ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా నిర్వహిచబోతోన్న ఏడు సభల్లోనూ.. మొదటి సభలో ఇప్పటికే ప్రసంగించిన పవన్… మిలియన్ డాలర్ల ప్రశ్నలెన్నో ఫ్యాన్స్ ముందుంచారు. ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా వ్యూహాత్మకంగా జాగ్రత్తపడిన ఆయన.. పరిపూర్ణమైన అస్పష్టతతో ప్రసంగం ముగించారు!
తన ప్రసంగంలో జగన్ ని ఓడించాలి, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలి అన్న స్పష్టత తప్ప… మరే విషయంలో పవన్ జనసైనికులకు, ప్రజానికానికి స్పష్టత ఇవ్వలేదు! ఇది రాజకీయం.. ప్రజలు మాత్రమే గెలుపోటములను నిర్ణయించగల ప్రజాస్వామ్యం. అలాంటప్పుడు జనసైనికులకు క్లారిటీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ… సాధారణ ప్రజానికానికి మాత్రం పవన్ కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. కాని పవన్ కు ఆ క్లారిటీ లేదు!!
అవును… రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలుస్తానని, అసెంబ్లీ గేటు తాకుతానని పవన్ కల్యాణ్ కాన్ ఫి డెంట్ గా చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్లయిన తర్వాత.. ఒక పార్టీకి అధ్యక్షుడిగా పదేళ్లు పనిచేసిన తర్వాత ఇదో కోరికా అనే కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… ఎక్కడనుంచి పోటీ చేస్తే గెలిపించాలనే విషయం చెప్పడానికి మాత్రం పవన్ ధైర్యం చేయలేకపోతున్నారు.
వైసీపీ అధినేత జగన్ కు తన సొంతజిల్లాలోని పులివెందుల నియోజకవర్గం ఉంది. ఇక చంద్రబాబుకూ తన సొంత జిల్లాలోని కుప్పం కానిస్టెన్సీ ఉంది. మరి పవన్ సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని పవన్ ఎందుకు ఫైనల్ చేయడం లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది!
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పవన్ సొంత ఊరు మొగళ్తూరు కాబట్టి… ఆయన నరసాపురం నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. సరే చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వచ్చినట్లు… పవన్ కల్యాణ్ కూడా అదేజిల్లాలో నరసాపురానికి కాస్త దగ్గరలోనే ఉన్న భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కారణం… గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓటమికి స్థానికత కూడా ఒక కారణం అని అప్పట్లో విశ్లేషణలు తెరపైకి వచ్చాయి.
ఇప్పుడు పవన్ కు కూడా అదే పరిస్థితి వస్తే ఎలా అనేది పెద్ద ప్రశ్నాగా ఉంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలోని గాజువాకలో పోటీ చేస్తే పవన్ కు 30% మాత్రమే ఓట్లు వస్తే… సొంత జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేస్తే 32.40% ఓట్లు వచ్చాయి. త్రిముఖ పోటీ జరిగిన గత ఎన్నికల్లో ఈ 2.40% చిన్న నెంబర్ ఏమీ కాదు!
మరి ఈ దిశగా ఆలోచించుకుని భీమవరమే తన నియోజకవర్గం అని పవన్ ఫిక్సవుతారా.. లేక, కేడర్ ను ఇప్పటికీ కన్ ఫ్యూజన్ లో పెడుతూ ఆందోళనకు గురిచేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక్కడ ఆందోళన అనే అంశం ఎందుకు వచ్చిందంటే… 14ఏళ్లు ముఖ్యమంత్రి – 7 సార్లు ఒకేస్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కూడా రెగ్యులర్ గా సొంత నియోజకవర్గాన్ని దర్శించుకుంటున్నారు. పార్టీ గెలుపోటముల సంగతి కాసేపు పక్కనపెడితే.. అధినేత గెలుపు అతిముఖ్యం అని నమ్ముతున్నారు.. అధినేత ఓడిపోతే పార్టీ పరిస్థితి బంగాళాఖాతమే అని భయపడుతున్నారు. మరి ఆ నమ్మకం, ఆ భయం పవన్ కి ఏది?