ఒకప్పుడు వాచ్ కేవలం సమయాన్ని చెబుదామనే ఉద్దేశంతోనే కాకుండా.. ఒక ప్రతిష్ఠా చిహ్నంగా కూడా ఉండేది. ఇప్పుడు రకరకాల వాచ్‌లు అంటే డిజిటల్, అనలాగ్, స్మార్ట్ వాచ్‌లు.. ఇలా ఎన్నో మన జీవితానికి భాగమైపోయాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు వాచ్‌లను స్టైల్, అవసరం కోసం ధరిస్తున్నారు. కానీ ఈ రోజు మనం కుడి చేతికి పెట్టుకునే గడియారం పుట్టుక వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది అనే విషయం మీకు తెలుసా.. ఈ కథనంలో దాని గురించి తెలుసుకుందాం.
మనం ఇప్పుడు వాడే వాచుల పుట్టుక 500 ఏళ్ల కిందటే మనం రోజూ ఉపయోగించే వాచ్ పుట్టింది. 1505లో జర్మనీలోని న్యూరెంబర్గ్ అనే నగరంలో పీటర్ హీన్లీన్ అనే గొప్ప ఆవిష్కర్త ఈ గడియారాన్ని రూపొందించాడు. అప్పట్లో సమయాన్ని చెప్పే సాధనాలు చాలా పెద్దవి.. వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో పీటర్ హీన్లీన్ చరిత్రలోనే మొదటి పోర్టబుల్ వాచ్‌ను రూపొందించాడు. దీనికి ‘పోమాండర్ వాచ్’ లేదా ‘వాచ్ 1505’ అనే పేరు పెట్టారు. ఆ వాచ్ ఆపిల్ ఆకారంలో ఉండేది. బంగారం, రాగి వంటి లోహాలతో నిర్మించి అందంగా డిజైన్ చేశారు.
పీటర్ హీన్లీన్ సృష్టించిన ఈ వాచ్ కేవలం సమయాన్ని చూపే సాధనం మాత్రమే కాదు. అది ఆ రోజులలో గణనీయమైన ఇంజనీరింగ్ కౌశలానికి ప్రతీక. చరిత్రకారుల చెబుతున్నట్టు, ఈ వాచ్ అతని వ్యక్తి గతంగా వాడుకునే గడియారమే. కానీ దీని కథ ఇక్కడితో ఆగిపోలేదు. 1987లో లండన్‌కు చెందిన ఓ యువ వాచ్ తయారీదారు ఈ వాచ్‌ను అప్పట్లో కేవలం 10 పౌండ్లకే కొనుగోలు చేశాడు. అంటే దాదాపు రూ.950 మాత్రమే! వేరే ఒక్కరికి తక్కువ ధరకే మళ్లీ అమ్మేశాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఒక పరిశోధకుడు ఈ వాచ్‌ను పరిశీలించి దీని వెనుక ఉన్న అసలు చరిత్రను వెలికితీశాడు. లోపలి భాగాలు, సంతకాలు అన్నీ పరిశీలించగా — నిజంగానే ఇది పీటర్ హీన్లీన్ 1505లో తయారు చేసిన వాచ్ అని తేలింది.
ప్రపంచంలో అత్యంత విలువైన గడియారాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పటి విలువ సుమారు 50 మిలియన్ డాలర్లు నుంచి 80 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మన రూపాయలలో దాదాపు రూ.481 కోట్లు నుంచి రూ.611 కోట్లు వరకు! ఈ అంచనా 2014లో ‘అమెరికన్ యాంటిక్ వీక్’ అనే ప్రఖ్యాత పత్రికలో ప్రచురించబడింది. ఈ చిన్న గడియారం చెప్పే గొప్ప సందేశం ఏంటంటే చిన్న వస్తువుల్లోనూ గొప్ప చరిత్ర దాగి ఉంటుంది. వాటి విలువను గుర్తించి, మరింత గౌరవించడం మన బాధ్యత. ఈరోజు మనం చేతికి వేసుకునే వాచ్ వెనక ఇదో అందమైన చరిత్ర.
