అమరావతి కథ కంచికి చేరనుందా?

Why not change capital: ap High Court
చంద్రబాబు సృష్టించిన భ్రమరావతిపై అందరికీ భ్రమలు తొలగిపోయాయా? అసెంబ్లీలో అరవై ఏడు స్థానాల బలం కలిగిన ప్రతిపక్షనేతతో కనీసం మాట మాత్రం కూడా సంప్రదించకుండా, విజ్ఞులు, మేధావులు, ఆఖరికి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను  కూడా అహంకారాభిజాత్యాలతో  తృణీకరించి చెత్తబుట్ట దాఖలు చేసి, కేవలం తన సామాజికవర్గం వారు మిక్కుటంగా కలిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యన ఒక కులసామ్రాజ్యాన్ని నిర్మించి, మిగిలిన పదకొండు జిల్లాల ప్రజలకు ప్రవేశం కూడా లేకుండా చేసి, తన అధికారాన్ని ఆచంద్రతారార్కం చేసుకోవాలని కలలు కని చంద్రబాబు నిర్మించుకున్న విశ్వామిత్ర సృష్టి అమరావతికి ఆశలు మూసుకుని పోయినట్లేనా? 
Why not change capital: ap High Court
Why not change capital: ap High Court
 
వర్తమాన  పరిస్థితులను  చూడబోతే  అలాగే  కనిపిస్తున్నాయి.  అభివృద్ధి మొత్తం ఒకేచోట కేంద్రీకృతం అయితే,  మిగిలిన పదకొండు జిల్లాలవారు చెమటోడ్చి కట్టిన పన్నులతో ఒక్క రాజధాని నగరాన్ని మాత్రమే స్వర్గధామం చేసి, మిగిలిన ప్రాంతాలు ఎడారిగా మారిపోయినా డోంట్ కేర్ అన్న నిర్లక్ష్యం ప్రదర్శించిన చంద్రబాబు కుతంత్రానికి జగన్మోహన్ రెడ్డి అధికారపగ్గాలు చేపట్టడంతో చుక్క పడిపోయింది.  నలభై ఏళ్ల అనుభవం ఉన్నదని విర్రవీగే చంద్రబాబును పాదరక్షతో కొట్టినంత పరాభవాగ్నికి గురిచేసింది జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం. అభివృద్ధి వికేంద్రీకరణే సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన మేరకు రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరించే క్రమంలో విశాఖపట్నాన్ని సచివాలయ రాజధానిగా, అమరావతిని శాసనరాజధానిగా, కర్నూలు ను న్యాయరాజధానిగా వికేంద్రీకరించారు. ఈ దెబ్బతో అమరావతిలో కారుచౌకగా భూములను కొట్టేసినవారి గుండెల్లో బండ పడ్డట్లయింది. అయిదారు లక్షల రూపాయలిచ్చి అమాయక రైతులనుంచి కొనుగోలు చేసిన భూములు అయిదారు కోట్లకు అమ్ముకోవచ్చని దురాశకు లోనైనవారి నెత్తిన జగన్ నిర్ణయం అశనిపాతం అయింది.  తమ కళ్ళముందే ముంగిటికి చేరిన లక్ష్మీకటాక్షం రివ్వున వెనక్కు వెళ్లిపోవడంతో మోసగాళ్లు, కబ్జాకోరులు అందరి కాళ్ల క్రింద భూమి కంపించిపోయింది.  ఎలాగైనా జగన్ ప్రయత్నాన్ని విఫలం గావించాలని అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టి వారితో గుడారాలు వేయించి పెయిడ్ ఉద్యమాలకు తెరతీశారు.  ఎవరెవరినో తెచ్చి రైతుల వేషాలు వేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయించారు.  ముఖ్యమంత్రి చచ్చిపోవాలని కూడా శాపనార్ధాలు పెట్టించారు.  సోషల్ మీడియాలో లక్షల రూపాయల జీతాలు ఇచ్చి కొందరిని రిక్రూట్ చేసుకుని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా దూషణలు చేశారు.  
 
ఇక పచ్చమీడియా చెలరేగిపోయింది.  రైతుల ఉద్యమం అంటే అదేదో దేశవ్యాప్తంగా జరుగుతున్న మహోద్యమం అంటూ దుర్మార్గపు వార్తలను వండి వారిస్తూ బీభత్సం సృష్టించారు.  ప్రతిరోజూ ఇరవైనాలుగు గంటలూ ఉద్యమ వార్తలు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తూ, ఆ సమీప గ్రామాల్లో ఎవరు వృద్ధాప్యంతో మరణించినా, అది ఉద్యమకారుల మరణం అంటూ తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారు.  ఇక చంద్రబాబు ఉచ్ఛిష్టపు రుచిని మరిగిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్, జనసేన, బీజేపీ నాయకులు కొందరిని షామియానాల దగ్గర కూర్చోబెట్టి డ్రామాలు ఆడించారు.  
 
రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి వారి తాటాకు చప్పుళ్లకు ఏమాత్రం బెదరలేదు.  కోర్టులకు వెళ్లి చంద్రబాబు ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించినా, ఎన్నివిధాలుగా అడ్డుకున్నప్పటికీ అదరకుండా బెదరకుండా న్యాయపోరాటానికి కూడా సిద్ధం అయ్యారు. ఉద్యమ నాటకం మొదలై పది మాసాలు దాటినా కూడా ప్రభుత్వం ఏమాత్రం చలించలేదు.  ఈ లోపలే ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు చంద్రబాబు, ఆయన చెంచా నాయకుల ఆగడాలను తీవ్రంగా గర్హించారు.  ఆ రెండు జిల్లాలు తప్ప మిగిలిన రాష్ట్రం అభివృద్ధి అవసరం లేదా అని చంద్రబాబును నిలదీశారు.  మిగిలిన రెండు ప్రాంతాల్లో తమ పార్టీల పట్ల వ్యతిరేకత తీవ్రం అవుతున్నదని తొందరలోనే గ్రహించిన బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఉద్యమడ్రామాకు దూరం అయ్యాయి.  అమరావతి రైతులు ఎంత గొంతులు చించుకున్నా,  వారికి మిగిలిన జిల్లాల మద్దతు దొరకలేదు.  దాంతో మూడువందల రోజులు దాటేసరికి అమరావతి షామియానాల్లో పదిమంది కూడా కుహనారైతులు మిగలలేదు.  తమ ఆర్తనాదాలు కంఠశోషలుగా మిగిలిపోయాయని క్షుద్ర మీడియాకు కూడా అర్ధమైపోయింది.  దాంతో గత నెలరోజులుగా కులగజ్జి ఛానెళ్లలో అమరావతి ఉద్యమ వార్తలు ఒక నిముషం, రెండు  నిముషాలకు పరిమితం అయిపోయాయి!  
 
చంద్రబాబు కూడా తన వెర్రివేషాలు జగన్ ముందు సాగవని అర్ధం చేసుకుని హైద్రాబాద్ కే  పరిమితం అయిపోయాడు!   ఇంకా చంద్రబాబును గుడ్డిగా సమర్ధిస్తే ప్రజలదృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోతామనే స్పృహ మిగిలిన రాజకీయపార్టీల్లో పొటమరించింది.  చంద్రబాబు జీవితంలో అత్యంత అవమానకరమైన ఘట్టం రాజధాని ఉద్యమం అని చెప్పుకోవచ్చు.  చంద్రబాబు కుతంత్రాలకు సహకరించిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ, జనసేన పార్టీలకు ఇక భవిష్యత్తు ఉండకపోవచ్చు.  
 
 “రాజధానిని ఎందుకు మార్చకూడదు” అని ఈరోజు  హైకోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.  ఈ నేపథ్యంలో రాబోయే ఉగాది లోపలే విశాఖపట్నం రాజధానిగా మారిపోవడం తధ్యం అని తోస్తున్నది.  చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధించక తప్పదు.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు