యువీ, రోహిత్ రికార్డులు బ్రేక్.. ఆసియా కప్ లో దుమ్మురేపుతున్న అభిషేక్ శర్మ..!

ఆసియా కప్‌ 2025లో టీమిండియా ఆటగాడు.. అభిషేక్ శర్మ.. తన పవర్‌హిట్టింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తూనే, మరోవైపు కొత్త రికార్డులు సృష్టిస్తూ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీ రాసుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌పై సూపర్ 4 మ్యాచ్‌లో అతను చేసిన బ్యాటింగ్ ప్రదర్శన చూసిన అభిమానులు ఇతడే.. భవిష్యత్ టీమిండియా స్టార్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 37 బంతుల్లోనే 75 పరుగులు చేసిన అభిషేక్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 202.70 స్ట్రైక్ రేట్‌తో దుమ్మురేపాడు. సెంచరీ వైపు దూసుకుపోతున్న సమయంలో రిషద్ హుస్సేన్ అద్భుతమైన త్రోతో రనౌట్ అయ్యాడు.

ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ తన గురువు యువరాజ్ సింగ్‌ను వెనక్కు నెట్టేశాడు. 25 బంతుల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో ఐదు సార్లు హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఇప్పుడు అతని సొంతం. యువరాజ్ తన కెరీర్‌లో నాలుగు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించాడు. అంటే శిష్యుడు ఇప్పుడు గురువును మించిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ జాబితాలో ఏడు హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, అభిషేక్ వేగం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లను అధిగమించి, 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఐదు సార్లు యాభై ప్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విభాగంలో తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. పవర్‌ప్లేలో అభిషేక్ ఆరంగేట్రం లాంటిదే. ఈ ఆసియా కప్‌లో ఇప్పటివరకు పవర్‌ప్లేలో అతను ఒక్కడే 12 సిక్సర్లు బాదాడు. శ్రీలంక మొత్తం జట్టు కొట్టిన సిక్సర్ల సంఖ్య కూడా అంతే 12 కావడం గమనార్హం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ చెరో 7 సిక్సర్లు మాత్రమే కొట్టగా, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్ చెరో 2 సిక్సర్లు మాత్రమే కొట్టాయి. హాంకాంగ్ అయితే కేవలం ఒక సిక్సర్‌తో సరిపెట్టుకుంది.

ఇక మొత్తం టోర్నమెంట్ గణాంకాలు చూస్తే అభిషేక్ శర్మ దూకుడు మరింత స్పష్టమవుతుంది. ఇప్పటివరకు 248 పరుగులు చేసి, సగటు 49.6తో అగ్రస్థానంలో నిలిచాడు. అతని బ్యాట్‌ నుంచి 23 ఫోర్లు, 17 సిక్సర్లు వచ్చాయి. ఇది అతని తొలి ఆసియా కప్ అయినా, ఇప్పటికే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో ఫేవరెట్‌గా నిలిచాడు. నిపుణుల అంచనాల ప్రకారం, ఇలాంటి ఫామ్ కొనసాగిస్తే అభిషేక్ శర్మ త్వరలోనే భారత్‌ టీ20 స్పెషలిస్టుగా మారడం ఖాయం. యువరాజ్ సింగ్ నుంచి పాఠాలు నేర్చుకున్న శిష్యుడు, ఇప్పుడు తనకంటూ కొత్త లెజెండ్‌గా ఎదుగుతున్నాడని క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా గుర్తిస్తోంది.