చూడబోతే చంద్రబాబునాయుడుకు బ్యాడ్ టైం స్టార్టయినట్లే కనిపిస్తోంది. ఓటుకునోటు కేసులో తాజాగా ఓ వీడియో వెలుగు చూసింది. అప్పట్లో తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు రూ 50 లక్షలిస్తు ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. అప్పట్లో వెలుగు చూసిన వీడియో దేశంలో ఎంతపెద్ద సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. అలాంటిదే తాజాగా ఇపుడు మరో వీడియో బయటపడింది. ఈ వీడియోలో స్టీఫెన్ సన్ తో చంద్రబాబు తరపున మధ్యవర్తి సెబాస్టియన్ బేరాలాడుతున్న విషయం స్పష్టంగా బయటపడింది.
అప్పట్లో నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటును టిడిపి రూ 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నది. అందులో అడ్వాన్స్ రూ 50 లక్షలు ఇచ్చే క్రమంలోనే రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. దానికి కొనసాగింపుగానే తాజా వీడియా ఉన్నట్లుంది. ఓటుకు రూ 5 కోట్లు వద్దని చంద్రబాబు చెప్పినట్లు సెబాస్టియన్ చెప్పారు. ఓటుకు రూ 3.3 కోట్లు చాలని అయితే తానే ఆ మొత్తాన్ని రూ 5 కోట్లకు పెంచామని 11 నిముషాల వీడియోలో చెప్పటం స్పష్టంగా వినబడుతోంది.
అయితే, వీడియోలో ఎక్కడా చంద్రబాబునాయుడు అని కాకుండా కేవలం బాబు అని మాత్రమే ప్రస్తావించటం గమనార్హం. అప్పట్లో బయటపడిన వీడియోలో కూడా నేరుగా చంద్రబాబే స్టీఫెన్ సన్ తో మాట్లాడారు. అయితే నామినేటెడ్ ఎంఎల్ఏతో మాట్లాడింది తానే అని ఇప్పటి వరకూ చంద్రబాబు ఎక్కడా ఒప్పుకోలేదు. అలాంటిది తాజాగా వీడియోలో బాబు అన్న ప్రస్తావన తనగురించే అని చంద్రబాబు ఒప్పుకుంటారా ? మొత్తానికి షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ సమస్యలు చంద్రబాబును బాగా కమ్ముకుంటున్నట్లే ఉంది.