సందేహం లేదు…న్యాయవ్యవస్థపై అమీతుమీ తేల్చుకోవడానికి జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం సిద్ధపడినట్లే కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన ఆరోపణలు, మొన్న రాజ్యసభలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన, నిన్న లోక్ సభలో ఆ పార్టీ నాయకుడు మిదున్ రెడ్డి వెలిబుచ్చిన అభిప్రాయలు న్యాయవ్యవస్థ మీద పోరాటంగానే భావించాలి.
పుచ్చకాయ పగిలినట్లు…..
గత ఏడాదికాలంగా జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, నిర్ణయాలు సుమారు 70 వరకు కోర్టు ద్వారా కొట్టివేయబడ్డాయి. జగన్ ప్రభుత్వం ప్రాధామ్యాలైన మూడు రాజధానులు, పేదలలకు ఇళ్లస్థలాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమీడియంలో విద్యాబోధన లాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలను కోర్ట్ వివిధ కారణాలతో అడ్డుకున్నది. చివరకు గవర్నర్ సంతకం చేసిన ఆర్డినెన్స్ ను కూడా కోర్ట్ పక్కన పెట్టింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో ప్రభుత్వం, హైకోర్టు సమన్వయంతో పనిచేసుకుంటున్నాయి. “కేబినెట్ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోము” అని తెలంగాణ హైకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గవర్నర్ నిర్ణయాల్లో కూడా హైకోర్టు జోక్యం చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ హైకోర్టు మొదట్లో కొంచెం దూకుడుగా వ్యవహరించినా, ఆ తరువాత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయాన్ని పరిష్కరించే హక్కు, అధికారం మాకు లేవని ప్రకటించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిటికెలో ఆ సమస్యను పరిష్కరించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్యన అలాంటి సుహృద్భావ వాతావరణం కనిపించడంలేదు. పరస్పరం ఘర్షణపూరితంగా వ్యవహరిస్తున్నాయి.
హైకోర్టు వైఖరి కక్షపూరితం
గత ఏడాదిగా ఎంతో సంయమనంతో, సహనంతో, న్యాయవ్యవస్థ మీద ఒక్క చిన్నపాటి విమర్శ కూడా చెయ్యకుండా నెట్టుకొస్తున్న వైసిపి ప్రభుత్వం రాజధాని భూముల కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో హైకోర్టు అడ్డుకోవడం, అసలు FIR ను ఎక్కడా ప్రచురించడానికి కూడా వీల్లేదని షరతులు విధించడం, సోషల్ మీడియా రాతలపై కూడా ఆంక్షలు విధించడంతో ప్రభుత్వ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా సుప్రీమ్ కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ కుమార్తెలు ఈ కుంభకోణంలో ఉన్నారని తెలియగానే దేశం మొత్తం స్తంభించిపోయింది. హైకోర్టు నిషేధించినప్పటికీ, ఆ వివరాలు దేశం మొత్తం తెలిసిపోవడంతో మేధావులు, పాత్రికేయులు, మీడియా మొత్తం దిగ్భ్రాంతిని ప్రకటించడమే కాక, హైకోర్టు వ్యవహారశైలిని పూర్తిగా తప్పు పట్టారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సైతం హైకోర్టు తీర్పును తప్పు పట్టడంతో ఎలాగైనా ఈ అంశాన్ని జాతీయస్థాయిలో తేల్చుకోవాలని జగన్ కృతనిశ్చయుడైనట్లు వైసిపి ఎంపీల నిరసన, ఆగ్రహం స్పష్టం చేస్తున్నాయి. ఒక డాక్టర్ పీకలదాకా తాగి, రోడ్డు మీద అల్లరి చేస్తుంటే, అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తే, దాన్ని తప్పు పట్టి ఆ కేసును సిబిఐ కి అప్పగించిన హైకోర్టు వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, దానిలో పెద్ద తలకాయలు ఉన్నాయని ఎసిబి ప్రకటించిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరితే దాన్ని హైకోర్టు తిరస్కరించడం పట్ల రాష్ట్ర ప్రజలు కూడా రగిలిపోతున్నారు.
హస్తినలో పాంచజన్యం పూరించారు
మిధున్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ మీద తమకు నమ్మకం పోయిందని బహిరంగప్రకటన చెయ్యడం అంటే ఆ వ్యవస్థపై సమరానికి అంకురార్పణ చేసినట్టుగానే భావించాలి. అసలు ఒక దోపిడీ జరిగిందని దేశం మొత్తం తెలిసిపోయాక, దానిమీద విచారణ జరిపించమని హైకోర్టే ప్రభుత్వాన్ని ఆదేశించాలి. అది జరగకపోగా ప్రభుత్వం తనంతట తానే దర్యాప్తు కు సిద్ధపడితే దాన్ని అడ్డుకోవడం అంటే నేరస్తులను రక్షించడమే అని ప్రజలు నమ్ముతున్నారు. హైకోర్టుకు అంత అవసరం ఏముంది? ఒకవేళ విచారణ జరిగి, ప్రభుత్వం ఎవరిమీద ఆరోపణలు చేసిందో, వారంతా నిర్దోషులుగా తేలితే ప్రభుత్వం పరువే కదా పోయేది! అలా కాకుండా దర్యాప్తును అడ్డుకోవడం ద్వారా హైకోర్టు సాధించింది ఏమిటి? పరువుమర్యాదలు ఎవరికైనా ఒకటే కదా!
ఈ ఘర్షణ కొనసాగితే నష్టం ఎవరికి?
ఇక ఇప్పుడు ఈ యుద్ధం ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఈ సరళి చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగించినట్లే కనిపిస్తున్నది. తన మీద కోర్టు కేసులు ఉన్నా ఏమాత్రం లక్ష్యపెట్టకుండా కోర్టులతోనే పోరాటానికి దిగారంటే..జగన్ చిత్తశుద్ధిని, ధైర్యసాహసాలను ప్రజలు అభినందిస్తున్నారు. ఈ యుద్ధం కొనసాగడం ప్రజాస్వామ్యానికి క్షేమమా? ఈ విషయంలో తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎపి హైకోర్టు వ్యవహారశైలిని సరిదిద్దాలి. ఒకవేళ ప్రభుత్వానిది తప్పైతే, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఈ వైరుధ్యాలు ముదిరితే ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాల్సివస్తే అందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తున్నది. ఆయన్ను జైల్లో పెడతారా? పెట్టినంతమాత్రాన చంద్రబాబుకు అధికారం రాదు. ఆ పార్టీలోనే మరొకరు ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం అప్పుడు సంపూర్ణంగా సమాధి అవుతుంది. ఏమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ పనితీరును జాతీయస్థాయిలో రచ్చ చెయ్యడంలో జగన్మోహన్ రెడ్డి విజయాన్ని సాధించారు. ఎందుకంటే…రాష్ట్ర స్థాయిలో వారు ఎంత గొంతు చించుకున్నా, మీడియా ఒక్క ముక్క కూడా బయటకు రానీయదు. కురుక్షేత్రమే అసలైన తగిన సమరాంగణం
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు