తెలంగాణ రాజకీయమ్.! కేసీయార్ ఇప్పుడేం చేయబోతున్నారు.!

ఇప్పటికప్పుడు కొత్త ప్రభుత్వంపై విమర్శలేం చేయలేం.! కొంత సమయం ఇద్దాం.! ఆ తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిద్దాం.! ప్రజా తీర్పుని గౌరవిద్దాం.! వైఫల్యాల్ని సరిదిద్దుకుని, మరింత బలంగా జనంలోకి వెళదాం.. ప్రజాభిమానాన్ని చూరగొందాం.!

బీఆర్ఎస్ అధినేత కేసీయార్, తనను కలిసిన గులాబీ ఎమ్మెల్యేలతో చేసిన తాజా వ్యాఖ్యల సారాంశమిది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీయార్, ముచ్చటగా మూడోసారి అధికార పీఠమెక్కుదామనుకున్నారుగానీ.. కుదరలేదు.! హ్యాట్రిక్ సాధ్యపడలేదు.!

మరీ దారుణమైన ఓటమి ఏమీ కాదు. మరీ అంతగా నిరుత్సాహపడాల్సిన ఫలితాలు కూడా కావు. కాకపోతే, అధికార పీఠమెక్కలేకపోయారంతే కేసీయార్.! వాట్ నెక్స్‌ట్.? ‘ఇంక్యుబేషన్ పీరియడ్’ తర్వాత తర్వాత కేసీయార్ ఏం చేయబోతున్నారు.? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

గులాబీ పార్టీకి మొత్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు దక్కింది. ఈ నంబర్‌తో కేసీయార్ తనదైన స్టయిల్లో మ్యాజిక్ చేయగలరు. కానీ, చెయ్యడంలేదు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఎవరో తేల్చుకోలేని గందరగోళ పరిస్థితుల్లో వుండటం కేసీయార్‌కి కలిసొచ్చిన అంశమే.

కాంగ్రెస్ పార్టీని గతంలో కుక్కలు చింపిన విస్తరిలా మార్చింది, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది. మళ్లీ అదే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి ఆయా నేతలు తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. అప్పుడు, గులాబీ పార్టీ మరింత బలపడుతుంది. ఆ సమయం కోసం కేసీయార్ వేచి చూడటం తప్ప, ఇప్పుడు చేసేదేమీ వుండదు.

రేవంత్ రెడ్డి సహా, దాదాపు డజను మంది ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతుండడంతో, కేసీయార్ చక్రం తిప్పడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అది, లోక్ సభ ఎన్నికల నాటికి జరుగుతుందా.? అంతేనేమో.!