వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రభుత్వాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బెదిరింపులకు పాల్పడటం, కుట్రపూరిత నేరం.. ఇలా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ. అరెస్ట్ అనంతరం రఘురామకృష్ణరాజుని ఆంధ్రపదేశ్ తరలించారు ఏపీ సీఐడీ పోలీసులు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఈ నర్సాపురం ఎంపీ, ఆ తర్వాత అనూహ్యంగా సొంత పార్టీపైనే తిరుగుబాటు బావుటా వేశారు. వైసీపీ వర్సెస్ వైసీపీ రెబల్ ఎంపీ.. అన్నట్లుగా పెద్ద రచ్చే జరుగుతూ వస్తోంది గత కొంతకాలంగా. అయితే, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని వైసీపీ సస్పెండ్ చేయడంలేదు.. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంలేదు. దాదాపుగా ప్రతిరోజూ రచ్చబండ పేరుతో రాజకీయ రచ్చ చేస్తున్న రఘురామ, గత కొద్ది రోజులుగా అచ్చం వైఎస్ జగన్ తరహాలో మిమిక్రీ చేస్తూ ఒకింత చిరాకు పుట్టిస్తున్నారు.. అది ముమ్మాటికీ అధికార పార్టీ ఆగ్రహానికి కారణమై వుండొచ్చు.
రాష్ట్రంలో క్రిస్టియానిటీని వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే ఆరోపణలతోపాటు, ఇంకా చాలా రకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు నర్సాపురం ఎంపీ. దాంతో, సరిగ్గా సమయం చూసి రఘురామకృష్ణరాజుని వైసీపీ దెబ్బకొట్టిందా.? అన్న చర్చ జరుగుతోంది. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నది వైసీపీ వాదన. ఎవరి వాదనలు ఎలా వున్నా, రఘురామపై బలమైన కేసులే ఏపీ సీఐడీ నమోదు చేసిన దరిమిలా, ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒక్కటి మాత్రం నిజం.. కొన్ని రోజులపాటు రఘురామ రొచ్చబండ నుంచి రాష్ట్ర ప్రజానీకానికి కాస్తంత విరామం. ‘నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారహ…’ అంటూ నానా యాగీ చేసిన రఘురామ, ఎట్టకేలకు అరెస్టు అయి.. తన కోరిక తీర్చుకున్నారని అనుకోవాలేమో.