గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున చాలామంది సీనియర్ నాయకులు బరిలో నిలిచారు. వారిలో కొద్దిమంది మాత్రమే గెలుపొందారు. వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడ ఒకరు. ఈయన పార్టీలో చాలా సీనియర్ నేత. రాజమండ్రిలో పార్టీని నిలబెట్టడంలో కీలక భూమిక పోషిస్తుంటారు. కానీ పార్టీలో మాత్రం ఆయనకు నిత్యం ఎదురుగాలి వీస్తూనే ఉంటుంది. బయట గెలవగలుగుతున్నారు కానీ ఇంట నెగ్గుకురాలేకపోతున్నారు. ఎన్నిసార్లు గెలిచినా చంద్రబాబు నాయుడు వద్దనే ఆయనకు సరైన ప్రాముఖ్యత దక్కలేదని అంటుంటారు. ఏనాడూ ఆయన ఆశించినట్టు అధిష్టానం నిర్ణయాలు తీసుకోలేదని చెబుతుంటారు. ఈ అసంతృప్తి చౌదరిగారిలో కూడ ఉంది.
నిజానికి ఆయన రాజమండ్రి అర్బన్ టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు కనికరించలేదు. రూరల్ టికెట్ ఇచ్చి పోటీచేస్తే చేయండని అనేశారు. అర్బన్ టికెట్టును ఆదిరెడ్డి భవానీకి ఇచ్చారు. తనను కాదని వైసీపీ నుండి వచ్చిన భావానీకి టికెట్ ఇవ్వడాన్ని బుచ్చయ్య చౌదరి జీర్ణించుకోలేకపోయారు. ఫ్యాన్ గాలిని తట్టుకుని రూరల్ నుండి గెలిచినా కూడ అర్బన్ నియోజకవర్గ విషయాల్లో కలుగజేసుకునే ప్రయత్నం మాత్రం మానలేదు. దీంతో ఆదిరెడ్డి భవానీ గట్టిగానే ప్రతిఘటించారు. ఒక దశలో పార్టీని వీడతామనే సంకేతాలు కూడ పంపారు చంద్రబాబుకు. దీంతో బుచ్చయ్య చౌదరిని తన నియోజకవర్గానికే పరిమితం కావాలని బాబుగారు సూచించారు.
అయినా చౌదరిగారిలో కోపం తగ్గలేదు. అర్బన్ మీద మోజుతో సొంత నియోజకవర్గాని పట్టించుకోవడం మానేశారు. పార్టీ కార్యకలాపాల్లో కూడ స్పీడ్ తగ్గించారు. వారసుడిని పైకి తీసుకురావాలనే యోచనలో ఉన్న ఆయన తన ప్రాభవాన్ని తగ్గించుకుని కొడుకుని ముందుకుతీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కలిసి టీడీపీ శ్రేణుల్లో ఆయన పలుకుబడిని డ్యామేజ్ చేశాయి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీదే పైచేయి అయింది. ఎమ్మెల్యే ఉన్నా కూడ తెలుగుదేశం ఆశించిన రీతిలో పంచాయతీలను గెలవలేకపోయింది. తెలుగు తమ్ముళ్లు కూడ చేయాల్సిన రీతిలో పనిచేయలేదనే మాట కూడ ఉంది. అసలు ఎమ్మెల్యే పార్టీని పట్టించుకుంటే కదా శ్రేణులు ఆయన్ను పట్టించుకునేది అంటున్నారు.