2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి, చేసిన 135 (ప్లస్ అర్ మైనస్) స్థానాల్లో 120 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుని, సాక్షాత్తూ అధ్యక్షుడే గెలుస్తానో గెలవనో అనే భయంతో రెండు చోట్ల పోటీ చేస్తే, రెండు చోట్లా దారుణంగా పరాభవించబడి, సినిమా గ్లామర్ అనేది వెండితెర వరకే తప్ప రాజకీయ రణక్షేత్రంలో కాదని ప్రజలతో చెప్పించుకుని, ఏమాత్రం విశ్వసనీయత లేనివాడిగా ముద్ర వేయించుకుని, పాకేజీ రాయుడుగా అపఖ్యాతి పాలై మళ్ళీ సినిమాలే దిక్కని ఎంచి తన దుకాణాన్ని సగం మూసేసి ప్రజలనుంచి పరారై, ఏదో షాట్ గ్యాప్ లో అభిమానులతో ముచ్చటించే సినిమా నటుల్లా, ఒక షెడ్యూల్ అయిపోగానే ఏదో ఒక గ్రామాన్ని దర్శించడం, అక్కడ నాలుగు పిచ్చిమాటలు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతూ, విశ్వసనీయత అనేదాన్ని పూర్తిగా పోగొట్టుకున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా బతకడానికి మరొక మహత్తర అవకాశాన్ని కేంద్రప్రభుత్వం కల్పించింది!
అవును….విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ దిశగా కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆంధ్రుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. ప్రభుత్వరంగంలో ఉన్న ఏకైక అతి పెద్ద సంస్థ విశాఖ స్టీల్. అలాంటి కర్మాగారాన్ని ప్రయివేట్ వారికి అప్పగించడం పట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడుతున్నారు. ఆయన ఒక ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే ప్రశ్నించడానికే జన్మించమని గుండెలు బాదుకునే పవన్ కళ్యాణ్ తక్షణమే బీజేపీతో తెగతెంపులు చేసుకుని కేంద్రాన్ని ప్రశ్నించాలి. అవసరమైతే అయిదు కోట్ల ఆంధ్రులను ఏకం చేసి ఒక ఊపు ఉపాలి. మోదీని నిలదీయాలి. ఆ శక్తి ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉన్నది. విశాఖ ఉక్కు అనేది అమరావతి లా ఏదో నాలుగైదు గ్రామాలకు మాత్రమే పరిమితమైన సెంటిమెంట్ కాదు. అయిదు కోట్ల ఆంధ్రులకు సంభందించిన విలువైన ఆస్తి. దాన్ని కాపాడుకోవాలి.
కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించగానే తమ అధినేత ఆగ్రహోదగ్రుడై కదనరంగంలోకి దూకేస్తారని కొందరు అభిమానులు భావించారు. పిడికిలి బిగించి “ఏయ్..నరే మోదీ…మా జోలికి వచ్చావంటే ఖబడ్డార్…విశాఖ ఉక్కును అంగుళం కూడా కదల్చలేవు..జాగ్రత్త…” అని హెచ్చరిస్తారేమో అని కలలు కన్నారు….పవన్ ఒక్క ప్రశ్న వేస్తే కేంద్రం గజగజలాడుతూ ఆ ప్రతిపాదనను డ్రాప్ చేసుకుంటుందని తలచారు. కానీ, ఏదీ…రోజులు గడుస్తున్నా, చంద్రబాబు నుంచి ప్రకటనలు వస్తున్నా…పవన్ కళ్యాణ్ నుంచి పిల్లికూతలు కూడా రావడం లేదు! చీటికిమాటికి జగన్ మీద మండిపడుతూ ట్వీట్లు పెడుతూ హెచ్చరికలు జారీ చేసే పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు విషయంలో మాత్రం మూలుగుతూ ముక్కుతూ తన భాగస్వామి నాదెండ్ల మనోహర్ పేరుతో ఒక చిన్న ప్రకటనను ఎవరికీ వినిపించకుండా వదిలాడు!
బీజేపీతో ఉన్న బంధం కారణంగా పవన్ కళ్యాణ్ కేంద్రానికి వ్యతిరేకంగా నాలుకను ఆడించలేకపోతున్నారు. విశాఖలో జనసేనకు అంతో ఇంతో పలుకుబడి ఉన్నది. మొన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీకి కాస్తో కూస్తో ఓట్లు దక్కిన జిల్లా అదే. మరి అలాంటి చోట విశాఖ ఉక్కుకు కేంద్రం మంగళం పాడాలని చూస్తుంటే ప్రజల తరపున నిలబడి మాటమాత్రంగా అయినా ప్రతిఘటిద్దామనే ఆలోచన కూడా జనసేనాని రాకపోవడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేట్ పరం చేస్తే బీజేపీకి రాజకీయంగా నష్టం కలుగుతుందని స్థానిక బీజేపీ నాయకులు కూడా భయపడుతున్నారు. అయితే కేంద్రం ఇలాంటి నసుగుళ్ళను ఏమాత్రం సరకు చేయదని అందరికి తెలుసు. ఇంకా బీజేపీతో అంటకాగుతూ, ప్రజల అభిమానాన్ని పోగొట్టుకుంటే (ఇప్పుడు ఉందా అని ప్రశ్నించవద్దు) భవిష్యత్తు శూన్యం అని జనసేనలో మిగిలున్న ఒకరిద్దరు నాయకులు ఆందోళన చెందుతున్నారు.
మొత్తానికి చూస్తుంటే పవన్ కళ్యాణ్ పోరాటమంతా సినిమాల్లోనే తప్ప నిజజీవితంలో ఆ ఆరాటమే లేదని అందరికీ అర్ధం అవుతున్నది. అక్క ఆరాటమే కానీ బావ బతకడు అని సామెత చెప్పినట్లు అభిమానుల ఆత్రమే తప్ప అసలు చోట సరుకేదీ?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు