ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ఏఐ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న గ్రోక్ ఏఐ మోడల్‌ను మరింత మెరుగుపరిచిన గ్రోక్3ను విడుదల చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచి ఇది అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఏఐ చాట్‌బాట్ల పోటీ రోజురోజుకు ఉత్కంఠ రేకెత్తిస్తున్న నేపథ్యంలో, గ్రోక్3 రాక టెక్ ప్రపంచాన్ని మరింత ఆసక్తిగా మార్చింది.
ఏఐ రంగంలో ఇప్పటికే గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ, చైనా డీప్ సీక్, మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్ల మధ్య పోటీ కొనసాగుతోంది. మస్క్ సొంత టెక్నాలజీ కంపెనీ ఎక్స్ఏఐ, తన ప్రత్యేకతను చాటుకునేందుకు గ్రోక్3ను మరింత అధునాతనంగా రూపొందించినట్లు సమాచారం. ఈ మోడల్‌లో టెక్స్ట్ టు వీడియో ఫీచర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అంటే వినియోగదారులు గ్రోక్3ని ఉపయోగించి వివిధ టెక్స్ట్‌లను వీడియోలుగా మార్చుకునే అవకాశం పొందనున్నారు.
గ్రోక్3 గురించి మస్క్ స్వయంగా స్పందిస్తూ, “భూమ్మీద ఇంతటి తెలివైన ఏఐ చాట్‌బాట్ మరొకటి లేదు” అని కితాబిచ్చారు. ఏఐ విప్లవం మరింత వేగంగా ముందుకు సాగుతున్నదని, ఈ రంగంలో తమ సంస్థ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఎక్స్ఏఐ మార్కెట్‌లో తనదైన ముద్రవేసినట్లు, ఇప్పుడు గ్రోక్3తో మరింత ఆధిక్యత సాధించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న ఈ సమయంలో, గ్రోక్3 ఎంతవరకు వినియోగదారుల ఆకర్షణ పొందుతుందో చూడాలి. మస్క్ ఈ కొత్త మోడల్‌తో గ్లోబల్ ఏఐ రేసులో తన ప్రభావాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పోటీని దాటి, గ్రోక్3 ఏ స్థాయికి చేరుకుంటుందో వేచి చూడాలి!