ఎన్నికల కమీషన్, ప్రభుత్వం మధ్యన రగులుతున్న రావణకాష్టం అలాగే కొనసాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాను పదవిలో ఉండే ఈ రెండు నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టడమే లక్ష్యంగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు అని విశ్లేషకుల అభిప్రాయం. అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు మొదటినుంచి న్యాయస్థానాల్లో నిమ్మగడ్డకే విజయం దక్కింది. ఆయన ఆధిపత్యాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించి ఎన్నికలకు తలఒగ్గినది. ఇక అక్కడితో అయినా ఆయన వివాదాలకు దూరంగా ఉంటూ ఎన్నికలకు సజావుగా నిర్వహిస్తే బాగుండేది. కానీ అలా చెయ్యకుండా చీటికీమాటికీ ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వడం మొదలు పెట్టారు. దానిలో భాగంగానే నిన్న ఆయన ఆవిష్కరించిన ఈ వాచ్ అనే ఒక యాప్.
ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధిచిన యాప్ ఉన్నది. అది కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన మరొక యాప్ ఉన్నది. ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క యాప్ ను వినియోగించవచ్చు. అలా కాకుండా తాను సొంతంగా ఒక యాప్ ను తయారుచేశామని నిమ్మగడ్డ ప్రకటించడం పలుసందేహాలకు తావిస్తున్నది. ఈ యాప్ మీద ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఒక యాప్ ను తయారు చేసేంత పరిజ్ఞానం ఎన్నికల కమీషన్ దగ్గర లేదని ప్రభుత్వం వాదన. కానీ ఈ యాప్ ను రిలయన్స్ వారు తయారు చేశారని నిమ్మగడ్డ నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ యాప్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని రిలయన్స్ వారు చెబుతున్నారు. మొత్తానికి ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చెయ్యడానికి నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారనేది నిస్సందేహం.
అలాగే మొన్న ఒక టిడిపి కార్యకర్త, సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్లి పరమార్శించడం, నిందితులను వదిలిపెట్టం అని రాజకీయనాయకుడిలా ప్రకటించడం చూస్తుంటే ఆయన ఎవరి చేతిలోనే కీలుబొమ్మలా ప్రవర్తిస్తున్నారనిపిస్తుంది. ఒక పార్టీ కార్యకర్త మరణిస్తే ఆ పార్టీ నాయకులు వెళ్లడం, పరామర్శించడం సాధారణం. కానీ ఎన్నికల కమీషనర్ హోదాలో నిమ్మగడ్డ వెళ్లి సానుభూతి తెలపడం అంటే ఆయన పార్టీ తరపున పనిచేస్తున్నారని అనుమానిస్తే తప్పేముంది?
ఏకగ్రీవాల విషయంలో కూడా వీలైనంతవరకు కాకుండా చూడటమే నిమ్మగడ్డ అభిమతంగా కనిపిస్తున్నది. ఎందుకంటే పల్లెల్లో ప్రస్తుత వాతావరణం వైసిపికి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పేదవర్గాలవారు పూర్తి సంతృప్తులై ఉన్నారు. ఇంకా వైసిపికి మూడేళ్ళ అధికారం ఉన్నది కాబట్టి సహజంగా వారు వైసిపికి అనుకూలంగానే ఉంటారు. ఆ పరిస్థితుల్లో పోటీలు పెట్టుకుని పల్లెల్లో చిచ్చు రగుల్చుకోవాలని ఎవ్వరూ అనుకోరు. కనీసం పాతికవంతైనా ఏకగ్రీవాలు అవుతుంటాయి. ఆ అంశాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని చంద్రబాబు నిమ్మగడ్డ ద్వారా ఏకగ్రీవాలు కాకుండా చూస్తున్నారని, పల్లెల్లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి శాంతిభద్రతల సమస్యను రేకెత్తించాలని ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడి కుతంత్రాలకు, కుట్రలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పావుగా మారి తన పదవికి కళంకం తీసుకుని రావడానికి బాటలు వేసుకోవడం విషాదకరం. పల్లెల్లో ఎలాంటి కొట్లాటలు, ఘర్షణలు జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగినా అందుకు నిమ్మగడ్డ కూడా కారణం అవుతారు. నిమ్మగడ్డ నేతృత్వంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ఎవ్వరికీ నమ్మకం కుదరడం లేదు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు