మేలే కాదు జగన్ పాదయాత్ర చెడు కూడా చేసింది, ఎలాగంటే…

(యనమల నాగిరెడ్డి)

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందోత్సహాలతో కేరింతలు కొడుతున్నారు. “కావాలి జగన్- రావాలి జగనన్న” అన్న మిన్నంటిన నినాదాలకు తోడు జగన్ ప్రకటించిన “నవరత్నాల” అండదండలతో వైసీపీ వచ్చే ఎన్నికలలో అధికారపీఠం అధిష్టిస్తుందని, పార్టీ కార్యకర్తలు (అవసరమైన కష్టం చేయకుండానే) ఉహల పల్లకిలో ఉరేగుతున్నారు.

యాత్ర వల్ల జగన్ కు భారీ లాభమే!

జగన్ 2017 నవంబర్ లో ఇడుపులపాయ నుండి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర 2019 జనవరిలో ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ పాదయాత్రలో ఆయన 134 నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. లక్షలాది మందిని వెంట నడిపించుకున్నారు. స్వయంగా కొన్ని లక్షలమందిని కలిశారు. ప్రజల కన్నీటి గాధలు విన్నారు. కనులారా చూసారు. ఈ యాత్రలో తనను కలసిన వారందరి కస్టాలు “ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని” ఘంటాపధంగా చెప్పారు. (అంతులేని ప్రజల కోరికలు తీర్చడానికి, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి భేతాళ మాంత్రికుడి మంత్రం దండం కావాలని విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల దృష్ట్యా ఇస్తున్న హామీలు నెరవేర్చడానికి కూడా ఆయన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు నేర్చుకోవాల్సిందే).

ఈ యాత్ర వల్ల జగన్ కు భారీ లాభమే చేకూరిందని చెప్పవచ్చు. ఆయన ప్రజలతో ఏకం కావడంతో పాటు చంద్రబాబుకు రాజకీయంగా వణుకు పుట్టించగలిగారు. ముఖ్యమంత్రిని కొన్ని అంశాలలో కట్టడి చేయడంలోనూ, తనవెంట నడిపించుకోవడంలో కూడా విజయం సాధించారు. గత నాలుగేళ్లుగా తాను చేస్తున్న అన్ని డిమాండ్లను చంద్రబాబు చేత చిలక పలుకుల్లా పలికించగలిగారు.

“బీజేపీతో అంటకాగినపుడు ప్రత్యేక హోదా ఏమన్నా మంత్రదండమా? ప్యాకేజీయే మిన్న” అన్న బాబును, ఆయనతో పాటు టీడీపీ మహా మేధావులను ప్రత్యేక ప్యాకేజీ నుంచి ప్రత్యేక హోదాకు మళ్లించడం, బీజేపీని వదలి కాంగ్రెస్ పంచన చేర్చడం, వృధ్యాప్య పెన్షన్ లు 1000 నుంచి 2000కు పెంచేసేటట్లు చంద్రబాబును జగన్ నీడలా వెంటాడారు. జగన్ తన పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రిని “తాను కోరుకున్న గమ్యానికి చేర్చడంలో” విజయం సాధించారు.  వచ్చే ఎన్నికల దృష్ట్యా అనేక హామీలు గుప్పించి, వెంటనే (ఎన్నికలకు ముందే) అమలు చేసే లాగా చంద్రబాబుపై వత్తిడి తేగలిగారు. “ఎన్నికలను నల్లేరుమీద నడకలా నడపాలనుకున్న బాబు గారి కలలను కల్లలుగా మార్చి, గెలుపు కోసం పరుగులు పెట్టించడంలో” జగన్ సంపూర్ణ విజయం సాదించారు. అలాగే జనం నమ్మకాన్ని గెలుచుకోవడంతో పాటు, వారిని తన వెంట నడుపు కోగలిగారు.

యాత్ర వల్ల జగన్ కు, వైసీపీకి జరిగిన నష్టం ఎంత?

ఈ పాదయాత్ర వల్ల జగన్ కు, వైసీపీకి ఎంతో లాభం జరిగినా ఎంతో కొంత చెడుపు కూడా జరిగిందని చెప్పక తప్పదు. యాత్రలో నిమగ్నమైన జగన్ పూర్తిగా యాత్ర పైనే దృష్టి పెట్టి మిగిలిన అంశాలను ప్రక్కన పెట్టారని, అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన దైన శైలిలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడపడంలోనూ, పాలన సాగించడంలోను ఎదురు (అడ్డం) లేకుండా పోయిందని చెప్పక తప్పదు. రాష్ట్ర రాజధానిలో పార్టీ కార్యాలయాన్ని నిర్వహించడంలోనూ, నియోజకవర్గాల స్థాయిలోను పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో విజయం సాధించలేదని చెప్పక తప్పదు. ప్రత్యేకించి రాజధాని ప్రాంతంలో ఉండి పాలక పక్షం పై ఎదురుదాడి చేయవలసిన వైసీపీ నాయకులు మొక్కుబడిగా 10 లేదా 15 రోజులకు ఒకసారి విలేఖరుల సమావేశాలు నిర్వహించడం, నామకార్తము కార్యక్రమాలు సాగించడం చేశారు. ప్రకటనలు చేయడంతో తమ భాద్యత ముగిసిందని నాయకులు భావించారు.

ఇకపోతే జిల్లా స్థాయి, నియోజకవర్గ నాయకులుగా ఉన్న ఎంఎల్ఏ లు, ఎంఎల్ ఏ కావాలని కలలు కంటున్న వ్యక్తులు “ వైస్సార్ పార్టీ కి ఓటేసి, తమను గెలిపించి జగన్ ను ముఖ్యమంత్రిని చేయమని అడగకుండా, జగనన్న(చూసి)కు ఓటేయమని అడుగుతున్నారు”. ఇక రెండవ శ్రేణి నాయకులు కూడా ఇదే పంధాలో నడుస్తున్నారు. ఈ ధోరణి ఆంధ్ర, రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా వ్యాపించి ఉంది. “మేమంతా జగనన్నకే ఓటేస్తే మధ్యలో వీరెందుకు” అని ప్రజలు గుసగుసలు పోతున్నారు.
ఈ పెడధోరణి వల్ల జగన్ కు ఎంత మేలు జరిగినా పార్టీకి మాత్రం కీడెనని చెప్పవచ్చు. వైసీపీ నాయకులు, కార్యక్రర్తలు ఇకనైనా తమ ధోరణి మార్చుకొని, పార్టీని కూడా వెంట నడుపు కోవాలని జగన్ అభిమానులు కోరుతున్నారు. ఇకపోతే గత 8 సంవత్సరాలుగా జనంలో ఉన్న జగన్ వెన్నంటి నడవడానికి కార్యకర్తలు అనేక రకాలుగా తమశక్తిని ధారపోసారు. ప్రత్యేకించి రెండవ శ్రేణి నాయకులు ఏర్పాట్లు చేయడానికి, కార్యకర్తలను సమీకరించడానికి, వారిని టీడీపీ అరాచకాల బారి నుండి కాపాడటానికి తీవ్రంగా కష్టపడ్డారు. అలాగే ఆర్థికంగా కూడా వారు బాగా నష్టపోయారు.

చంద్రబాబును అడ్డుకోవడంలో విఫలం

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాపరంగా తీసుకుంటున్న ప్రాంతాల మధ్య విభేదాలు పుట్టించే చర్యలను అడ్డుకోవడంలో జగన్ తో పాటు, ఆయన శ్రేణులు కూడా విఫలం అయ్యాయని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రికి రెండు కళ్లుగా చెప్పుకుంటున్న “అమరావతి, పోలవరం” ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేకమైన అంశాలను అడ్డుకోలేక పోయారు. చంద్రబాబు ప్రచారానికి, విదేశీ పర్యటనల పేరుతొ చేసిన హంగామాను, తన స్వంతానికి చేసిన ప్రభుత్వ ఖర్చును గురించి సరిగా ప్రజలలోకి తీసుక వెళ్ళ లేకపోయారు.

కేంద్రం నీటి పారుదల ప్రాజెకక్ట్ లకోసం మంజూరు చేసిన నిధులను ఒకే ప్రాంతంలో ఉపయోగిస్తున్న నోరు తెరవలేదు. ప్రత్యేక హోదా ముసుగులో వెనుకపడిన ప్రాంతాలకిచ్చే ప్రత్యేక ప్యాకేజీని గురించి అసలు మాట్లాడలేదు. కరువు ప్రాంతాలకు ప్రాణాధారమైన ప్రాజెక్ట్ లకు నీళ్లు, నిధుల కేటాయింపులలో జరిగిన (జరుగుతున్న) అన్యాయాన్ని అసలు పట్టించుకోలేదు. గత మూడు సంవత్సరాలుగా కరువుతో మగ్గుతున్న రాయలసీమ పట్ల ప్రభుత్వం కనీస కరుణ చూపలేక పోయిన విషయాన్ని ఎట్టి చూపడంలో నూ, రాయలసీమలో రగులుతున్న ప్రత్యేకవాదాన్ని పట్టించుకోవడంలోనూ వైసీపీ పూర్తిగా విఫలమైంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయం సరే సరి.

రాజకీయం పరంగా చంద్రబాబును తన(తాననుకొన్న) బాటలో నడిపించుకున్న జగన్, ప్రజలకు సంబంధించిన అంశాలలోనూ, జరుగుతున్న(జరిగిన) అవినీతిని ఎత్తి చూపి చంద్రబాబుకు, ఆయన అంతేవాసులకు చెక్ పెట్టడంలో విఫలమైన జగన్ అంతేవాసులు మౌన ప్రేక్షకుల్లాగా మిగిలిపోయారు.

జగన్ అధికార పీఠం చేరుకోవడానికి నిజమైన యుద్ధం ఇపుడే చేయాల్సివుంది.
రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో జగన్ అధికార పీఠం చేరుకోవడానికి ఆయన నిజమైన యుద్ధం చేయాల్సింది ఇపుడే. ఆయన జనంలో కలిగించిన నమ్మకాన్ని, ఉన్న భాద్యతను మొదటి, రెండవ శ్రేణి నాయకులు కూడా తమ భుజాలకెత్తుకోవాల్సి ఉంది. తాము జగన్ కు అండగా ఉండటంతో పాటు జనానికి నిజమైన ఆసరాగా ఉంటామన్న భరోసా కలిగించాలి. చంద్రబాబు చర్యల గురించి ప్రజలకు వివరించడానికి ఉద్యమాలు నిర్మించాలి. అలాగే ప్రాంతాల వారీగా ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షా పూరిత విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. “ఎద్దు ఈనిందంటే గాటికి కట్టెయ్యమనకుండా” అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త వహించాలి. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న ప్రచార యుద్దాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. చివరగా చంద్రబాబును ఆర్థికంగా ఢీ కొనడంతొ పాటు, ఆయన ఎత్తులను తిప్పికొట్టగల సమర్థుల సలహాలు స్వీకరించి పకడ్బందీగా అమలు చేయాలి. పోలింగ్ మానేజ్మెంట్లో చంద్రబాబును ఓడించాలి. ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని భాద్యత గుర్తెరిగిన నాయకులను తన వెంట నడిపించుకుంటూ ఎన్నికల రణరంగంలో బాబును చిత్తు చేస్తేనపుడే పాదయాత్ర ఫలితం జగన్ కు, వైసీపీ శ్రేణులకు దక్కుతుంది.