ఆ మూడు విషయాల్లో జగన్ కు ఎదురుదెబ్బలు తప్పవా?

ys jagan government facing Criticism
జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా మూడు విషయాల్లో మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది.   ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు వెళ్తాయో లేదో తెలియదు కానీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఇసుక విధానంలో ఏర్పడిన సంక్షోభం పద్దెనిమిది నెలల పరిపాలన తరువాత కూడా కుదురుకోలేదంటున్నారు.  ఇసుక ప్రజలకు అందించడంలో ఒక విధానం అంటూ ప్లాన్ చేసుకోకుండా హడావిడిగా చంద్రబాబు ప్రభుత్వంలో రూపొందిన ఇసుక విధానాన్ని తొలగించారు.  ఆ తరువాత ఆరేడు నెలల పాటు ఇసుక అనేది దొరక్కపోవడంతో భవన నిర్మాణ సంస్థలు అనేక ఇబ్బందులు పడ్డాయి.  నిర్మాణ రంగం దెబ్బ తినడంతో కార్మికులకు ఉపాధి పోయింది.  ఆ తరువాత కిందామీదా పడ్డప్పటికీ ఇసుకలో దోపిడీ మాత్రం ఆగలేదని ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.  ఇసుక రీచ్ ల దగ్గరే అవినీతి మొదలవుతుందని, అసలు బుకింగులు లేనివాళ్లకు కూడా అవినీతి కారణంగా కావలసినంత ఇసుక లభించగా, బుకింగులు చేసుకుని చెల్లింపులు చేసినవారికి ఇసుక దక్కలేదని వాపోతున్నారు.   స్థానిక ప్రజాప్రతినిధులకు ఇసుక డబ్బులు కురిపించే సాధనం అయిందని బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి.  ఇసుక విధానం గందరగోళం కావడానికి ఒక సీనియర్ మంత్రి ఇచ్చిన సలహాలే అని  ప్రజాక్షేత్రంలో సామాన్యుల నోట వినిపిస్తున్న మాట.  
ys jagan government facing Criticism
ys jagan government facing Criticism
 
ఇక మద్యం విధానం కూడా అయోమయానికి, అసహనానికి దారితీసింది.  దేశంలో మద్యనిషేధం ఎక్కడా సఫలం అయిన దాఖలా లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మొండిగా మద్యనిషేధానికి కట్టుబడి ఉన్నానని చెబుతుండటం  మద్యం మాఫియాలో ఆందోళన కలిగిస్తున్నది.  అలాగే ఎన్నడూ కనీవినీ ఎరుగని బ్రాండ్స్ మార్కెట్లో ప్రత్యక్షం కావడం, వాటి ధరలు అధికంగా ఉండటం అనేక సందేహాలకు తావిస్తున్నది.  ఇదొక పెద్ద కుంభకోణం అని కొందరు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.  కోర్టులో కూడా ప్రభుత్వ విధానానికి ఎదురుదెబ్బలు తగలడం, పొరుగు రాష్ట్రాల నుంచి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం ప్రభుత్వ నైతిక బలాన్ని దెబ్బతీసింది.  మద్యనిషేధం విధించి ఎన్టీఆర్ చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురయ్యారని, ఆనాడు మద్యం మాఫియా చంద్రబాబుకు సహకరించిందని కొందరు పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.  మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా నితీష్ కుమార్ ఓటమి పాలయితే అందుకు కారణం మద్యనిషేధమే అవుతుందని భావిస్తున్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలు మద్యం ఆదాయాన్ని పొందుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో మొండితనాన్ని ప్రదర్శించడం పట్ల వైసిపి నాయకులే విమర్శిస్తున్నారు.  
 
దేశంలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తూ రోజూ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే మూడు నుంచి నాలుగువేలమందికి సోకుతున్న తరుణంలో స్కూల్స్ తెరవడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పాఠశాలలు తెరిచిన తరువాత వేలాదిమంది టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు కరోనా బారిన పడుతుండటం భయాన్ని రేపుతున్నది.  ఒక ఏడాది నష్టం అయినంతమాత్రాన జీవితాలు నాశనం అవుతాయా అని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు.  ఒక వంక పంచాయితీ ఎన్నికలు జరపడానికి కరోనా సాకు చెబుతూ స్కూల్స్ ఎలా తెరుస్తారని విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయంలో మరొకసారి ప్రభుత్వానికి కోర్టు నుంచి మొట్టికాయలు తప్పవేమో అని పార్టీ అభిమానులు సైతం వాపోతున్నారు.  
 
ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆలోచించి 2020  – 21   విద్యాసంవత్సరాన్ని రద్దు చెయ్యాలని, లేదా వారిని పై తరగతులకు ప్రమోట్ చెయ్యాలని తల్లితండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.  మొండిగా పొతే ఎదురుదెబ్బలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు.  చదువులకంటే ప్రాణాలు ముఖ్యం అని అంటున్నారు.