కేసిఆర్ పలువరించిర్రు… ఎవరీ కాంగ్రెస్ స్వప్నారెడ్డి ?

తెలంగాణలో స్వప్నారెడ్డి పేరు ఇప్పుడు మరోసారి మారుమోగిపోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ కాడ జనాలు చర్చించే పేరు స్వప్నారెడ్డే. ఆమె ఇప్పుడు పాపులర్ అయిపోయారు. గ్రామీణ రాజకీయాల్లో స్వప్నారెడ్డి పేరు లేకుండా చర్చలు లేవు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ స్వప్నారెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆమె పేరును గతంలో తెలంగాణ సిఎం కార్యాలయం వెలువరించిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వెనువెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్ స్వప్నారెడ్డి పేరును ఉటంకిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల హడావిడి నేపథ్యంలో స్వప్నారెడ్డి పేరును కేసిఆర్ మళ్లీ తన నోటినుంచి ఉచ్చరించారు. కేసిఆర్ టార్గెట్ చేసి మాట్లాడారు కాబట్టే స్వప్నారెడ్డి పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఏకంగా తెలంగాణ సిఎం కేసిఆరే పలువరించిర్రంటే.. ఇంతకీ ఎవరీ స్వప్నారెడ్డి అని జనాలు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ ఎవరీ స్వప్నారెడ్డి? ఆమె ఎందుకు సర్పంచ్ ఎన్నికల వేళ హాట్ టాపిక్ అవుతున్నారు? పూర్తి వివరాలు చదవండి. 

వంటరి స్వప్నారెడ్డి భర్త మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని అంధోల్ మండలంలో పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్. గత ఐదేళ్ల పాటు సర్పంచ్ గా గ్రామానికి సేవలందించారు. స్వప్నారెడ్డి ఉన్నత చదువులు చదివారు. తన భర్త మధుసూదన్ రెడ్డి (ప్రభు రెడ్డి) ప్రోత్సాహం మేరకు ఆమె గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు. భర్త మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ లోని రంగారెడ్డి కోర్టులో అడ్వకెట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లోకి స్వప్నారెడ్డి

స్వప్నారెడ్డి తల్లిదండ్రులు మల్లన్నగారి చెన్నంరెడ్డి, నర్సమ్మ. పుట్టి పెరిగిన గ్రామం ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం, ఇబ్రహింబాద్. ప్రస్తుతం స్వప్నారెడ్డి సోదరుడే మల్లన్నగారి జితేందర్ రెడ్డి ఇబ్రహింబాద్ గ్రామానికి సర్పంచ్ గా ఉన్నారు. స్వప్న టెన్త్ వరకు జోగిపేట్ లోని చైతన్య మహా విద్యాలయలో చదివారు. ఇంటర్, డిగ్రీ చదువు హైదరాబాద్ లోని రెడ్డి ఉమెన్స్ కాలేజిలో పూర్తి చేశారు. పిజి జువాలజీ హైదరాబాద్ లోని అమృత్ కపాడియా మొమోరియల్ నవజీవన్ కాలేజ్ లో పూర్తి చేశారు. తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో వెస్లీ బిఇడి కాలేజీలో బిఇడి చదివారు. విద్యార్థి దశలో ఆమె ఎన్ఎస్ యుఐ విద్యార్థి సంఘంలో పనిచేశారు.

స్వప్నారెడ్డికి మధుసూదన్ రెడ్డితో 2003లో వివాహం జరిగింది. 5 ఏళ్లుగా పోసాని పేట్ గ్రామ సర్పంచ్ గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని స్వప్నారెడ్డి గ్రహించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో కాకుండా తూతూ.మంత్రంగా సర్కారు ఎన్నికల నిర్వహణకు పూనుకుంది. రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో కాకపోవడంతో ఆమె సర్కారు చర్యలను ఎండగట్టే ఉద్దేశంతో తన భర్త సహకారంతో హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అందులో రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. దీంతో హైకోర్టు ఆమెవాదనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశాన్ని తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రస్తావించారు. బిసిలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటూ మండిపడ్డారు. అంతేకాదు స్వప్నారెడ్డి అనే సర్పంచ్ చేత కాంగ్రెస్ పార్టీ కేసు వేయించిదని కూడా కేసిఆర్ ఆరోపించారు.

నేను వేసిన కేసుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు : స్వప్నారెడ్డి

అయితే తన కేసుకు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని స్వప్నారెడ్డి వాదిస్తున్నారు. పోసానిపేట్ లో గడిచిన 50 ఏళ్ల కాలంలో సర్పంచ్ సీటు ఒక్కసారి కూడా జనరల్ కేటగిరీ కాలేదని ఆమె అంటున్నారు. ప్రతి సందర్భంలోనూ రిజర్వేషన్ కావడంతో రాజకీయాల్లో ఉన్న తమ కుటుంబం పోటీ చేసే అవకాశమే రాలేదన్నారు. గతసారి జనరల్ మహిళ కావడంతో తాను పోటీ చేశానని ‘తెలుగురాజ్యం’ కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఇతరులపై నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఈ కేసు విషయంలో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు. కేసిఆర్ సర్కారు సుప్రీంకోర్టులో కేసు వేసినా, తాము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మెదక్ జిల్లాలో హాట్ టాపిక్

స్వప్నారెడ్డి పేరును లేవనెత్తి సిఎం కేసిఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడంతో స్వప్నారెడ్డి ఎవరబ్బా అని అందరూ చర్చించుకున్నారు. పోసానిపేట్ సర్పంచ్ స్వప్నారెడ్డి అని తెలియడంతో అందరూ ఆమె గురించి ఆరా తీశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్ధండ నేతలు దామోదర రాజనర్సింహ్మ, సునితా లక్ష్మారెడ్డి తదితరులు స్వప్నారెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు తెలంగాణ సిఎం కేసిఆర్ ఈ కేసును సాకుగా చూపుతున్నారని, ఈ విషయంలో సర్కారు వైఖరిని ఎండగట్టాలని వారు నిర్ణయించుకున్నారు. సిఎం స్థాయి నేత చిన్న గ్రామానికి సర్పంచ్ అయిన తమ పేరును తీసుకుని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడాన్ని తాము అస్సలు ఊహించలేదని ఆమె అన్నారు.