తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న పోలింగ్. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాల వెల్లడి.. అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది కూడా.!
ఇంతకీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఎక్కడ.? ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలున్నాయంటూ లేనిపోని అనుమానాలు తెరపైకి తీసుకొచ్చారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ బండి సంజయ్. అక్కడి నుంచి అసలు కథ మొదలయ్యింది.
‘కేసీయార్ బాగానే వున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్య అంతే. కోలుకుని, జనం ముందరకు వస్తారు. ఎన్నికల ప్రచారాన్ని ఆయనే ప్రారంభిస్తారు..’ అంటూ కేసీయార్ తనయుడు, తెలంగాణ మంత్రి కేటీయార్ తాజాగా ప్రకటించారు.
అయినాగానీ, అత్యంత కీలకమైన సందర్భంలో కేసీయార్ గైర్హాజరీ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. టిక్కెట్లు దక్కించుకున్న ప్రజా ప్రతినిథులు బీఆర్ఎస్‌ని కాదని, వేరే పార్టీల వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. అయినాగానీ, కేసీయార్ బయటకు రావడంలేదు.
కేటీయార్ మాటల్లో అయితే, కేసీయార్ మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా వున్నారని అర్థమవుతోంది. కానీ, అదొక ‘కుంటి సాకు’ అనుకోవచ్చా.? అన్నది విపక్షాల ప్రశ్న. ఇంతకీ ఏది నిజం.? అసలు కేసీయార్‌కి ఏమయ్యింది.? గులాబీ శ్రేణులు ఒకింత గుబులు చెందుతున్నాయి కేసీయార్ ఆరోగ్యం విషయమై.
కాగా, ప్రస్తుతం వున్న ఈక్వేషన్స్‌ని బట్టి చూస్తే, తెలంగాణలో కేసీయార్‌కి తిరుగు లేదు. కానీ, కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. బీజేపీ అనూహ్యమైన ఫలితాల్ని సాధించే అవకాశమూ లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి. కేసీయార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీ చెబుతోంది.