రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అఫ్సానా అనే 25 ఏళ్ల యువతి ఆరు నెలల కాలంలో ఎనిమిది సార్లు పాము కాటు బారిన పడి కూడా ప్రాణాలతో బయటపడింది. సాధారణంగా ఒకసారి పాము కాటు వేసినా పరిస్థితి విషమమైపోతుంది. కానీ వరుసగా ఎనిమిది సార్లు విషపూరిత పాము కాటు తట్టుకుని బతికిపోవడం ఒక అద్భుతంగా మారింది.
మొదటిసారి మార్చి 20న అఫ్సానాకు పాము కాటు వేసింది. దాని తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో మళ్లీ మళ్లీ కాటు తప్పలేదు. చివరిసారి సెప్టెంబర్ 7న ఆమె ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా ఎనిమిదోసారి పాము కాటు వేసింది. పొరుగువారి సహాయంతో ఆసుపత్రికి తరలించినా, ఈసారికీ ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ వరుస సంఘటనలు గ్రామస్తులను గందరగోళంలో ముంచేశాయి.
ఇదీ చదవండి: ఉదయం లేవగానే కాఫీ తాగాలా.. టీ తాగాలా..? వైద్యుల సలహా ఇదే..?
డాక్టర్లను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ కేసు, వైద్యపరంగాను అధ్యయనానికి కారణమైంది. సాధారణంగా ఒకే జాతి పాము పదేపదే కాటేస్తే, శరీరంలో ఆ విషాన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అఫ్సానా శరీరంలో అలాంటి రోగనిరోధక శక్తి పెరిగి ఉండవచ్చని వైద్యులు విశ్లేషిస్తున్నారు. దీంతో విష ప్రభావం తీవ్రంగా ఉన్నా, ఆమె బతికే అవకాశం లభించిందని అంటున్నారు.
ఈ వింత సంఘటనకు గల కారణాలపై గ్రామస్థులు ఊహాగానాలు చేస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న పొదలు, శిథిలాలు ఉండటంతో పాములు ఎక్కువగా వస్తున్నాయిని కొందరు అంటుంటే.. పర్యావరణమే కారణమని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా పాములు వరుసగా ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 54 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. వీరిలో లక్ష దాకా ప్రాణాలు కోల్పోతారు. భారత్‌లోనే ఏటా 58 వేలమంది పాము కాటు వల్ల మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్సానా ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని అందరూ భావిస్తున్నారు.
