ప్రతి ఏడాది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెండు పీడకలలు వస్తుంటాయి. ఆయన పాలిటి దుర్దినాలు అవి. ఆయనకు ఏమాత్రం వీలైనా ఆ రెండు తేదీలను కాలెండర్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసేవాడు. జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ వర్ధంతి. మే ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ జయంతి. ఎవరినైతే వెన్నుపోటు పొడిచి అధికారలక్ష్మిని ఆయన నుంచి బలవంతంగా గుంజేసుకుని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసి అంత ధైర్యశాలి గుండె బద్దలు కావడానికి కారకుడయ్యాడో, ఆయన్నే స్మరించుకోక తప్పని స్థితి! పనిలో పనిగా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని పెద్ద గొంతుకతో బల్లగుద్ది చెప్పాల్సిన తప్పనిసరి తద్దినం!
అంగట్లో అన్నీ ఉన్నా….
ఎన్టీఆర్ కు భారతరత్న ఎవరు ఇవ్వాలి? ఎన్టీఆర్ సాటివాడైన ఎంజీఆర్ కు ఎవరు ఇచ్చారు? కేంద్రప్రభుత్వమే ఆ పని చెయ్యాలి. కేంద్రం ఒత్తి పుణ్యానికి ఆ పని ఎందుకు చేస్తుంది? దానికి గట్టి లాబీయింగ్ ఉండాలి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని రావాలి. కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి. కేంద్రానికి మన అవసరం ఉండాలి. కేంద్రంలో మనం బలమైన శక్తిగా ఉండాలి. అధికారంలో భాగస్వామ్యం కలిగి ఉండాలి. అలాంటి అవకాశాలు ఎన్టీఆర్ కుటుంబానికి రాలేదా మరి? ఆ అవకాశాన్ని వారు ఎందుకు వినియోగించుకోలేకపోయారు?
పదేళ్లు కేంద్రంలో చక్రం తిప్పినా….
1995 నుంచి 2004 వరకు కేంద్రంలో చంద్రబాబు చక్రాన్ని గిరగిరా తిప్పారు. “ప్రధానులను డిసైడ్ చేశాను. రాష్ట్రపతులను డిసైడ్ చేశాను. గవర్నర్లను డిసైడ్ చేశాను. అంబెడ్కర్ కు భారతరత్న ఇప్పించాను” అని ఈనాటికీ స్వోత్కర్షలు చేసుకునే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు భారతరత్నను ఎందుకు డిసైడ్ చెయ్యలేకపోయాడు? రాష్ట్రం విడిపోయాక తొలి అయిదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి నాలుగేళ్లు కేంద్రంతో మైత్రి ఉన్నది. అధికారంలో భాగస్వామ్యం ఉన్నది. మరి మామగారికి భారతరత్నను ఇప్పించడానికి చంద్రబాబు కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదు దేనికి?
పురందేశ్వరి ఎందుకు కృషి చెయ్యలేదు?
2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలంలో తొమ్మిదేళ్లపాటు ఎన్టీఆర్ పెద్ద కుమార్తె శ్రీమతి పురందేశ్వరి అత్యంత కీలకమైన మానవవనరుల శాఖకు మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీల అభిమానాన్ని చూరగొన్నారు. ఆమెకున్న భాషానైపుణ్యంతో అంతర్జాతీయంగా కూడా వన్నెకెక్కి కేంద్ర కేబినెట్ లో ప్రత్యేక మన్ననలను పొందారు. ఆమె తలచుకున్నా ఏదో ఒక సంవత్సరంలో ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోయేది కాదు. అంటే ఎన్టీఆర్ మరణించాక సుమారు ఇరవై సంవత్సరాలపాటు ఎన్టీఆర్ కూతురు, అల్లుడు శక్తివంతమైన పదవుల్లో ప్రభావశీలురుగా రాణించారు. మళ్ళీ గత నాలుగైదేళ్లుగా పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆమెకు జాతీయస్థాయి పదవిని కట్టబెట్టి బీజేపీ నాయకత్వం గౌరవించింది. ఎపి రాజకీయాల్లో అమె ఇప్పుడు కీలకపాత్రను పోషిస్తున్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడం విచిత్రమే కదా?
లక్ష్మీపార్వతే అందరికి బూచి
కారణాలు తెలుసుకోవడం కష్టమేమీ కాదు. చంద్రబాబుకు లేకపోయినా ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టిన పురందేశ్వరికి ఇష్టంగానే ఉంటుంది. కానీ, ఆ అవార్డును ప్రకటిస్తే దాన్ని అందుకోవాల్సిన వారసులు ఎవరు? ఇంకెవరు?? ఎన్టీఆర్ కళత్రం శ్రీమతి లక్ష్మీపార్వతి. దివంగత నాయకుడి భార్య జీవించి ఉండగా మరొకరు ఆ అవార్డును అందుకోవడానికి అనుమతించరు. ఎన్టీఆర్ కు భారతరత్న ఎప్పుడు ప్రకటించినా లక్ష్మీపార్వతి జీవించి ఉన్నంతకాలం ఆమే అందుకుంటారు తప్ప చంద్రబాబునో, పురందేశ్వరినో తన తరపున స్వీకరించడానికి అంగీకరించరు. లక్ష్మీపార్వతి పేరు ఎత్తితేనే భగ్గున మండే చంద్రబాబు, లేదా ఎన్టీఆర్ కుటుంబం అందుకు అంగీకరిస్తారా? ఆ ప్రసక్తే లేదు! అందుకే ఎన్టీఆర్ కు ఇంతవరకు భారతరత్న రాలేదు. రాదు కూడా.
జగన్మోహన్ రెడ్డి ఇప్పించాలా?
అయితే చాలాకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు లక్ష్మీపార్వతి జగన్మోహన్ రెడ్డిని కలిసినపుడు ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేవిధంగా కృషి చెయ్యాలని కోరినట్లు, తగిన సమయం వచ్చినపుడు ప్రయత్నిస్తాను అని జగన్ హామీ ఇచ్చారని విన్నాను. దానిలో వాస్తవం ఎంతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఎన్టీఆర్ అంటే అభిమానమే. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని బహిరంగంగా ప్రకటించారు కూడా. అయినప్పటికీ కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకుంటుంది? జగన్ చెయ్యాలని కోరుకోవడం దురాశ కాదూ?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు