కెసియార్ కూటమిలో జగన్ చేరితే ఏమవుతుంది?

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన ఫెడరల్ ప్రంట్ లో భాగస్వామ్యం వైపు జగన్ అడుగులు వేస్తున్నట్లు వర్తమాన పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతుంది. ఇదే రాజకీయ సమీకరణాలతో ముందుకు సాగీతే మాత్రం కెసిఆర్ రాజకీయ అవసరాల కోసం జగన్ ఏపీలో రాజకీయ ప్రతికులతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పక తప్పదు.

కేసీఆర్ రాజకీయ అవసరాలు మినహా విశ్వసనీయత లేని ఫెడరల్ ఫ్రంట్ …

కేసీఆర్ చెపుతున్న ఫెడరల్ ప్రంట్ కు ప్రాతిపదిక కేవలం తన రాజకీయ అవసరం మాత్రమే. తెలంగాణ ముందస్తు ఎన్నికలు కూడా అందులో భాగమే. తెలంగాణలో కేసీఆర్ ప్రత్యర్ది కాంగ్రెస్ అదే సమయంలో కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో ప్రత్యర్థి అయిన బిజెపితో కలవాలనుకుంటే తెలంగాణలో రాజకీయంగా నష్టం అలాంటి సమయంలో కేసీఆర్ వేసిన రాజకీయ ఎత్తుగడ బీజేపీ , కాంగ్రెస్ లేని ఫెడరల్ ప్రంట్. బీజేపీ , కాంగ్రెస్ లేని కూటమి దేనికి ఆ రెండు పార్టీలు చేసిన తప్పులు లేని పాలన కోసమే. 2014 నుంచి కెసిఆర్ ఏ రోజు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలను వ్యతిరేకించలేదు. చివరకు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసినప్పుడు కూడా మౌనమే. సరికదా నోట్ల రద్దు , జీ యస్ టి , రాష్ట్రాల పై పెత్తనం చేయడం లాంటి విషయంలో కేంద్రాన్ని బలపరచారు. బీజేపీ పాలనను పశ్నించకుండా బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం అవసరం ఉన్నదా ? ఏవిధంగా చూసినా కెసిఆర్ జాతీయ రాజకీయాలు కేవలం తన రాజకీయ అవసరాల కోసం తప్ప దేశం కోసం ఏ మాత్రం కాదు.

కేసీఆర్ ద్విముఖ వ్యూహంలో భాగమే జగన్ తో  ఫెడరల్ రాజకీయం…..

జగన్ మోహన్ రెడ్డి ని ఫెడరల్ ప్రంట్లో కి లాగే ప్రయత్నం కూడా తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనం ప్రధానంగా కనిపిస్తున్నది.

1. కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ కోసం నవీన్ , మమత , స్టాలిన్ లాంటి వారితో కలిసినా ప్రయోజనం కలగలేదు. కారణం కేసీఆర్ కున్న రాజకీయ పరిస్థితులు వారి రాష్ట్రలలో లేవు. అంతే కాదు కేసీఆర్ రాజకీయ అవసరాలకు ఉపయోగపడే అమాయకులు కూడా కాదు వారు. అదే సమయంలో బీజేపీ కి వ్యతిరేకంగా జాతీయ స్తాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు నష్టం చేసే ప్రయత్నం మోదీ కేసీఆర్ తో చేస్తున్నారు అన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో తాను ఏర్పాటు చేసే కూటమిలో ఎవరూ కలవని స్థితిలో మరోపార్టీ ని కలపడం అవసరం ఎంతైనా ఉంది.

2. జగన్ తో కలవడం వలన తెలంగాణ లో పెద్ద సంఖ్యలో ఉన్న వై యస్ అభిమానులను తన వైపు తిప్పుకోవచ్చు ఎలాగో టీడీపీ తో కాంగ్రెస్ చెలిమి చేయడం , జగన్ 2019 లో కూడ తెలంగాణ లో పోటీ చేయడు కనుక ఆ ఓట్లు తనకు వస్తాయి. నిన్నటి ఎన్నికల్లో కూడా ఆమేరకు ప్రయోజనం కలిగింది అలా బహుముఖ ప్రయోజనం కలుగుతుంది కనుకనే జగన్ ను ఫెడరల్ ప్రంట్ లోకి లాగే ప్రయత్నం.

అధికార పార్టీ వ్యూహాలకు విపక్ష ఎత్తుగడలు బలం చేకూర్చ రాదు

అధికార పార్టీ రాజకీయ వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీ దీటైన ప్రతి వ్యూహం రచించాలి. లేకపోయినా సహకరించే విధంగా ఉండకూడదు. జగన్ కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించకపోయినా అటు వైపు మొగ్గు చూపుతున్నారు అన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో బాబు లాంటి అనుభవం ఉన్న నేత కావాలని ప్రజల ఆలోచనతో బాటు కేంద్రం సాయం లేకుండా రాష్ట్ర మనుగడ సాధ్యం కాదు అన్న బలహీనమైన ఆలోచనలు కూడా బాబు గెలుపుకు దోహదం చేసింది. నేడు కూడా హోదా లేకపోతే మనుగడ లేదు అన్న సెంటిమెంట్ ను అధికార , ప్రతిపక్ష పార్టీలు పోటీపడి ప్రజల్లో పదిలంగా ఉంచిన పరిస్థితుల్లో జరగనున్న 2019 ఎన్నికల్లో కూడా సెంటిమెంట్ రాజకీయాలకు అవకాశం లేకపోలేదు. బాబు ప్రజా వ్యతిరేక విధానాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే వైసిపి కి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అలా కాక జాతీయ రాజకీయాలు ప్రాతిపదికన జరిగితే అధికార పార్టీకి అనుకూలంగా వుండే అవకాశం ఉంది. గడిచిన కొన్నినెలలుగా బాబు ఎక్కడా తన పాలన , రెండు కళ్ళ సిద్దాంతం గురించి ఏమాత్రం మాట్లాడటం లేదు జాతీయ రాజకీయాలను మాత్రమే మాట్లాడుతున్నారు. 2019 లో జాతీయ ప్రభుత్వం బిజెపి , లేదా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఖాయం. బాబు కాంగ్రెస్ తో వెళ్లడం కూడా జరిగిపోయింది. జగన్ కు ఆ అవకాశం లేదు. ఎవరు హోదా ఇస్తే వారికి మా మద్దతు అన్న ప్రకటన ప్రజల విశ్వాసం పొందింది. కేసీఆర్ చెపుతున్న ఫెడరల్ ప్రంట్ కి ప్రాతిపదిక లేదు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ప్రత్యెక పరిస్థితిలో వారి ప్రయోజనం కోసం తనకు తాను ఏర్పాటు చేసుకున్న కుటామి లో ఎటువంటి పరిస్థితులలో భాగస్వామ్యం అయినా అది బాబు చేస్తున్న సెంటిమెంట్ రాజకీయాలకు బలం చేకూర్చే అవకాశం ఉంది.

జగన్ పునాదులు బిజెపి అనుకూల రాజకీయాలకు పనికిరావు

ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని సామాజిక వర్గాలు పునదులుగా ఉంటాయి. ఏపీలో వైసిపి కి ఉన్న పునాది వర్గాల మూలాలు కాంగ్రెస్ లోనివి. వారు కాంగ్రెస్ కు దూరం అయినది వై యస్ మరణం అనంతరం వారి కుటుంబంతో వ్యవహరించిన తీరు దాని కారణంగా జగన్ పార్టీ పెట్టడం మినహా మరో కారణం కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు బిజెపి కి అనుకూలంగా ఉండరు. నేడు కేసీఆర్ నడుపుతున్న రాజకీయాలు బీజేపీ కి అనుకూలంగా ఉందని ఎవరిని అడిగినా చెపుతారు. ఎటువంటి ప్రాతిపదిక లేని , బీజేపీ అనుకూలం అన్న అనుమానం ఉన్న ఫెడరల్ ప్రంట్లో కి జగన్ వెళ్లడం అంటే కచ్చితంగా అది బాబు వ్యూహాలకు జగన్ ప్రయత్నాలు బలం చేకూర్చినట్లే.

కేసీఆర్ తో స్నేహం జగన్ కు నష్టం….

గత కొన్ని రోజులుగా బాబు జగన్ ను ఒకటే డిమాండు చేస్తున్నారు. ముసుగులో రాజకీయాలు దేనికి మోదీ , కేసీఆర్ , జగన్ ముగ్గురూ కలిసి పోటీచేయండి అని. దానికి కారణం లేక పోలేదు రాష్ట్రానికి మోదీ అన్యాయం చేసారు , కేసీఆర్ విభజనకు కారణం కాబట్టి వారి పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంటుంది. వారితో జగన్ కలిసారు అని ప్రచారం చేయడం తనకు లాభం అన్న అంచనా బాబుది. తెలివైన వారు అందుకు ఉపయోగపడే రాజకీయాలు చేయరు. కానీ జగన్ తనకు ఏమాత్రం ప్రయోజనం లేని కేసీఆర్ కూటమి వైపు అడుగులు ఓ బలహీనమైన రాజకీయ ఎత్తుగడ. అంతే కాదు వెనుక బడిన సీమ ప్రాజెక్టుల పట్ల కేసీఆర్ విషం చిమ్ముతున్నారు. జగన్ కు రాజకీయంగా అనుకూలమైన రాయలసీమ లో కేసీఆర్ తో స్నేహం అన్న ప్రచారం ఏవిధముగా చూసినా నష్టమే.

స్వతంత్రంగా ఉండడమే జగన్ కు మేలు

జగన్ కు రాజకీయ ప్రత్యర్ది బాబు . వారి రాజకీయ వ్యూహాలకు ప్రతిగా జగన్ వ్యూహం ఉండాలే తప్ప సాయపడే రీతిన ఉండరాదు. రాజకీయాలలో ప్రతి పార్టీకి విలువలు ఎంత ముఖ్యమో ఆపార్టీ నడకను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అన్నది అంతకన్నా ముఖ్యము. బాబు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం , సుదీర్ఘ పాదయాత్ర వలన జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. బీజేపీతో చివరి వరకు స్నేహం చేసి ఎన్నికల సమయంలో బయటికి వచ్చి పోరాటం చేయడం వలన ప్రజలలో బాబుకు ఆదరణ రావడం లేదు. ఇలాంటి అనుకూల వాతావరణంలో స్వతంత్రంగా ఉండి. విభజన చట్టంలోని అంశాలను అమలు చేసే పార్టీలకు మా మద్దతు అన్న వైకరితోనే ఉంటే జగన్ కు లాభం. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం పాలన వైఫల్యాలను కేంద్రంగా చేసుకుని ఎన్నికలకు వెళితే జగన్ కు అనుకూల వాతావరణం ఉంటుంది. అలా కాక తాను బీజేపీ , కాంగ్రేస్ తో చెలిమి చేయడానికి అనుకూల వాతావరణం లేని ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ అవసరాల కోసం ఏర్పడిన కూటమి వైపు మొగ్గు చూపితే మాత్రం రాజకీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ఉపయోగపడి తాను ప్రతికూల పరిస్థితులను కొనితెచ్చుకున్న నేతగా మిగిలిపోతారు.

( పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్)