రాష్ట్రంలో పాలక వర్గం, ప్రతిపక్షం ఉన్నప్పుడు రెంటి మధ్యా పోలిక ఉండటం చాలా కామన్. ఎవరి పాలన ఎలా ఉంది, ఏ లీడర్ నిర్ణయాలు గొప్పగా ఉన్నాయి, ఎవరి పాలనలో పారదర్శకత ఉంది , ఎవరి అవినీతిని అంతమొందించడంలో నిజాయితీగా వ్యవహరించారు, ఎన్నికల హామీలను ఎక్కువ శాతం అమలుచేసింది ఎవరు లాంటి ముఖ్యమైన విషయాల్లో కంపారిజన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎన్నికల్లో కొత్త తీర్పును ఇచ్చినప్పుడు తమ తీర్పు మంచిదా చెడ్డదా, ఏమైనా ప్రయోజనం ఉందా అని ఓటు వేసిన ప్రజలే పోలికలు చూసుకుంటారు. ఇక నాయకుల సంగతైతే చెప్పనక్కర్లేదు. తమ ప్రతి పనిని గొప్పగా చెప్పుకుంటూ ప్రత్యర్థుల కంటే తామే సమర్థులమని ప్రచారం చేసుకుటుంటారు. ప్రచారం చేసుకోవడంలో తప్పేం లేదు. చేసిన మంచి పనులను చెప్పుకోవచ్చు. అలాగే నిజాలను నిర్భయంగా ఒప్పుకునే దమ్ము కూడ ఉండాలి. అప్పుడే నాయకులు, పార్టీల అసలు తత్వం ఏంటో బయటపడుతుంది.
ప్రతి చిన్న దానికీ పోటీ:
రాష్ట్రంలో ఏ చిన్న మంచి జరిగినా, రాష్ట్రం అభివృద్దిలో ఏ చిన్న పెరుగుదల కనిపించినా ఆ క్రెడిట్ మాదంటే మాదేనని కొట్టేసుకుంటున్నారు అధికార, ప్రతిపక్షాలు. తాజాగా రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019లో ఈ ర్యాంక్ ఏపీకి దక్కింది. పారదర్శకత కోసం సమాచార లభ్యత, కార్మిక నిబంధనలు, నిర్మాణ అనుమతులు, ఏకగవాక్ష విధానం, రంగాల వారీగా ప్రత్యేకత, తనిఖీ విభాగాలు, పన్ను చెల్లింపులు, పర్యావరణ రిజిస్ట్రేషన్లు, యుటిలిటీ అనుమతులు పొందడం, భూపరిపాలన, ఆస్తి బదిలీ, కాంట్రాక్టుల అమలు, భూ లభ్యత, కేటాయింపుల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు.
2019 మార్చి నెల ముందు వరకు తీసిన లెక్కల ప్రకారం ఈ ర్యాంక్ కేటాయించబడింది. 2019 మార్చి అంటే అప్పుడు చంద్రబాబు పాలన ఉండేది కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. 2019 మాత్రమే కాదు గత రెండు సంవత్సరాల్లో కూడ ఏపీకే ప్రథమ స్థానం దక్కింది. అప్పుడు కూడ ఉన్నది బాబు ప్రభుత్వమే కాబట్టి ఆయన చేసిన సంస్కరణల వలనే ఈ ఘనతని, జగన్ పాలనలో లెక్కలు తీసి ఉంటే పదో స్థానంలో ఉండేవారమని టీడీపీ నేతలు బల్లగుద్ది చెబుతుండగా వైకాపా శ్రేణులు అందంతా కుదరదు ముఖ్యమంత్రి జగన్ కాబట్టి క్రెడిట్ ఆయనకే. ఆయన ఏడాదిన్నర పాలన చూసి ముచ్చటపడే ఆర్థికశాఖ ఈ ర్యాంక్ ఇచ్చింది. బాబు అంత గొప్ప పాలనే చేసుంటే ఎందుకు చిత్తుచిత్తుగా ఓడారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నిన్నటి నుండి ఇదే తంతు.
నిజాలను చెప్పే దమ్ముందా మీకు ?
ఇలా క్రెడిట్ కోసం అదే పనిగా రెండు పార్టీలు కొట్టుకోవడం చూస్తున్న ప్రజలు మంచి జరిగితే ఘనత తీసుకుకోవాలని పాకులాడుతున్న పార్టీలు ఏదైనా వైఫల్యాలు, విపత్తులు ఎదురైతే మాత్రం ఎందుకు ఒకరినొకరు నిందించుకుంటారు. ముందుకొచ్చి భాద్యత ఎందుకు తీసుకోరు అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ల ప్రశ్నలోనూ నిజముంది. ఉదాహరణకు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనే తీసుకుందాం. గ్యాస్ లీక్ నిర్వహణ లోపం వలన జరిగిందనేది సుస్పష్టం. టీడీపీ ఏమో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంటే ఆ ఫ్యాక్టరీకి అనుమతులు టీడీపీ హాయాంలోనే వచ్చాయని ప్రమాదానికి బాధ్యులు వారేనని ప్రతిదాడి చేస్తున్నారు తప్ప బాధ్యత తీసుకుంటాం అంటూ ఎవరూ ముందుకు రాలేదు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి ర్యాంకే వచ్చింది సరే మరి అభివృద్దిలో మనది ఏ చోటు అని పాలకులు, నాయకులు ఎప్పుడైనా ఆలోచించారా. మూడవ ర్యాంక్ పొందిన తెలంగాణ అభిబృద్దిలో మాత్రం ఏపీ కంటే చాలా ముందుంది. ఈ వెనుకబాటుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబైనా, ఇప్పటి సీఎం వైఎస్ జగన్ అయినా సమాధానం చెప్పగలరా. చెప్పరు. మళ్లీ ఆరోపణలు ప్రత్యారోపణలే ఉంటాయి. ఇవన్నీ కాదు రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు కావొస్తోంది కదా ఇప్పటికీ చెప్పుకోవడానికి ఒక రాజధాని లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. మరి అమరావతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు ఆ నగరానికి కనీసం పిన్ కోడ్ ఎందుకు జనరేట్ చేయించుకోలేకపోయారో నిజాయితీగా సమాధానం ఇవ్వగలరా. వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మాణ దశలో ఉన్న అమరావతిని కాదని వికేంద్రీకరణ పేరుతో ఉన్నపళంగా మూడు రాజధానులు అంటున్న వైఎస్ జగన్ ఇంకో రెండేళ్లలో అయినా రాష్ట్రానికి స్థిరమైన రాజధానిని ఏర్పరచగలమనే హామీ ఇవ్వగలరా. తన హయాం ముగిసేలోపు సంక్షేమం కోసం కొత్త అప్పులేమీ చేయమని, ఆదాయం సాధించి వాటినే ప్రజలకు పంచుతామని ధైర్యంగా శపథం చేయగలరా. మరి అలాంటప్పుడు చిన్నా చితకా విషయాల్లో ర్యాంకులు, స్థానాల క్రెడిట్ కొసం కొట్టేసుకుంటారు ఎందుకో.