AP Govt Employees : రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు గత కొద్ది రోజులుగా కొత్త పీఆర్సీ విషయమై. ఫిబ్రవరి 1న జనవరి నెలకు సంబంధించి కొత్త జీతాలు పడతాయని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. కొత్త జీతాలు వద్దు, పాత జీతాలే ముద్దు.. అంటూ ఉద్యోగులు నినదిస్తున్నారు.
రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి.. రకరకాల రూపాల్లో ఉద్యోగులు ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు సమ్మ నోటీసుని ప్రభుత్వానికి ఇచ్చిన దరిమిలా, వివాదం పరిష్కారం కాకపోతే.. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళడం ఖాయం. అయితే, ఉద్యోగులపై ఎస్మా ప్రయోగానికి జగన్ సర్కార్ సమాయాత్తమవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇదంతా నాణానికి ఓ వైపు. ఇంకో వైపు సీన్ మరోలా కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు చేస్తోన్న ఆందోళనలకు కొందరు ఉద్యోగులు దూరంగా వుంటున్నారు. కొన్ని సంఘాలు ఈ ఉద్యమాల్ని పట్టించుకోవడంలేదు. మరికొన్ని సంఘాలు తీవ్రంగా ఈ ఆందోళనల్ని వ్యతిరేకిస్తున్నాయి.
జీతాలు పడితే, పెరిగిన వేతనాలతో ఉద్యోగులు హ్యాపీగానే వుంటారనీ, అప్పుడు ఉద్యోగ సంఘాల నేతలకు పనేమీ వుండదనీ అధికార వైసీపీ చెబుతోంది. కానీ, ఆ ఉద్యోగులే తమకు కొత్త జీతాలు వద్దని తెగేసి చెబుతుండడంతో ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
కరోనా సమయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించడమేంటన్న చర్చ జనంలో జరుగుతుండడం గమనార్హం.