ప్రజాదరణ పొందిన పాదయాత్ర ఇది. రాజమండ్రి, విశాఖ, కాకినాడతో పాటు అటు కడప, కర్నూలు జిల్లాల్లో నా పర్యటనల సందర్భంగా జర్నలిస్ట్ గా ప్రజల నాడిని గమనించేందుకు స్వయంగా ప్రజాభిప్రాయం సేకరణకు పూనుకుంటే.. జనంలో జగన్ కు గల ప్రజాదరణ సుస్పష్టంగా వెల్లడయింది.
తెలుగునాట యాత్రా స్పెషల్ కు ఆద్యుడు దివంగత నేత ఎన్టీరామారావు. 1982,1985,1994లో చైతన్యరథయాత్రలు సాగించి చరిత్ర సృష్టించారు. ప్రతియాత్ర ఆయనకు విజయసోపానం అయింది.
ఇక పాదయాత్ర అన్న మాట విన్పించగానే ముందు గుర్తుకు వచ్చేది స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారే. 2003లో ప్రజాప్రస్థానం పేరుతో ఇటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ మండు వేసవిలో 64 రోజులపాటు, 1,470 కిలోమీటర్ల మేరకు సాగిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఓ సంచలనం. ఆ ప్రజా ప్రస్థానం.. ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుత ముఖ్యమంత్రి ( అప్పటి ప్రతిపక్ష నాయకుడు) నారా చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నా మీకోసం.. పేరుతో యాత్ర జరిపారు. 2012లో హిందూ పురం నుంచి విశాఖ వరకూ దాదాపు 2,800 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర జరిపారు. 208 రోజులపాటు సాగిన యాత్ర మరో చరిత్ర అని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు సీఎం పీఠం అధిరోహించారు.
(జగన్ జైలులో ఉండగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కూడా అన్నకు సంఘీభావంగా ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేశారు. 230 రోజులపాటు 3,112 కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర సాగినా ఆమె ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించక పోవడం, ఆ తర్వాత కూడా రాజకీయాలకు దూరంగా ఉండడంతో పెద్దగా గుర్తింపునకు నోచుకోలేదు)
ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మాత్రం గతంలోని పాదయాత్రల కన్నా భిన్నంగా కొత్త రికార్డులను నెలకొల్పుతూ, ఇంకెన్నో నియోజకవర్గాల మీదుగా సాగింది. 2017లో మొదలైన పాదయాత్ర 2019లో ముగుస్తున్నది. 2018లో పూర్తిగా జగన్ పాదయాత్రలోనే ఉండడం గమనార్హం. 338 దినాలుగా పాదయాత్రలు చేస్తూ, అడుగడుగునా ప్రజల సమస్యలు ఆలకిస్తూ, పాదయాత్రలో భాగంగానే ప్రతి 2,3 రోజులకు భారీ బహిరంగ సభలను నిర్వహించడం ఈ పాదయాత్రలోని విశిష్టత. వైఎస్ కుటుంబానికి చెందిన ముగ్గురు పాదయాత్రలు చేయడం రాష్ట్ర చరిత్రలో మరో ముఖ్యాంశం.
యాత్రలు జగన్ మోహన్ రెడ్డికి కొత్త కాదు. జగన్ రాజకీయ పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి జగన్ జనంతోనే నడిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలి మరణించిన వారి కుటుంబాల కన్నీరు తుడిచేందుకు జగన్ ఓదార్పుయాత్రలు ఆరంభించారు. మధ్యలో జైలు జీవితం. అనంతరం రైతుల సమస్యలపై, ప్రత్యేక హోదా కోసం, ప్రజా సమస్యలపై ధర్నాలు, ఆందోళనలలో పాల్గొంటూ ప్రజలతోనే గడిపారు. 2017 నుంచి నిర్విరామంగా సాగిన పాదయాత్ర. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి అలుపెరుగని వీరుడిగా జగన్ ప్రజాందోళనల్లో గడిపారు. ప్రజలకోసం కుటుంబ జీవనానికి దూరం అయ్యారు.
చంద్రబాబు వైఫల్యాలే… జగన్ విమర్శలకు సోపానాలయ్యాయి. విమర్శనాస్త్రాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వాగ్దానాలను మరచిపోయారు. రైతులు, పేదల సమస్యలను విస్మరించారు. విభజన హామీలను, ప్రత్యేక హోదా, ఇతర రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారు. రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్ స్వప్నాల్లో తలమునకలు కావడంతో రాష్ట్ర మంత్రులు అవినీతి కార్యకలాపాల్లో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పాదయాత్ర కు పూనుకున్నారు. యాత్ర సందర్భంగా ప్రజలు జగన్ ను అక్కున చేర్చుకున్నారు. లక్షలాదిగా తరలివచ్చిన జనం ఈ యాత్రను విజయవంతం చేశారు. ప్రజలతో మమైకమై, ప్రజా సమస్యలను ఓపిగ్గా ఆలకిస్తూ, సామరస్యంగా మాట్లాడుతూ, సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి ఆవేదనలో పాల్పంచుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో పరిష్కారం చూపుతూ, భవిష్యత్ లో వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని భరోసా కల్పిస్తూ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సాగింది. తాను ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో అన్నీ చెబుతూ వారి ఆశీస్సులు పొందారు. ఎండయినా, వానయినా.. చలి వణికిస్తున్నా జనం వెనుదిరగలేదు. అడుగడుగునా వారి అభిమానం, ప్రేమతో విజయవంతంగా జగన్ పాదయాత్ర 14 నెలలుగా సాగింది. ఈ ప్రేమాభిమానాలు రానున్న ఎన్నికల్లో ఓట్లుగా మారతాయా అన్నది చూడాలి.
గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు తర్వాత అధికారాన్ని అందుకున్నారు. ప్రస్తుత ప్రతి పక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర తర్వాత.. అధికారాన్ని అందుకుంటారా.. కాలమే నిర్ణయించాలి.
(మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ 9705347795)