ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఎన్నికల సంఘం నిద్ర పోతోందా? 

 
 
(వి శంకరయ్య )
 
ఓట్ల దొంగలే దొంగ దొంగ అని అరుస్తూవున్నారు
 
ఎపిలో అధికార ప్రతి పక్ష పార్టీలు రెండూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుండగా వాస్తవంలో ఓటర్ల జాబితా తయారు చేయవలసిన ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తోంది.గతంలో కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి “సారీ” చెప్పి చేతులు దులుపుకున్నారు. ఎపిలో కూడా ఇదే పునరావృతం అవుతుంది? 
 
తెలంగాణ కన్నా తీవ్ర మైన పోటాపోటీ వుండే ఎపిలో ముందుగానే రెండు పార్టీలు మేల్కోన్నాయి. 
పలితంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన విడుదల కాకముందే ఎన్నికల వాతావరణం వచ్చేసింది.
ఎపికి చెందిన ఓటర్ల వ్యక్తి గత సమాచారం హైదరాబాద్ లోని ఐటి గ్రిడ్ సంస్థ చోరీ చేసిందనే అంశంతో వివాదం మొదలైంది. ఇప్పటి వరకు ఆ సంస్థ సిఇఓ తెర వెనుక వున్నాడు. అధికారులు ముందుకు రాలేదు.వస్తే అసలు గుట్టు బయట పడుతుంది. 
 
ఈ సందర్భంలో రెండు అంశాలు కీలకంగా వున్నాయి. 1)ఐటి గ్రిడ్ సంస్థ ఎపి ప్రజలకు చెందిన అధికారిక సమాచారం దొంగిలించినదని లోకేశ్వర రెడ్డి ఫిర్యాదుతో తాము విచారణ చేస్తున్నామని ప్రాథమికంగా ఆధారాలు లభ్యం అయ్యాయని సంస్థ సిఇఓ బయటకు వస్తే మొత్తం గుట్టు అంతా వెలుగు లోనికి వస్తుందని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.
 
2)మరో వేపు ఎపి ముఖ్యమంత్రి వాదన మరోలా వుంది. టిడిపికి ఐటి సేవలు అందించే సంస్థ నుండి తెలంగాణ ప్రభుత్వం తమ సమాచారం చోరీ చేసి వైసిపికి అంద జేసిందని ఆరోపించారు. ప్రభుత్వ సమాచారం ఒక్క ముక్క కూడా చోరీ జరగ లేదని అధికారులు ఇందుకు మద్దతుగా ప్రకటనలు చేశారు.
3)వైసిపి వాదన భిన్నంగా వుంది. ఎపిలో ప్రభుత్వానికి పార్టీకి మధ్య తేడా లేదని సేవా మిత్ర యాప్ పేరుతో ఎపిలోని ఓటర్ల సమాచారం మొత్తం దోచేశారని ఇందుకు ఐటి గ్రిడ్ ఉపయోగ పడిందని ఆరోపిస్తోంది.
 
ఒక పక్క ఎపి ఎన్నికల ప్రధాన అధికారి ఇప్పటికి కేవలం 40 వేల ఓట్లు అధికారికంగా తొలగించ బడ్డాయని ప్రకటించు తుంటే టిడిపి వైసిపి పార్టీలు మాత్రం అధిక మొత్తంలో తమతమ ఓటర్ల పేర్లు తొలగించారని పరస్పరం విమర్శలు చేస్తున్నారు.ఏది నిజమో తేల్చ వలసిన ఎన్నికల సంఘం మూగ నోము పట్టింది. 
ఇదిలా వుండగా ఓటర్ల తొలగింపుకు లక్షల సంఖ్యలో అప్లికేషన్ వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
వాస్తవంలో ఎన్నికల సంఘానికి స్వంత సిబ్బంది లేరు. కేవలం అధికార యంత్రాంగంపై ఆధారపడాలి.
లక్షల సంఖ్యలో వచ్చిన అప్లికేషన్లు గ్రామ లేక వార్డు స్థాయిలో పరిశీలన చేసి నిగ్గు తేల్చడం ఒక విధంగా కత్తి మీద సామే. ఈ లోపు ఎపి ప్రభుత్వం ఓటర్ల తొలగింపు అంశం పక్క దారి పట్టించి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్పు చేయాలని యత్నించు తోంది.
 
ఈ వివాదం మొత్తం ఐటి గ్రిడ్ సేవా మిత్రుల యాప్ లపై ఆధార పడి వున్నందున ఎపి ప్రభుత్వానికి ఇంతకు మించి మరో మార్గం లేదు. ఒక వేళ ఐటి గ్రిడ్ అశోక్ (సిఇఓ) వచ్చితే అతను తీసుకెళ్లిన హార్డ్ డిస్క్ లు సమాచారం బయట పడితే ఎపి ప్రభుత్వమే కాకుండా టిడిపి పార్టీ బోనులో నిలబడ వలసి వుంటుంది
 
మరో గమనార్హమైన అంశమేమంటే ఓట్ల తొలగింపు కోసం ఫారం7 ను తప్పుడుగా సమర్పించిన వారిపై కేసులు నమోదు చేయమని ఎన్నికల సంఘం ఆదేశించింది.
 
తదుపరి పలు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. కాని కేసులు నమోదు చేయబడింది ఏ పార్టీ వారిపైననే సమాచారం బయటికి పొక్కడం లేదు.
 
మొత్తం గొడవలపై భిన్న మైన కథనాలు వండి వార్చుతున్న ఎపిలోని పాపులర్ మీడియాకూడా కోడి గుడ్డు పై ఈకలు పీకుతుంది- గాని ఇప్పటి వరకు నమోదు చేయబడిన కేసులు ఏ పార్టీ వారిపైన అనేది పరిశోధించడం లేదు.
 
ఇదిలా వుండగా ఓట్లు తొలగించడం చేర్చడం మొత్తం వ్యవహారం ఎన్నికల సంఘం పరిధిలో వుంటుంది. ఇప్పటి వరకు టిడిపి గాని వైసిపి లేదా ఇతర పార్టీలు ఏవైనా సరే కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు
చేయలేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఎన్నికల సంఘం సుమోటో గా నైనా జోక్యం చేసుకోక పోవడం ఆశ్చర్యకరమే.
 
టిడిపి నేతలు నిన్న గుంటూరు రూరల్ ఎస్పీ కి మెమోరాండం ఇచ్చారు. ఫలితంగా శృతి మించి మాట్లాడిన తెలంగాణ పోలీసు అధికారికి చెక్ పెట్టి ఓటర్ల తొలగింపు అంశం పక్క దారి పట్టించ నున్నారు.
ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోక పోతే ఎపి ఎన్నికల సజావుగా నిర్వహించడం కుదరదు. తెలంగాణ ఎన్నికల తీరు ఎపిలో మరింత భయంకరంగా ప్రత్యక్షం అవుతుంది.
 
(వి. శంకరయ్య,’సీనియర్ జర్నలిస్టు ఫోన్. 9848394013)