రాజకీయాల్లో ఒక్క ఛాన్స్ రావడం అంటే ఆశామాషీ కాదు. కారణాలు ఏమైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక తెరమరుగైన వాళ్లు రాజకీయాల్లో కోకొల్లలు. సింపుల్ గా చెప్పాలంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లకంటే పోగొట్టుకున్న వాళ్లే చాలా ఎక్కువ. రాజకీయ వైకుంఠపాలి అలా ఉంటుంది మరీ. బుట్టా రేణుక కూడా ఈ జాబితాలో చేరతారు. సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించిన ఆమె కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఇంట్లో ఉంటూనే ఇంగ్లీషుపై అనర్గళమైన పట్టు సాధించారు. ఎంతలా అంటే ప్రెస్ మీట్లో ఆమె ఇంగ్లీషులో మాట్లాడడం మొదలు పెడితే పక్కనున్న కాకలు తీరిన సీనియర్లు కూడా చిన్నబుచ్చుకునే అంత . అకడమిక్ పర్మామెన్స్ బాగానే ఉన్న పొలిటికల్ ఈక్వేషన్లను మాత్రం అర్థం చేసుకోలేకపోయింది. దీంతో ఇంట్లోంచి నేరుగా లోకసభలో అడుగుపెట్టిన ఈమె … అంతే వేగంగా న్యూఢిల్లీ నుంచి తట్టాబుట్టా సర్ధుకొని
మళ్లీ సొంతింటికి తిరిగి రావాల్సి వచ్చింది.
ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆమె రాజకీయ జీవితాన్నితారుమారు చేసేసింది. అప్పట్లో తాను వేసిన తప్పటడుగుకు ఇంకా మూల్యం చెల్లించుకుంటోంది. ఏంటా తప్పు…జగన్ ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు వేసిన పద్మఫ్యూహంలో చిక్కుకోవడమే ఆమె చేసిన అతి పెద్ద తప్పు. అమె చేసిన మొదటి తప్పు తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవమే. తాను వైసిపి తరపున పోటి చేసింది కాబట్టే ఎంపిగా గెలిచానే తప్ప… తనకంటూ ఉన్న అర్హత ఏమిటనేది ఆమె మర్చిపోయారు. జగన్ ని చూసి తనకు ఓట్లు వేశారే కాని తన సత్తాను చూసి కాదన్న విషయాన్ని ఆమె మర్చిపోయారు. ఇది తెలుసుకోలేక పిలిచి టిక్కెట్టు ఇచ్చిన వైసీపీని కాదని చంద్రబాబు ఎరకు చిక్కడంతో కష్టాల పాలయ్యారు. మళ్ళీ ఎన్నికలు వస్తే కాని తను చేసిన తప్పు ఏమిటో తెలుకోలేకపోయారు.
తన భర్త లిక్కర్ వ్యాపారంలో బాగా నష్టపోవడంతో ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీనికి తోడు ఎన్నికల ఖర్చు కూడా తడిసి మోపయ్యాయి. ఇలా ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు తన రాజకీయ జీవితాన్ని చంద్రబాబు చేతిలో పెట్టారు బుట్టా రేణుక. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు బుట్టా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇవ్వడంతో పార్టీ మారినట్లు సమాచారం.
అయితే సరిగ్గా ఎన్నికల నాటికి అప్పటికే కేంద్రమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఆయన వైపే మొగ్గు చూపారు చంద్రబాబు. కోట్ల వారి అంగ అర్థ బలాల ముందు బుట్ట రేణుక చతికిల పడ్డారు. ఆతర్వాత క్రమక్రమంగా టీడీపీలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో మళ్లీ సొంతగూటికి వచ్చేశారు. వ్యక్తిగతంగా సౌమ్యురాలు కావడంతో జగన్ కూడా అడ్డుపడలేదు. అయితే పిలిచి టిక్కెట్టు ఇచ్చి ఎంపీగా గెల్పించుకున్నా పార్టీ మారిందన్న కారణంగా ఇప్పుడు వైసీపీలో అంత ప్రాధాన్యం లేదు. ఇలా రెంటికీ చెడిన రేవడిలా తయారైంది బుట్టా రేణుక పరిస్థితి.