ఆసియా కప్ ఫైనల్‌లోకి టీమిండియా.. బంగ్లాపై గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బెర్త్ ఖరారు..!

ఆసియా కప్‌ 2025 సూపర్‌-4లో టీమిండియా మరో విజయం నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచి, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయగా, అభిషేక్ శర్మ మరోసారి తన పవర్‌హిట్టింగ్‌తో మ్యాచ్‌ను రంగరించాడు.

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ కోల్పోయిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. పవర్‌ప్లే నుంచే దూకుడు చూపించిన ఓపెనర్లు బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకంగా అభిషేక్ శర్మ తన బ్యాట్ నుంచి మంటలు రేపాడు. కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు నమోదు చేసిన ఈ యువ బ్యాటర్, 6 ఫోర్లు, 5 సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ 29 పరుగులతో సహకరించాడు. ఈ జంట వేగంగా రన్స్ కూర్చడంతో ఒకానొక దశలో భారత స్కోరు 200 దాటుతుందని అనిపించింది.

అయితే వీరిద్దరూ ఔటయ్యాక పరిస్థితి మారిపోయింది. తర్వాత బ్యాటర్లు తడబడ్డారు. వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో హార్దిక్ పాండ్య (38 పరుగులు, 29 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గౌరవప్రద స్థితికి చేర్చాడు. బంగ్లాదేశ్ తరఫున రిషాద్ హొస్సేన్ 2 వికెట్లు, సకీబ్, రెహ్మాన్, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.

ఇక 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ప్రారంభం నుంచే కష్టాల్లో పడింది. ఇండియన్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక్క ఓపెనర్ సైఫ్ హాసన్ (69 పరుగులు) తప్ప ఇంకెవరూ నిలదొక్కుకోలేకపోయారు. బ్యాటింగ్ లైన్ అప్ పూర్తిగా కుప్పకూలడంతో, 127 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి బంగ్లా బ్యాటింగ్‌ను గందరగోళంలోకి నెట్టాడు. బుమ్రా, వరుణ్ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్‌తో సహకరించారు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ ఫైనల్ టికెట్ ఖరారు చేసుకుంది.

ఈ విజయంతో ఆసియా కప్‌లో భారత్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఫామ్, ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే, టీమిండియా ఈ సారి ట్రోఫీని ఎత్తిపడేయడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.