ఈ మధ్యకాలంలో సామాన్య ప్రజానీకానికి ఏ కష్టాలు లేనట్టు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పార్టీలు కేవలం గుళ్ళ చుట్టూ రాజకీయాలు చేసుకుంటూ ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతర్వేదిలో జరిగిన ఒక ప్రమాదంలో అంతర్వేది గుడి కి సంబంధించిన రథం కాలిపోవడం జరిగింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ కి ఆదేశించడం ఆ విచారణ కొనసాగుతుండగానే ప్రతిపక్షాలు చలో అంతర్వేది అని, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందూ మతం ఈ రాష్ట్రంలో అంతరించిపోతుందని, ఈ ప్రమాదం వెనక నిజాలు వెలికి తీయడానికి సి బి ఐ ఎంక్వయిరీ కావాలని ఒక పెద్ద పోరాటానికి సమాయత్తమైయ్యాయి. ప్రభుత్వం కూడా పట్టుదలకు పోకుండా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కి ప్రతిపక్షాలు అడిగినట్టే సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఈ ఒక్కటే కాదు ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో జరిగిన ప్రమాదాల్ని కూడా ఈ విచారణ కిందికి చేర్చాలని పట్టుబట్టడం జరిగింది.
సరే కాసేపు ఆ డిమాండ్ ని పక్కన పెడదాం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమ తిరుపతి దేవస్థానం. దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఈ సంస్థ ద్వారా ఎంతమంది అభాగ్యులు వైద్యాన్ని, విద్యని, ఆహారాన్ని పొందారో లెక్కలేదు. కానీ ఇవన్నీ చిన్నబోయేటట్టు హిందూ అతివాదుల ఏదైనా ఒక వివాదం రేకిత్తించాలంటే ఆంధ్రప్రదేశ్ లో వారికి మొదట గుర్తుకు వచ్చే పేరు తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మధ్య కాలంలో స్వామి వారి కొండా పైన శిలువని ప్రతిష్టించారని, లేకుంటే తిరుమల బస్సు టిక్కెట్లపైన జెరూసలేం కి సంబంధించిన సమాచారం ముద్రించారని వివాదం చెయ్యడానికి ప్రయతించారు. అవి వీరనుకున్న స్థాయిలో రాజకీయ లబ్ది చేకూర్చలేదు. అయితే తాజాగా ఇప్పుడు తాజాగా తిరుమల డిక్లరేషన్ మీద ఒక వివాదానికి తెరలేపారు.
ఇది చాలా కాలం నుండి నడుస్తున్న వివాదమే. జగన్మోహన్ రెడ్డి తిరుమల సందర్శనకు వచ్చినప్పుడు తాను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు కాబట్టి తాను వెంకటేశ్వర స్వామి మీద భక్తితో నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలని, అది జగన్ మోహన్ రెడ్డి కేవలం ఒక క్రిస్టియన్ కాబట్టి, డిక్లరేషన్ ఇవ్వకుండా దేవుడి దర్శనం కి వెళుతున్నాడు కాబట్టి అతనికి వెంకటేశ్వరస్వామి మీద భక్తి లేదు, అందుచేత వైయస్ జగన్ దర్శనం చేసుకోవడానికి వీలులేదనే విధంగా అతని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు.
అసలు జగన్ మోహన్ రెడ్డి విషయం కాసేపు పక్కన పెడదాం. అసలు ఎవరైనా తిరుమల కి వెళ్తే ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి. ఒక వ్యక్తి అన్ని ప్రయాసలకోర్చి తిరుమలకు చేరి క్యూలో నుంచొని ఎందుకు దర్శనం చేసుకుంటారు. స్వామి వారి మీద భక్తుడు భక్తికి ఒక పేపర్ మీద సంతకం పెట్టినంత మాత్రాన వచ్చే తేడా ఏముంటుంది. అతని నమ్మకాలు, అతని మతం ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం పెట్టకపోవడంతో ముడిపడి లేవు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రముఖులు కాబట్టి, అతను క్రిస్టియన్ మతం పాటిస్తాడు కాబట్టి అతన్ని డిక్లరేషన్ ఇవ్వమని అడగగలరు, కానీ వేల సంఖ్యలో రోజు స్వామివారి దర్శనం చేసుకునే అన్యమతస్థులు చాలా మంది ఉండొచ్చు. వారందరి దగ్గర డిక్లరేషన్ ఎలా తీసుకోగలరు?
ఇప్పుడు వివాదం చేస్తున్న రాజకీయ నాయకులు వారి వారి ఎన్నికల ప్రచారం లో మసీదులకు, చర్చిలకు వెళ్లి ప్రచారం చేస్తుంటారు కదా. మరి ఆ మసీదుల్లో చర్చిల్లో ఈ నాయకులందరూ డిక్లరేషన్ ఇచ్చి వెళుతున్నారా. మాకు ఇస్లాం మీద లేదా క్రైస్తవ మతం మీద నమ్మకం ఉందని చెప్పి లోపలికి వెళ్తున్నారా. అటువంటిది ఏమీలేదు కదా? ఎవరో ఒక వ్యక్తి డిక్లరేషన్ ఇస్తేనో, ఇవ్వకుంటేనో స్వామి వారి ప్రభ తగ్గుతుందా, భక్తులకి ఆయన మీద నమ్మకం తగ్గుతుందా. ఎందుకు ఇటివంటి చిన్న విషయాలకు దేవుడిని ముడిపెట్టి హిందూ మతం ఓనత్యాన్ని తగ్గిస్తారు. హిందూ మతం ఎన్నో పరీక్షలు ఎదుర్కొని కొన్ని వేల సంవత్సరాల నుండి కోట్లమందికి ఒక జీవన విధానమై కొనసాగుతుంది. ఇంకెన్నో వేల సంవత్సరాల తనకు తాను కొనసాగగల గొప్పతనం వుంది. పూటకో పార్టీ మారి,ఆ మార్పుతోపాటే తన అభిప్రయాలను మార్చుకొనే రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు అవసరం లేదు హిందూ మతానికి, ఆ ఏడుకొండలవాడికి.