కేసీయార్.! ఏపీనీ కెలకడం ఎందుకు.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గిల్లుతున్నారు. తెలంగాణలో కరెంటు వెలుగులు అత్యద్భుతమనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లో మగ్గుతోందనీ కేసీయార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమవుతున్నాయి.

దేశ్ కీ నేతా.. అనిపించుకోవాలనుకున్నప్పుడు, ఒకింత సంయమనం పాటించాలి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆలోచనలో వున్నారు కేసీయార్. ఆ చక్రం తిరుగుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీయార్ ఆశలు నీరుగారిపోయాయి. కేసీయార్ భావించినట్లుగా అక్కడ హంగ్ ఏర్పడి, కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే, కేసీయార్ పండగ చేసుకునేవారే. కానీ, అలా జరగలేదక్కడ.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. ఈ నిరాశా నిస్పృహల మధ్య కేసీయార్, తెలంగాణ సమాజం మనసు గెలుచుకునేందుకు, ఆంధ్రప్రదేశ్‌ని తిట్టే పనిలో బిజీగా వున్నారు.

వేసవి కాలం కావడంతో, ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలున్నాయ్. తెలంగాణలోనూ కొన్ని చోట్ల విద్యుత్ కోతలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయినా, తెలంగాణకి ఏపీతో పోలికేంటి.? తెలంగాణ ధనిక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం.

2023లో.. అంటే, ఈ ఏడాది చివర్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఏపీని కెలకడం కేసీయార్ ఆపేస్తే మంచిది.. సీమాంధ్రుల ఓట్లను దృష్టిలో పెట్టుకుని అయినా.!